న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 29న ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 30న అఖిలపక్ష సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ప్రధాని నేతృత్వం వహించనున్నారు. అయితే ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనుంది. కాగా, అదేరోజున బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పక్షాలు కూడా సమావేశం కానున్నాయి.
కరోనా నేపథ్యంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈసారి రెండు విడుతలుగా జరుగుతాయి. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29న ప్రారంభమై ఏప్రిల్ 8న ముగుస్తాయి. తొలివిడుత జనవరి 29 నుంచి ఫిబ్రవరి 25 వరకు, రెండో విడుత మార్చి 8 నుంచి ఏప్రిల్ 8వరకు జరుగనున్నాయి. కరోనా నిబంధనలు అమల్లో ఉన్నందున రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగనుంది.
ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కాగా, ఈసారి బడ్జెట్ ప్రతులను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తేనున్నారు.
సమావేశాల నేపథ్యంలో సభ ప్రారంభానికి రెండు రోజుల ముందు నుంచి సభ్యులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి పరీక్షలకోసం ప్రత్యేక వ్యవస్థను పార్లమెంటుతోపాటు, సభ్యుల క్వార్టర్లకు సమీపంలోనే ఏర్పాటు చేయనున్నారు.

