Saturday, 28 Nov, 4.07 am నమస్తే తెలంగాణ

తాజావార్తలు
ప్రేమతో ప్రచారానికి..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బల్దియా పీఠంపై గులాబీ జెండా ఎగురబోతున్నదని యువకులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌పై ఉన్న అభిమానంతో ప్రచారంలో పాల్గొనడానికి రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి యువత పెద్ద సంఖ్యలో నగరానికి తరలిచ్చారు. మత సామరస్యాన్ని కాపాడాలని ప్రజలను కోరుతున్నారు. అందులో భాగంగా గ్రేటర్‌ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆరేండ్లలో తెలంగాణ సాధించిన అద్భుతాలను పూసగుచ్చినట్లు ప్రజలకు వివరిస్తున్నారు. ఉద్యోగవకాశాలు అందించే హైదరాబాద్‌ను ఘర్షణలతో ఉగ్రవాదం వైపునకు మళ్లించే ప్రయత్నం చేస్తున్న కొన్ని పార్టీలను స్వాగతించవద్దని అవగాహన కల్పిస్తున్నారు. హిందూ, ముస్లింలు కలిసి మెలిసి ఉండాలంటే గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపు అనివార్యమని వారు చెప్పారు.

ప్రశాంతత చెదరొద్దు..!!

చదువులు పూర్తయ్యాక ఉద్యోగానికి నగరానికే వస్తామని కరీంనగర్‌కు చెందిన ప్రకాశ్‌ వివరించారు. నగరంలో ప్రశాంతమైన వాతావరణం, ఉద్యోగ అవకాశాలు, అన్ని మతాలు నివసించగల సదుపాయాలు ఉన్నాయన్నారు. మత ఘర్షణలకు కారణమయ్యే పార్టీలకు అధికారం ఇస్తే హైదరాబాద్‌ భవిష్యత్తు నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకోసమే రాజకీయాలతో సంబంధం లేకున్నా టీఆర్‌ఎస్‌ గెలువాలని ప్రచారం లో పాల్గొంటున్నానని తెలిపారు. ఆదిలాబాద్‌కు చెందిన రమ్య మాట్లాడుతూ ఆడబిడ్డల భద్రతకు తెలంగాణ సర్కార్‌ అండగా నిలుస్తున్నదన్నారు. షీటీమ్‌తో పోకిరీల ఆగడాలను అరికట్టిందన్నారు. శాంతిభద్రతలు పకడ్బందీగా అమలవుతున్నాయని ఆమె చెప్పారు. మత ఘర్షణలు, కర్ఫ్యూలు ఉండని నగరం కోసం తెలంగాణ సమాజం పాటుపడుతుంటే కొన్ని పార్టీల నాయకుల మాటలు ఐకమత్యానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కరీంపాషా వివరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలవాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అందమైన నగరం కావొద్దు విద్వేశాలమయం

హైదరాబాద్‌ ఎంత అభివృద్ధి చెందిందో ఫ్లైఓవర్లు, కేబుల్‌ బ్రిడ్జిలు, చెరువుల సుందరీకరణ, దిగ్గజ కంపెనీల రాకను గమనిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ప్రపంచ కంపెనీలు మన నగరానికి రావడానికి ఊవిళ్లూరుతున్నాయంటే ఇక్కడి ప్రభుత్వ పాలసీలే కారణం. పనిచేసే నాయకులు మనకు ఉన్నారు కాబట్టే అభివృద్ధి సాధ్యమవుతున్నది. ఆరేండ్ల తెలంగాణలో హైదరాబాద్‌ ఎంతో ప్రశాంతంగా ఉంది. కుల, మతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారంటే లా అండ్‌ ఆర్డర్‌ సక్రమంగా పనిచేస్తున్నట్టే కదా. - ప్రణవిరెడ్డి, ఐటీ ఉద్యోగి


Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top