PM Modi : పాకిస్తాన్ అంటేనే ఎలాంటి విలువలు లేని దేశం. నీచ బుద్ధికి నిదర్శనం. తాజాగా పాక్ చేసిన పని ఇందుకు మరో ఉదాహరణ. భారత ప్రధాని మోదీతోపాటు పాక్ ప్రధాని షరీఫ్ ఉన్న ఒక గ్రూప్ ఫొటోలో..
మోదీని కట్ చేసి పోస్ట్ చేసింది పాక్ ప్రధాని కార్యాలయం. కిర్గిస్తాన్‌లో జరుగుతున్న ఎస్‌సీవో సదస్సులో భారత ప్రధాని మోదీతోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తోపాటు మొత్తం 10 దేశాల అధినేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంగళవారం నేతలంతా కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నారు. ఈ ఫొటోల్ని వివిధ దేశాలు తమ ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశాయి. అయితే, పాకిస్తాన్ ఇక్కడే కపటబుద్ధి చూపించింది. గ్రూప్ ఫొటోలో మోదీ లేకుండా.. అసలైన ఫొటోను క్రాప్ చేసి పోస్ట్ చేసింది. పాక్ పోస్ట్ చేసిన ఆ ఫొటోలో పుతిన్, జిన్‌పింగ్, షెహబాజ్ షరీఫ్ వంటి నేతలున్నారు. మోదీతోపాటు మరికొందరు నేతలు లేరు. వారు కనిపించిన భాగాన్ని క్రాప్ చేసింది. అది కూడా పాక్ ప్రధాని నేతల మధ్యలో ఉన్నట్లుగా కట్ చేసి, పోస్ట్ చేసింది.
ఇండియా, పాక్ మధ్య విబేధాలున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఇలాంటి అంతర్జాతీయ వేదికలపై నేతలు కలుసుకున్నప్పుడు పరస్పరం గౌరవించుకుంటారు. ఆయా దేశాలు, దేశాధినేతలు ఇలాంటి సందర్భాల్లో హుందాగా వ్యవహరిస్తుంటారు. కానీ, పాక్ మాత్రం ఒక అంతర్జాతీయ ఈవెంట్‌ను అల్ప బుద్ధితో తగ్గించేసింది. నేరుగా పాక్ ప్రధాని కార్యాలయమే ఈ పని చేయడం విశేషం. ఒక దేశ ప్రధాని కార్యాలయం వ్యవహరించాల్సిన తీరు ఇది కాదనేది విశ్లేషకుల మాట. మరోవైపు.. మోదీ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో దీనికి సంబంధించిన ఫొటోల్ని పంచుకున్నారు.
అందులో పాక్ ప్రధాని కూడా ఉన్నారు. అందరితో కూడి ఉన్న ఫొటోలను ఆయన షేర్ చేశారు. ఇది హుందాతనానికి నిదర్శనం. మరోవైపు పాక్ షేర్ చేసిన ఫొటోలపై భారతీయులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆ ఫొటోకు మార్ఫింగ్‌లు చేసి, మన ఇండియన్లు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఆ పోస్ట్ కింద కామెంట్లు, మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు.

