Polio | పోలియో అత్యంత వేగంగా వ్యాపించే వైరస్ సంబంధిత వ్యాధి. ఇది సోకితే శాశ్వత పక్షవాతం ఏర్పడడంతోపాటు, తీవ్రమైన సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన దిశగా గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, పూర్తిస్థాయిలో వ్యాధిని అంతం చేయలేకపోయారు. భారత్‌కు 2014లో పోలియో రహిత దేశంగా గుర్తింపు లభించింది. ఈ విజయాన్ని కొనసాగించాలంటే పిల్లలందరికీ టీకాలు వేయించడం, ప్రజల్లో అవగాహన పెంచడం చాలా ముఖ్యం. ప్రపంచంలోని ఏదో ఒక ప్రాంతంలో పోలియో వైరస్ వ్యాప్తిలో ఉన్నంతకాలం, ఇప్పటికే వ్యాధిని నిర్మూలించిన దేశాల్లోకి కూడా అది తిరిగి ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. అందుకే నోటిద్వారా పోలియో చుక్కలు వేయించిన పిల్లలకు మళ్లీ ఇంజెక్షన్ ఎందుకు వేయాలి? పల్స్ పోలియో కార్యక్రమాల్లో అదనపు చుక్కలు ఎందుకు ఇస్తారు? అనే సందేహాలు తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతుంటాయి.
నోటి ద్వారా ఇచ్చే ఓపీవీ టీకా..
నోటిద్వారా ఇచ్చే ఓపీవీ టీకాలో బలహీనపరిచిన పోలియో వైరస్ ఉంటుంది. ఇది పేగుల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పోలియో వైరస్ ప్రధానంగా పేగుల్లోనే వృద్ధి చెందుతుంది కాబట్టి, అక్కడ వైరస్ పెరుగుదలను తగ్గించడంతోపాటు మల విసర్జన ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. పారిశుద్ధ్య సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రక్షణ మరింత కీలకం. ఇంజెక్షన్ అవసరం లేకుండా నోటిద్వారా సులభంగా ఇవ్వగలగడం, తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండడం వల్ల పెద్ద సంఖ్యలో పిల్లలకు టీకాలు వేయించే పల్స్ పోలియో కార్యక్రమాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. అయితే ఇందులో బలహీనపరిచిన సజీవ వైరస్ ఉండడం వల్ల చాలా అరుదుగా టీకా సంబంధిత పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. టీకాలు వేయించుకున్న కొందరిలో ఈ వైరస్ కొంతకాలం మలంలో, గొంతులో ఉండి బయటకు విడుదల అవుతుంది. టీకాలు వేయించుకోని వారికీ వ్యాపించే అవకాశం ఉంటుంది. తగినంత మంది టీకాలు వేయించుకోని ప్రాంతాల్లో ఈ వైరస్‌లో మార్పులు జరిగి, టీకా నుంచి ఉద్భవించిన వైరస్‌గా వ్యాప్తి చెందే అరుదైన ప్రమాదం కూడా ఉంటుంది.
ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే ఐపీవీ టీకా..
ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే ఐపీవీ టీకాలో క్రియారహితం చేసిన పోలియో వైరస్ ఉంటుంది. ఇది శరీరంలో వృద్ధి చెందదు, వ్యాధిని కలిగించదు. రక్తంలో ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి, వైరస్ నాడీ వ్యవస్థపై దాడి చేయకుండా, పక్షవాతం రాకుండా బలమైన రక్షణ కల్పిస్తుంది. పోలియో వైరస్‌లోని మూడు రకాల నుంచి రక్షణ అందిస్తుంది. ఇందులో సజీవ వైరస్ ఉండదు కాబట్టి టీకా కారణంగా పక్షవాతం వచ్చే ప్రమాదం లేదు. అయితే గతంలో సజీవ పోలియో వైరస్‌ను ఎదుర్కోని పిల్లల్లో పేగుల్లో రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం ఓపీవీతో పోలిస్తే ఐపీవీకి తక్కువగా ఉంటుంది. అందువల్ల ఐపీవీ తీసుకున్న పిల్లలకు పేగుల్లో వైరస్ సోకే అవకాశం పూర్తిగా తొలగిపోదు. ఈ రెండు టీకాలు వేర్వేరు విధాలుగా రక్షణ కల్పిస్తాయి. ఓపీవీ వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో, ఐపీవీ వ్యక్తిగతంగా పక్షవాతం నుంచి రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే రెండింటినీ కలిపి ఉపయోగించడం అవసరం.
ఏ వయస్సులో వేయించాలి..
భారత్‌లో జనసాంద్రత, ప్రజల రాకపోకలు, పారిశుద్ధ్య పరిస్థితుల్లో తేడాలు వంటి అంశాల వల్ల పోలియో వ్యాప్తి ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. సాధారణ టీకాల కార్యక్రమం ద్వారా పిల్లలకు వ్యక్తిగత రక్షణ కల్పిస్తే, పల్స్ పోలియో కార్యక్రమాలు అర్హులైన పిల్లలందరికీ అదనపు చుక్కలు అందించి సమాజంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇప్పటికే అన్ని టీకాలు వేయించుకున్న పిల్లలకు కూడా ప్రచార సమయంలో అదనపు చుక్కలు ఇవ్వడం వల్ల గతంలో వేసిన టీకాలు విఫలమయ్యాయని అర్థం కాదు. పేగుల్లో రోగనిరోధక శక్తిని మరింత బలోపేతం చేసి, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమే దీని ఉద్దేశం. భారత జాతీయ టీకాల కార్యక్రమం ప్రకారం పుట్టినప్పుడు, ఆరు, పది, పద్నాలుగు వారాల వయసులో ఓపీవీ చుక్కలు ఇస్తారు. 16 నుంచి 24 నెలల మధ్య బూస్టర్ డోసు వేస్తారు. ఐపీవీని ఆరు, పద్నాలుగు వారాల సమయంలో నిర్ణీత మోతాదుల్లో ఇస్తారు. తల్లిదండ్రులు పిల్లల టీకాల వివరాలను భద్రపరచుకోవడంతోపాటు, పల్స్ పోలియో కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలి. తాజా టీకాల షెడ్యూల్ కోసం పిల్లల వైద్యులను సంప్రదించాలి. భారతదేశం పోలియో రహిత స్థితిని కొనసాగించాలంటే తల్లిదండ్రులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఆరోగ్య విభాగాలు సమన్వయంతో పనిచేయడం అవసరం.

