- తెలంగాణలో నిలిచిపోయిన పథకం.. ప్రీమియం కట్టని రేవంత్ సర్కార్
- 441.23 కోట్లు చెల్లించకపోవడంతో 7,606 క్లెయిమ్‌లు పెండింగ్
- ఆయా రైతు కుటుంబాలకు తప్పని గోస
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): రైతు సంక్షేమమే ధ్యేయమని గొప్పలు చెప్పుకొనే రేవంత్‌రెడ్డి సర్కార్ క్షేత్రస్థాయిలో అన్నదాతల కుటుంబాలను నట్టేట ముంచుతున్నది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో ప్రీమియం డబ్బులు చెల్లించకపోవడంతో 'రైతుబీమా' పథకం పూర్తిగా పడకేసింది. చనిపోయిన రైతు కుటుంబాలకు ఆసరాగా ఉండాల్సిన బీమా సొమ్ము అందక, బాధితులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
బకాయిలు వసూలయ్యే వరకు క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసేది లేదని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) తేల్చి చెప్పడంతో వేలాది దరఖాస్తులు మూలనపడ్డాయి. రైతులకు నయాపైసా భారం లేకుండా, ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే రూ.5 లక్షల బీమా సదుపాయం దక్కేలా నాటి కేసీఆర్ ప్రభుత్వం 2018లో ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే, 2025-26 సంవత్సరానికిగాను ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన మొ త్తం ప్రీమియం రూ. 1, 359.56 కోట్లు. ఇం దులో మొదటి విడతగా ఆగస్టు 2025లో 679.78 కోట్లు, ఫిబ్రవరి 2026లో రెండో విడత లో చెల్లించాల్సిన మిగతా సగంలో రూ. 243.33 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఇంకా రూ.441.23 కోట్ల మేర బకాయిలు పెట్టడంతో ఎల్‌ఐసీ క్లెయిమ్‌ల చెల్లింపులు నిలిపివేసింది. ఫలితంగా రైతు కుటుంబాలు మరింత చితికిపోతున్నాయి.
కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా..
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతు బీమా ఎల్‌ఐసీ ప్రీమియం మొత్తాలను తొలి ప్రాధాన్యంగా ఎప్పటికప్పుడు చెల్లించేవారు. రైతు ఏ కారణం చేతనైనా బీమా సొమ్ము కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బాధితుల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో ఎట్టకేలకు అధికారులు ఈ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే రూ.441.23 కోట్ల బకాయిలను విడుదల చేయాలని ప్రతిపాదించారు. బకాయిలు చెల్లిస్తే రాబోయే ఆగస్టు 14 నాటికి రైతులకు ఎల్‌ఐసీ నుంచి సుమారు రూ.570 కోట్ల మేర బీమా క్లెయిమ్‌లు అందుతాయని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.
రైతుబీమా నిలిపివేత చారిత్రక ద్రోహం: నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 17(నమస్తే తెలంగాణ): ఐక్యరాజ్య సమితి ప్రశంసలు అం దుకున్న రైతుబీమాకు ఎల్‌ఐసీకి ప్రీమి యం నిలిపివేయడం రైతులకు కాంగ్రెస్ చేసిన చారిత్రక ద్రోహమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
రైతుల పాలిట శని రేవంత్: సతీశ్‌రెడ్డి
రైతులను అన్ని విధాలా ఇబ్బందులు పెడుతూ రైతుల పాలిట రేవంత్‌రెడ్డి శనిలా దాపురించారని రెడో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులను సీఎం నట్టేట ముంచారన్నారు.
రైతుబీమా పథకం పరిస్థితి
2025-26 మొత్తం ప్రీమియం : రూ.1,359.56 కోట్లు
ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించింది : రూ.923.11 కోట్లు
ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయి : రూ.441.23 కోట్లు
ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లు : 7,606 క్లెయిమ్‌లు
పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌ల విలువ : రూ.380.03 కోట్లు
బకాయిలు చెల్లిస్తే రైతులకు అందే మొత్తం : రూ.570 కోట్లు

