Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజీవ్ త్యాగి మృతి.. టీవీ ఛానళ్లపై విమర్శలు

రాజీవ్ త్యాగి మృతి.. టీవీ ఛానళ్లపై విమర్శలు

హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజీవ్ త్యాగి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఓ హిందీ ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న తర్వాత రాజీవ్ త్యాగికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. రాజీవ్ త్యాగీ మరణించిన తీరు పట్ల విమర్శలు వస్తున్నాయి. టీవీ ఛానళ్లు తమ చర్చల్లో అనుసరిస్తున్న వ్యూహాల గురించి ఆరోపణలు వస్తున్నాయి. సంచలనం క్రియేట్ చేసేందుకు మీడియా అనుకరిస్తున్న వైఖరి కొందరి ప్రాణాలకు ముప్పు తెస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర సమాచార, ప్రసారశాఖ కూడా టీవీ ఛానళ్లను అదుపు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గత ఆరేళ్ల నుంచి మీడియా విచ్ఛలవిడిగా వ్యవహరిస్తున్నట్లు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

బెంగుళూరులో జరిగిన హింస గురించి ఓ ప్రఖ్యాత హిందీ ఛానల్‌లో మంగళవారం రాత్రి చర్చ జరిగింది. ఆ చర్చలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రాజీవ్ త్యాగి పాల్గొన్నారు. ఇక బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర కూడా ఆ చర్చలో పాల్గొన్నారు. అయితే సంబిత్ పాత్ర తన మాటల దూకుడుతో రాజీవ్ త్యాగిని అటాక్ చేశారు. చాలా వాడివేడిగా చర్చ సాగింది. దేశద్రోహి అంటూ త్యాగిపై సంబిత్ విరుచుకుపడ్డారు. ఆ చర్చలో త్యాగి చాలా ఆవేశానికి లోనయ్యారు. అయితే చర్చ ముగిసిన కొన్ని క్షణాలకే ఆయన గుండెపోటుతో నేలకూలారు.

త్యాగి మృతి పట్ల కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ట్విట్టర్‌లో స్పందించారు. విషపూరితమైన చర్చలు.. విషపూరితమైన ప్రతినిధులు అంటూ కామెంట్ చేశారు. టీఆర్‌పీ బిజినెస్ కోసం ఇలా చేస్తున్నారంటూ విమర్శించారు. హిందూ-ముస్లిం విషపూరిత విభజన ఇంకెన్నాళ్లు ఈ దేశాన్ని దహించివేస్తుందని సుర్జేవాలా తన ట్వీట్‌లో ప్రశ్నించారు. సీనియర్ కాంగ్రెస్ నేత ఎంపీ అహ్మద్ పటేల్ కూడా ట్విట్టర్‌లో విమర్శలు చేశారు. టీవీ ఛానళ్ల ఓనర్లు, ఎడిటర్లు, యాంకర్లు అవలోకనం చేసుకోవాలని, అర్థంలేని టీవీ డిబేట్లు చేయవద్దు అంటూ ఆయన కోరారు. కొన్ని సందర్భాల్లో మాటలు.. తూటాల్లా ఉంటాయన్నారు. మరోవైపు సంబిత్ పాత్రను అరెస్టు చేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. రాజీవ్ త్యాగి మృతి పట్ల సంబిత్ పాత్ర సంతాపం తెలిపారు. స్నేహితుడు రాజీవ్ లేడన్న విషయం నమ్మలేకపోతున్నాను, టీవీ డిబేట్‌లో ఇద్దరం కలిసి మాట్లాడాం, జీవితం నమ్మశక్యం కానిదని, తనకు మాటలు రావడం లేదని, ఆ దేవుడు రాజీవ్‌కు శాంతిని ఇస్తాడని ఆశిస్తున్నట్లు సంబిత్ పాత్ర తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana