Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Paper plates | పేపర్‌ ప్లేట్లుగా గ్రూప్‌-3 ప్రశ్నాపత్రాలు..! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ బేకరీలో వినియోగం

Paper plates | పేపర్‌ ప్లేట్లుగా గ్రూప్‌-3 ప్రశ్నాపత్రాలు..! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ బేకరీలో వినియోగం

  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ బేకరీలో వినియోగం
  • 2024లో జరిగిన ఎగ్జామ్‌ పేపర్లుగా గుర్తింపు
  • టీజీపీఎస్సీ ప్రశ్నాపత్రాల భద్రతపై అనుమానాలు
  • నెల రోజుల క్రితం రోడ్డుపక్కన ఓఎమ్మార్‌ షీట్లు

హైదరాబాద్‌, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును నిర్ణయించే పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు చివరకు పేపర్‌ ప్లేట్లుగా వినియోగించిన ఉదంతం రాష్ట్రంలో వెలుగుచూసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ బేకరీలో వీటిని పేపర్‌ప్లేట్లుగా, మిక్చర్‌ పొట్లాలుగా వినియోగించిన వైనం బయటపడింది. వీటిని పరిశీలిస్తే 2024లో నిర్వహించిన గ్రూప్‌ -3 ఎగ్జామ్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాలుగా అభ్యర్థులు చెబుతున్నారు. వీటిని కొందరు ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ ఘటనతో రాష్ట్రంలో పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల భద్రతపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోప్యతపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఓ ప్రశ్నాపత్రంపై పింక్‌ కలర్‌ కోడ్‌ ఉండటం గమనార్హం. అశోక్‌నగర్‌లోని మరో టీ స్టాల్‌లోనూ ప్రశ్నాపత్రాలను పేపర్‌ప్లేట్లుగా మార్చి వినియోగిస్తున్నట్టు ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

భద్రత ఎకడ?
సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రశ్నాపత్రం ఒక అభ్యర్థికి చెందినది అనుకునే వీల్లేదు. ఎందుకంటే ప్రశ్నాపత్రంపై ముద్రించిన కోడ్స్‌ భిన్నంగా ఉన్నాయి. ఒక ప్రశ్నాపత్రం కోడ్‌ 30తో ముగియగా, మరో ప్రశ్నాపత్రం కోడ్‌ 32తో ముగిసింది. అంటే ఇవి బల్క్‌గానే బయటికి వచ్చాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గ్రూప్‌ -3 పరీక్షలు ముగియగా, ఫలితాలు కూడా ప్రకటించారు. నియామకపత్రాలు సైతం అందజేశారు. అయితే పాత ప్రశ్నాపత్రాలు అనుకున్నా వీటిని ధ్వంసం చేసేందుకు పటిష్ట నిబంధనలు ఉన్నాయి. వీటిని నాశనం చేయడం లేదా చింపివేసేందుకు గైడ్‌లైన్స్‌ ఉన్నాయి. వాస్తవానికి పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల భద్రతకు జాగ్రత్తలు తీసుకుంటున్నామని కమిషన్‌ చెబుతున్నా ప్రశ్నాపత్రాలు, ఓఎమ్మార్‌ షీట్లు బయటకు రావడం కలకలం సృష్టిస్తున్నది.

అభ్యర్థుల్లో ఆందోళనలు..
పోటీ పరీక్షల నిర్వహణలో ప్రశ్నాపత్రాలు, ఓఎమ్మార్‌ షీట్ల భద్రత అత్యంత కీలకం. గ్రూప్‌ -3 ప్రశ్నాపత్రాలు బేకరీలో పేపర్‌ ప్లేట్లుగా ఉపయోగించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రశ్నాపత్రాల నిల్వ, తరలింపు సమయంలో నిబంధనలు పాటించారా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక వేళ వినియోగించని ప్రశ్నాపత్రాలైతే టీజీపీఎస్సీ కస్టడీలో ఉండాలి. ఇలాంటి ఘటనలతో పరీక్షల నిర్వహణపై అభ్యర్థుల్లో నమ్మకం దెబ్బతినే అవకాశమున్నదని నిరుద్యోగ జేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ప్రశ్నాపత్రాలు బయటకు ఎలా వచ్చాయో తేల్చాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

రోడ్డుపకన ఓఎమ్మార్‌ షీట్లు..
ఇలాగే జూలై చివరి వారంలో శివరాంపల్లిలో పీవీఎన్నార్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే సమీపంలో ఓఎమ్మార్‌ షీట్లు ప్రత్యక్షమయ్యాయి. ఇవి హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ రిక్రూట్‌మెంట్‌ 2018కి చెందినవిగా అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్న కమిషన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు సెక్షన్‌ అధికారులను సస్పెండ్‌ చేసింది. మరో నలుగురు అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. రికార్డుల రవాణా, నిర్వహణలో కాంట్రాక్టర్‌ తీవ్ర నిర్లక్ష్యంగా భావించినట్టు గుర్తించిన కమిషన్‌.. సదరు కాంట్రాక్టర్‌కు ఇచ్చిన వర్క్‌ ఆర్డర్‌ను రద్దు చేసింది. అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana