Tuesday, 11 Aug, 2.38 am నమస్తే తెలంగాణ

తాజావార్తలు
పైమందుపై పరేషాన్‌ వద్దు!

  • l రాష్ట్రంలో అందుబాటులో తగినంత యూరియా
  • l ఇప్పటికే 6.29 లక్షల టన్నులు కొన్న రైతులు
  • l క్షేత్రస్థాయిలో ఇంకా లక్ష టన్నుల యూరియా
  • l త్వరలో కేంద్రం నుంచి 2.50 లక్షల టన్నులు రాక
  • l సాగు పెరుగడంతో రైతుల నుంచి భారీ డిమాండ్‌
  • l ఆందోళనతో ముందస్తుగా కొంటున్న అన్నదాతలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వానకాలం సాగు విస్తీర్ణం కోటి ఎకరాలు దాటింది. అందుకనుగుణంగా ప్రభుత్వం అవసరమైన ఎరువులను సిద్ధంచేసింది. వానకాలం సాగుకు అవసరమైన యూరి యా అందుబాటులో ఉన్నదని, అన్నదాతలు ఎవరూ అందోళన చెందవద్దని వ్యవసాయశాఖ సూచిస్తున్నది. ఈ సీజన్‌లో 10 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేయగా.. ఇందులో ఇప్పటికే 6.29 లక్షల టన్నుల యూరియా రైతుల వద్దకు చేరింది. క్షేత్రస్థాయి లో డీలర్లు, సొసైటీలు, మార్క్‌ఫెడ్‌, కంపెనీ గోడౌన్‌లలో లక్ష టన్నులు అందుబాటులో ఉన్నది. కేంద్రం నుంచి త్వరలో 2.5 లక్షల టన్నులు రానున్నది. కేంద్రం నుంచి రావాల్సినదానిలో ఇప్పటికే 7,267 టన్నులు రవాణా దశలో ఉన్నది. ఇది ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రానికి చేరనున్నది. మరో 13,700 టన్నులు విజయపురి, సూరత్‌, మహారాష్ట్ర, వైజాగ్‌, కాకినాడ పోర్టుల్లో లోడింగ్‌కు సిద్ధం గా ఉన్నది. ఇవికూడా రాష్ర్టానికి చేరితే సుమారు 1.21 లక్షల టన్నుల యూరియా క్షేత్రస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో వానకాలం సీజన్‌లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండటంతో ఎరువులకు కూడా భారీ డిమాండ్‌ ఏర్పడుతుందని ముందే అంచనావేసిన సీఎం కేసీఆర్‌.. ఎరువులపై స్వయంగా కేంద్రానికి లేఖ రాశారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అన్నిరకాల ఎరువులకు భారీగా డిమాండ్‌ పెరిగింది. గతేడాది అన్నిరకాల ఎరువులు కలిపి ఏప్రిల్‌ 1 నుంచి ఆగస్టు 7వరకు 6,98,946 టన్నులు విక్రయించగా.. ఈసారి ఏకంగా 14,46,024 టన్నులు అమ్మకాలయ్యాయి. సాగు విస్తీర్ణం పెరుగ టం వల్లే విక్రయాలు రెట్టింపయ్యాయని అధికారులు పేర్కొన్నారు. యూరియా కొరతపై వస్తున్న అసత్య వార్తలను నమ్ముతున్న రైతులు ముందస్తుగానే కొనుగోలు చేసుకొని నిల్వ పెట్టుకుంటున్నట్టు తెలుస్తున్నది. దీంతో ఎరువుల కొనుగోలు, వినియోగంపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

ఎరువుల వాడకాన్ని తగ్గించండి.. రైతులకు మంత్రి నిరంజన్‌రెడ్డి పిలుపు

వ్యవసాయంలో ఎరువుల వాడకాన్ని భారీగా తగ్గించాల ని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి రైతులకు సూచించారు. మోతాదుకు మించి ఎరువుల వాడకం వల్ల తెగు ళ్లు, పురుగుల బెడద ఎక్కువవుతుందని చెప్పారు. సోమవారం జూబ్లీహిల్స్‌ సెరికల్చర్‌ కార్యాలయం లో వానకాలం ఎరువుల సరఫరాపై ఫర్టిలైజర్స్‌ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. వానకాలంలో ఇప్పటికే 1.17కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయన్నారు. కేంద్రం తెలంగాణ కు 22.30 లక్షల టన్నుల ఎరువులను కేటాయించగా, సోమవారం వరకు 16.15 లక్షల టన్నులు సరఫరా చేసిందని తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతుబీమా చెల్లించినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు

కరోనా కష్టకాలంలోనూ రైతుబీమా పథకం ప్రీమియం చెల్లించిన సీఎం కేసీఆర్‌కు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 2020-21 సంవత్సరానికిగాను ప్రభుత్వం రైతుబీమా కోసం రూ.1,173.54 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఈ ప్రీమియం ఈ ఏడాది ఆగస్టు 14 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 13 వరకు వర్తిస్తుందని తెలిపారు. రెండేండ్లలో 32,267 మంది రైతు కుటుంబాలకు బీమా చెల్లించినట్టు పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top