న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి డ్రెహ్రాడూన్ మధ్య నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి.
ఈ నేపథ్యంలో కొందరు వాహనదారులు ఈ భారీ గుంతల గురించి మిగతా వాహనదారులను అప్రమత్తం చేశారు. (Delhi-Dehradun expressway) సుమారు రూ. 12,000 కోట్ల వ్యయంతో 212 కిలోమీటర్ల పొడవున్న నిర్మించిన ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను ఏప్రిల్ 14న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ నగరాల మధ్య కేవలం రెండు గంటల్లోనే సాఫీగా ప్రయాణించేలా ఈ రహదారిని ఏర్పాటు చేశారు.
కాగా, ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమై మూడు నెలలు కూడా కాకముందే రహదారి నాణ్యతలో డొల్లతనం బయటపడింది. ఉత్తరప్రదేశ్ షమ్లీలోని హాథీ కరోడా గ్రామం సమీపంలో ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు భారీ గుంతలు ఏర్పాడ్డాయి. ఆ గుంతల్లో వేగంగా వెళ్లిన పలు వాహనాలు అదుపుతప్పడంతో పాటు వీల్స్ దెబ్బతిన్నాయి. ప్రమాదాన్ని పసిగట్టిన కొందరు వాహనదారులు మిగతా వాహనదారులను అప్రమత్తం చేశారు.
మరోవైపు ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేలో ఏర్పడిన భారీ గుంతలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. 'అవినీతికి ఇంతకంటే ఎక్కువ రుజువు ఇంకేం కావాలి? ప్రతి శాఖలోనూ బహిరంగ దోపిడీ జరుగుతోంది' అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ షామా మహమ్మద్ ట్వీట్ చేశారు.
అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఈ గుంతల వీడియోను పోస్ట్ చేసింది. 'ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి రూ.12,000 కోట్లు ఖర్చు చేశారు. కానీ కొద్ది కాలంలోనే మోదీ ప్రభుత్వ అభివృద్ధి లోపాలు బయటపడ్డాయి' అని విమర్శించింది. 'రూ.110కే 20 శాతం ఇథనాల్ పెట్రోల్ కొంటూ, రూ.650 టోల్ టాక్స్ చెల్లించడాన్ని ఊహించుకోండి, అయినా ప్రాణానికి గ్యారెంటీ లేదు' అని ఒకరు ఆరోపించారు.
కాగా, ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే ఏర్పడిన భారీ గుంతలపై విమర్శలు, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు స్పందించారు. భారీ గుంతలు ఏర్పడిన ప్రదేశంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.

