Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజ్యసభలో గందరగోళం సృష్టించిన ఎంపీలపై చైర్మన్ చర్యలు!

రాజ్యసభలో గందరగోళం సృష్టించిన ఎంపీలపై చైర్మన్ చర్యలు!

న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆదివారం గందరగోళం సృష్టించిన ఎంపీలపై చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సభలో ఆదివారం అగ్రి బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే వీటిని హడావుడిగా పాస్ చేసేందుకు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రయత్నిస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సవరణలపై సభ్యుల వివరణ తీసుకోకుండానే వాయిస్ ఓటుకు వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ డిప్యూటీ చైర్మన్ చైర్ వైపు దూసుకువెళ్లారు. రూల్ బుక్‌ను ఆయనకు చూపించే ప్రయత్నం చేశారు. రూల్ బుక్ పేపర్లు చించివేసేందుకు ప్రయత్నించారు.

కొందరు ఎంపీలు కూడా పోడియం ముందుకు వెళ్లగా వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. తీవ్ర గందరగోళం మధ్య డిప్యూటీ చైర్మన్ వాయిస్ ఓటు ద్వారా అగ్రి బిల్లులను పాస్ చేసి సభను సోమవారానికి వాయిదా వేశారు. డిప్యూటీ చైర్మన్ తీరుపై మండిపడుతున్న ప్రతిపక్ష పార్టీలు ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఇస్తామని వెల్లడించాయి.

మరోవైపు రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు సృష్టించిన రగడపై చైర్మన్ వెంకయ్య నాయుడు నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, కేంద్ర మంత్రి పియూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాలు మంత్రి ప్రల్హాద్ జోషి హాజరయ్యారు. అగ్రి బిల్లులపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరుపై చర్చించారు. ఈ నేపథ్యంలో టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్‌తో పాటు పలువురిపై చర్యలు తీసుకోవచ్చని తెలుస్తున్నది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana