- ఎన్నికల దృష్ట్యా పకడ్బందీ చర్యలు
- 155 మంది రౌడీషీటర్ల బైండోవర్
- 543 తుపాకులు స్వాధీనం
- భయపెట్టినా.. ప్రలోభపెట్టినా 100కు సమాచారం ఇవ్వాలి
- సీపీ మహేశ్‌భగవత్ సూచన
రాచకొండ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని, ఎవరు నిబంధనలు అతిక్రమించినా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలకు రాచకొండ పోలీసులు పూర్తి భద్రత ఏర్పాట్లు చేశారు. సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలతో నిఘాను ముమ్మరం చేశారు.
సమస్యాత్మక, సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించి ఓటర్లలో శాంతి భద్రతలపై పూర్తి నమ్మకాన్ని కల్పించామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌ను జియో ట్యాగింగ్ చేసినట్లు సీపీ వివరించారు. ఎన్నికలు జరుగుతున్న 30 కార్పొరేషన్ వార్డుల్లో 155 రౌడీషీటర్లను బైండోవర్ చేసి, 543 తుపాకులను సరెండర్ చేశామని చెప్పారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నేపధ్యంలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ఎవరైనా ప్రయత్నించినా, భయపెట్టించినా ప్రజలు డయల్ 100 లేదా రాచకొండ వాట్సాప్ 9490617111కు సమాచారం అందజేయాలని కోరారు. చార్‌మినార్, చార్ సిపాయి, హిందు, ముస్లిమ్, సిక్, ఇసాయికి గుర్తింపుగా ఉందని, దాన్ని ఎవరైనా భంగం వాటిల్లేలా చేయాలని ప్రయత్నించినా కఠినంగా వ్యవహరిస్తామని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.

