Patriot | మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్ర కథానాయకులు మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'పేట్రియాట్' ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.
మహేష్ నారాయణన్ దర్శకత్వంలో పొలిటికల్ అండ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 (ZEE5) ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా.. జూన్ 5 నుంచి ఈ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు జీ5 వెల్లడించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది.
మమ్ముట్టి, మోహన్‌లాల్ చాలా కాలం తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోవడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవగా, ఇందులో ఫహాద్ ఫాజిల్ ప్రధాన విలన్ పాత్రలో నటించారు. నయనతార, కుంచాకో బోబన్, రేవతి వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. నేషనల్ సెక్యూరిటీ, ప్రభుత్వ నిఘా నెట్‌వర్క్ మరియు అంతర్జాతీయ కుట్రల చుట్టూ సాగే ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను థియేటర్లలో మిస్ అయిన వారు జూన్ 5 నుండి జీ5లో వీక్షించవచ్చు.

