- ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం
- బాధితుల ఆరోగ్య పరిస్థితిపై అరా
- బీఆర్‌ఎస్ నాయకుల పరామర్శ
- విక్రేత ఇంట్లో అధికారుల తనిఖీ..
- కేసు నమోదు
సిరిసిల్ల టౌన్, జూన్ 17 : పానీపూరి.. పలువురి ప్రాణం మీదికి తెచ్చింది. అవి తిన్న 31 మంది దవాఖాన పాలు కావాల్సి వచ్చింది. మంగళవారం రాత్రి తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలోని కేసీఆర్‌నగర్‌లో పానీపూరి తిని 12 మంది చిన్నారులతోపాటు ఏడుగురు పెద్ద లు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం సాయం త్రం అంకుసాపూర్‌లో పానీపూరి తిని ముగ్గురు చిన్నారులు, కేసీఆర్‌నగర్‌లో మరో 9 మంది పెద్దలు అస్వస్థత చెందారు. వెంటనే వీరిని కుటుంబ సభ్యులు సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించారు. అయితే విషయం తెలిసిన వెంటనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ఆయన ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న దవాఖానకు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్య చికిత్సపై దవాఖాన సూపరింటెండెంట్‌తో మాట్లాడి వివరాలను కేటీఆర్‌కు తెలియజేశారు. బాధితులకు ఎలాంటి ప్రాణహాని లేకున్నా అబ్జర్వేషన్‌లో ఉంచారని వివరించారు. చిన్నారులకు మెరుగైన చికిత్స కోసం సహకారం అందిస్తామని, మనోధైర్యంతో ఉండాలని కేటీఆర్ వారికి భరోసా కల్పించారు.
పానీపూరి విక్రేతపై కేసు
పానీపూరి తిని చిన్నారులు, పెద్దలు అస్వస్థతకు గురైన విషయంపై ఫుడ్‌సేఫ్టీ అధికారులు, పోలీసులు పానీపూరి వికేత్ర ఇంట్లో తనిఖీలు చేశారు. పానీపూరి విక్రేత మోహన్‌లాల్ ప్రజాపతిపై కేసు నమోదు చేశారు.

