Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
RBI | డాలర్ల కోసం ఆర్బీఐ బంగారాన్ని అమ్మేసిందట..! బ్లూమ్‌బర్గ్‌ ఎకనమిక్స్‌ తాజా నివేదిక

RBI | డాలర్ల కోసం ఆర్బీఐ బంగారాన్ని అమ్మేసిందట..! బ్లూమ్‌బర్గ్‌ ఎకనమిక్స్‌ తాజా నివేదిక

  • 2 వారాల్లో రూ.1.15 లక్షల కోట్ల పసిడి నిల్వలను విక్రయించింది
  • బ్లూమ్‌బర్గ్‌ ఎకనమిక్స్‌ తాజా నివేదిక
  • వార్తలను ఖండించిన రిజర్వ్‌బ్యాంక్‌

అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధంతో పశ్చిమాసియాలో సంక్షోభం..

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల విజృంభణ.. దేశీయ మార్కెట్‌ నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు.. భారమైన దిగుమతులతో విదేశీ మారకం నిల్వల్లో క్షీణత.. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ డాలర్ల కోసం తమ దగ్గరున్న పసిడి నిల్వలను అమ్మేసిందన్న వార్తలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

న్యూఢిల్లీ, జూన్‌ 3 : మిడిల్‌ ఈస్ట్‌ ఉద్రిక్తతలతో పెరుగుతున్న ముడి చమురు ధరలు, తరలిపోతున్న విదేశీ పెట్టుబడుల మధ్య కరిగిపోతున్న విదేశీ మారకం నిల్వల్ని పెంచుకోవడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఆపసోపాలు పడుతున్నదా? ఈ క్రమంలోనే తమ దగ్గరున్న పసిడి నిల్వల్ని అమ్మేసిందా? ఇందుకు సంబంధించి తాజాగా వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయిప్పుడు. గత నెల మే 22తో ముగిసిన 2 వారాల్లో దాదాపు 12 బిలియన్‌ డాలర్ల (సుమారు 1.15 లక్షల కోట్లు) విలువైన బంగారాన్ని ఆర్బీఐ విక్రయించి ఉండవచ్చని బ్లూమ్‌బర్గ్‌ ఎకనామిక్స్‌ (బీఈ) సమాచారం. ఇదే సమయంలో 7.5 బిలియన్‌ డాలర్ల విదేశీ కరెన్సీ ఆస్తుల (డాలర్లు)ను కొన్నట్టు బీఈ సీనియర్‌ ఇండియా ఎకనామిస్ట్‌ అభిషేక్‌ గుప్తా రాసుకొచ్చారు.

ఇదీ సంగతి..

దేశీయ ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం విదేశీ దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇందులో మెజారిటీ వాటా గల్ఫ్‌ దేశాల నుంచే వస్తున్నది. అయితే అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధంతో మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అమెరికాకు అండగా ఉంటున్నాయని పొరుగున ఉన్న యూఏఈ, ఖతార్‌, కువైట్‌, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌ తదితర గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులు చేస్తున్నదీ చూస్తూనే ఉన్నాం. ఫలితంగా అక్కడ ముడి చమురు, సహజ వాయువుల ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. మరోవైపు భారత్‌ సహా ఇతర ఆసియా దేశాలకు సరుకు రవాణాలో కీలకమైన హొర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ తమ ఆధీనంలోకి తీసుకున్నది. ఈ దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలకు రెక్కలు తొడిగాయి. ఇది దిగుమతులపై ఆధారపడుతున్న భారత్‌ను ప్రభావితం చేస్తుండగా, పెద్ద మొత్తంలో డాలర్లను చెల్లించాల్సి వస్తున్నది.

అందుకే ఇటీవల చమురేతర దిగుమతుల్లో ముందుగా ఉంటున్న బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షల్ని తీసుకొచ్చింది. ఇక ఈ పరిణామాలన్నీ దేశీయ క్యాపిటల్‌, ఫారెక్స్‌ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. భారత్‌ నుంచి పెద్ద ఎత్తున విదేశీ మదుపర్లు తమ పెట్టుబడులను వెనుకకు తీసుకుంటున్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గురించి సరేసరి. గత నెల 20న తొలిసారి 96.86 వద్ద ముగిసింది. ఒకానొక దశలోనైతే 97 మార్కును చేరుతుందా? అన్నట్టు 96.95 స్థాయికి దిగజారింది. రూపీ వాల్యూ పడిపోతున్నకొద్దీ దేశంలోకి దిగుమతయ్యే వస్తూత్పత్తులకు డాలర్లలో ఇంకా ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందన్నది తెలిసిందే. అంతర్జాతీయ వాణిజ్యం అంతా ప్రపంచ కరెన్సీగా ఉన్న అమెరికన్‌ డాలర్లలోనే జరుగుతుంది మరి. ఇలా.. ఫారెక్స్‌ రిజర్వులపై ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో పసిడి నిల్వలను విక్రయించి ఆర్బీఐ డాలర్లను కొన్నదన్న వార్తలు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి.

