Friday, 30 Oct, 2.01 am నమస్తే తెలంగాణ

తాజావార్తలు
పుల్వామా మా పనే

  • పార్లమెంట్‌ సాక్షిగా ఒప్పుకున్న పాకిస్థాన్‌
  • వెల్లడించిన సీనియర్‌ మంత్రి ఫవాద్‌ చౌదరి
  • సభలో కలకలంతో మళ్లీ మాట మార్పు
  • అభినందన్‌ విషయంలో అంతా వణికిపోయారు
  • విడిచిపెట్టకపోతే భారత్‌ దాడి చేస్తుందని భయపడ్డారు
  • ప్రతిపక్ష ఎంపీ అయాజ్‌ సాదిక్‌ వెల్లడి

పుల్వామా ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఇన్నాళ్లు బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్‌ నిజాన్ని ఒప్పుకున్నది. ఆ ఉగ్రదాడి పూర్తిగా తమ పనేనని పాక్‌ సీనియర్‌ మంత్రి ఫవాద్‌ చౌదరి ఆ దేశ పార్లమెంట్‌ సాక్షిగా వెల్లడించారు. అంతేకాదు ఆ ఉగ్రదాడి తమ ప్రజల విజయంగా అభివర్ణించారు. మరోవైపు భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను భారత్‌కు అప్పగించే అంశంపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వా వణికిపోయారని ప్రతిపక్ష నేత, ఎంపీ సాదిక్‌ పార్లమెంటులో తెలిపారు. భారత్‌ దాడి చేస్తుందేమోనని మంత్రులు భయపడ్డట్టు చెప్పారు.

ఇస్లామాబాద్‌: భారత్‌ను భయపెట్టామని గొప్పలు చెప్పుకోబోయిన పాకిస్థాన్‌ సంచలన విషయాన్ని బయటపెట్టింది. పుల్వామా ఉగ్రదాడి పూర్తిగా తమ పనేనని ఒప్పుకున్నది. తద్వారా భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిస్తున్నట్టు తమ పార్లమెంట్‌ వేదికగా తన నోటితో తనే ప్రపంచానికి చెప్పినట్టు అయింది. భారత్‌లోకి చొరబడి భారత సైనికులను చంపేశాం (హమ్‌నే హిందూస్థాన్‌ కో గుస్‌ కే మారా) అని ఆ దేశ సీనియర్‌ మంత్రి ఫవాద్‌ చౌదరి పార్లమెంట్‌ సాక్షిగా చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా గురువారం ఆయన మాట్లాడుతూ.. 'భారత్‌లోకి చొరబడి భారత సైనికులను 40 మందిని చంపేశాం. పుల్వామా విజయం పాకిస్థాన్‌ ప్రజల విజయం. ఈ ఘనత ప్రధాని ఇమ్రాన్‌కే చెందుతుంది. ఇది గొప్ప విషయం. ఈ విజయంలో అందరికీ భాగం ఉంది' అని మంత్రి ఫవాద్‌ చౌదరి చెప్పారు. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ పాక్‌కు చిక్కినప్పుడు ఆయన విడుదలపై ఏర్పాటు చేసిన సమావేశంలో విదేశాంగ మంత్రి ఖురేషీ కాళ్లు వణికిపోయాయని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ నేత, ఎంపీ సర్దార్‌ అయాజ్‌ సాదిక్‌ వెల్లడించిన నేపథ్యంలో ఫవాద్‌ చౌదరి తమ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ఈ విషయాన్ని బయటపెట్టారు. 'పుల్వామా విజయం' అన్న మాటపై పార్లమెంటులో కలకలం రేగడం, ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మంత్రి మాట మార్చారు. పుల్వామా ఘటన తర్వాత మనవాళ్లు భారత్‌లోకి చొచ్చుకెళ్లారు అంటూ ఏదో చెప్పబోయారు. పుల్వామా ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్థాన్‌ ఇప్పటివరకూ బుకాయిస్తూ వస్తున్నది.

పాక్‌ బలగాల్ని తుడిచిపెట్టేవాళ్లం!

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను విడిచి పెట్టకపోతే, పాకిస్థాన్‌ సైన్యాన్ని నామరూపాలు లేకుండా చేసేవాళ్లమని వాయుసేన మాజీ అధిపతి బీఎస్‌ ధనోవా పేర్కొన్నారు. అభినందన్‌ విడుదల విషయంలో జరిగిన పరిణామాల గురించి పాక్‌ ఎంపీ వివరాలు వెల్లడించిన సందర్భంలో ఆయన అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. పాక్‌ చెరలో అభినందన్‌ ఉండటంపై ఆయన తండ్రి ఆందోళన వ్యక్తం చేశారన్నారు. అభినందన్‌ను తప్పకుండా తీసుకువస్తామని ఆయన తండ్రికి తాను భరోసా ఇచ్చానని చెప్పారు. భారత్‌ సైనిక సామర్థమేమిటో పాక్‌కి తెలియంది కాదని, అందుకే అభినందన్‌ను విడిచిపెట్టిందని ధనోవా తెలిపారు.

కాళ్లు వణికాయి.. చెమటలు పట్టాయి

పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీ అయాజ్‌ సాదిక్‌ బుధవారం మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కశ్మీర్‌, అభినందన్‌ వర్ధమాన్‌ విషయంలో అధికార పార్టీకి మద్దతునిచ్చామని, ఇకపై అది కుదరదని చెబుతూ.. అభినందన్‌ విడుదల సమయంలో చోటుచేసుకున్న అప్పటి సంఘటనను కూలంకషంగా వివరించారు. 'అభినందన్‌ను అదుపులోకి తీసుకున్న అనంతరం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. అయితే అందులో పాల్గొనడానికి ప్రధాని ఇమ్రాన్‌ తిరస్కరించారు. పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వా సమావేశం జరుగుతున్న గదిలోకి వచ్చారు. అప్పుడు ఆయన కాళ్లు వణుకుతున్నాయి. నుదురంతా చెమట పట్టి ఉంది' అని చెప్పారు. చర్చల అనంతరం.. విదేశాంగ మంత్రి ఖురేషీ మాట్లాడుతూ 'మీకు పుణ్యముంటుంది. అతన్ని (అభినందన్‌ను) వెళ్లనీయండి. లేదంటే భారత్‌ ఈ రాత్రి 9 గంటలకు మనమీద దాడి చేసేందుకు సిద్ధమవుతున్నది. పాక్‌పై దాడి చేయాలన్న ఆలోచనలో భారత్‌ లేనేలేదు. కేవలం మనం (పాక్‌) వాళ్ల ముందు మోకరిళ్లి, అభినందన్‌ను విడుదల చేయాలని వాళ్లు(భారత్‌) కోరుకుంటున్నారు' అని చెప్పినట్టు సాదిక్‌ వివరించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top