అప్పట్లో 67 టన్నులు తాకట్టు..

సరిగ్గా 35 ఏండ్ల కిందట జరిగిన పరిణామం.. ఇప్పుడు ఆర్బీఐ తమ వద్దనున్న బంగారం నిల్వల్ని ఉపయోగించి డాలర్లను పోగేసిందన్న వార్తలకు బలం చేకూరుస్తుండటం గమనార్హం. దేశంలో ఏర్పడిన విదేశీ మారక ద్రవ్య సంక్షోభం నుంచి బయటపడటానికి 1991 మే, జూలై నెలల్లో ఆర్బీఐ తమ దగ్గరున్న పసిడి నిల్వల్ని తాకట్టు పెట్టింది. సుమారు 67 టన్నుల పుత్తడిని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్విట్జర్లాండ్‌లలో తనఖా పెట్టి దాదాపు 600 మిలియన్‌ డాలర్లను నాడు సెంట్రల్‌ బ్యాంక్‌ తీసుకొచ్చింది. నిజానికి అప్పుడు దేశంలో ఉన్న ఫారెక్స్‌ నిల్వలు కొద్ది వారాల దిగుమతులకే సరిపోనున్నాయి. అవి కూడా అయిపోతే దేశం దివాలా తీసినట్టే.

వదంతులే : రిజర్వ్‌ బ్యాంక్‌

పసిడి నిల్వల అమ్మకం వార్తలు.. వదంతులేనని ఆర్బీఐ బుధవారం స్పష్టం చేసింది. తమ దగ్గర భౌతిక రూపంలో ఉన్న గోల్డ్‌ రిజర్వుల్లో ఏ మార్పూ లేదని బ్లూమ్‌బర్గ్‌ ఎకనామిక్స్‌ వార్తను ఓ ప్రకటనలో ఖండించింది. ఈ ఏడాది మార్చి 31నాటికి 880.52 టన్నులుగా ఉన్నాయన్నది. కాగా, ఏ సమాచారాన్నైనా తమ అధికారిక వెబ్‌సైట్లను చూసి నిర్ధారించుకోవాలని ఆర్బీఐ సూచించింది.

  • ఈ ఏడాది ఫిబ్రవరి 27నాటికి దేశంలో ఉన్న ఫారెక్స్‌ రిజర్వులు 728.494 బిలియన్‌ డాలర్లు. ఇదే ఆల్‌టైమ్‌ హై.
  • గత నెల మే 22నాటికి 681.384 బిలియన్‌ డాలర్లకు పతనం.
  • పశ్చిమాసియా సంక్షోభం మొదలయ్యాక దాదాపు గడిచిన 3 నెలల్లో కరిగిపోయిన 47.11 బిలియన్‌ డాలర్లు.
  • ముడి చమురు దిగుమతుల్లో ప్రపంచంలోనే భారత్‌ది మూడో స్థానం.
  • గల్ఫ్‌ వార్‌తో పెరుగుతున్న క్రూడాయిల్‌ రేట్లు.. భారతీయ దిగుమతుల్ని అంతకంతకూ ఖరీదెక్కిస్తున్నాయి.
  • ఈ ఏడాది మార్చి ఆఖరుకల్లా ఆర్బీఐ వద్ద 880.52 మెట్రిక్‌ టన్నుల పసిడి నిల్వలు.
  • ఆర్బీఐ గోల్డ్‌ రిజర్వుల్లో 77 శాతం దేశంలోనే ఉండగా.. 23 శాతం విదేశాల్లో ఉన్నాయి.
  • గడిచిన 6 నెలల్లో దాదాపు 30 శాతం విదేశీ గోల్డ్‌ రిజర్వులను భారత్‌కు తెచ్చిన ఆర్బీఐ.
  • విదేశాల్లో ఎక్కువగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌, బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్మెంట్లలోనే పుత్తడిని దాచిన ఆర్బీఐ.
  • రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆస్తుల్ని ఐరోపా దేశాలు ఫ్రీజ్‌ చేయడంతో స్వదేశమే సేఫ్‌ అని భావిస్తున్న ఆర్బీఐ.

పుత్తడి అమ్మేందుకు దారితీస్తున్న ప్రధాన కారణాలివే..

అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడి చమురు ధరలు.

డాలర్‌తో పోల్చితే రికార్డు కనిష్ఠాలకు దిగజారుతున్న రూపాయి మారకం విలువ.

యుద్ధాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు.

దేశ ఆర్థిక వ్యవస్థలోనూ ప్రతికూల సంకేతాల నడుమ బంగారం కంటే బలమైన విదేశీ మారక ద్రవ్య (ముఖ్యంగా డాలర్లు) నిల్వలే సురక్షితమన్న ఆర్బీఐ ఆలోచనలు.

దేశంలో ఫారెక్స్‌ రిజర్వులు ఎక్కువగా ఉంటే.. కరెన్సీ మార్కెట్‌లో రూపాయి నష్టాలను అడ్డుకోవచ్చన్న భావన.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana