Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోజూ రూ.6-8 లక్షలు చోరీ

రోజూ రూ.6-8 లక్షలు చోరీ

  • అయోధ్య కేసులో సిట్‌ అంచనా

అయోధ్య: అయోధ్య రామాలయంలో ప్రతి రోజూ రూ.6-8 లక్షల విరాళాలు పక్క దారి పట్టి ఉంటాయని సిట్‌ అంచనా వేసింది. ఎన్డీటీవీ కథనం ప్రకారం విరాళాల చోరీ విషయం వెలుగులోకి రాక ముందు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ బ్యాంక్‌ ఖాతాలకు రోజుకు రూ.16-18 లక్షల విరాళాలు వచ్చేవి.

కేసు నమోదయ్యాక ఆ ఖాతాలకు రోజుకు రూ.24-26 లక్షల విరాళాలు వచ్చాయని సిట్‌కు బ్యాంకు అధికారులు వెల్లడించారు. నగదు విరాళాలను ఎస్బీఐ ఒక ప్రైవేట్‌ ఏజెన్సీతో కలిసి పర్యవేక్షిస్తుంది. విరాళాల లెక్కింపు ప్రక్రియను రిటైర్డ్‌ బ్యాంక్‌ ఉద్యోగి సుభాష్‌ శ్రీవాస్తవ పర్యవేక్షిస్తారు. విరాళాల గల్లంతు గురించి ఒక సహోద్యోగి ఆయనకు తెలిపినప్పుడు.. 'దేవుడు చూస్తూనే ఉన్నాడు..ఇది నీ ఇంట్లో నుంచో లేదా నా ఇంట్లో నుంచో పోయేదేమీ కాదు కదా' అని వ్యాఖ్యానించాడు. ఆలయ ట్రస్ట్‌తో కుదిరిన ఒప్పందంలోని వ్యత్యాసాలు, విధానపరమైన మార్పుల గురించి కూడా సిట్‌ బ్యాంక్‌ అధికారులను ప్రశ్నించింది. అనుమానిత అవకతవకలను ఉన్నతాధికారులకు ఎందుకు నివేదించలేదని వారిని అడిగింది. నగదు లెక్కింపులో ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీ పాత్రపైనా ప్రశ్నలు లెవనెత్తింది. ట్రస్ట్‌ వార్షిక ఆడిట్‌ నివేదికలు, ఆర్థిక రికార్డులు, ఇతర కీలక పత్రాలను తమకు అందించాలని సిట్‌ కోరింది. దర్యాప్తులో భాగంగా వాటిని తిరిగి ఆడిటింగ్‌ చేయడాన్ని సిట్‌ పరిశీలిస్తున్నది.

5 కోట్ల బంగారు రామచరిత మానస్‌ మాయం!
తన కుటుంబం విరాళంగా ఇచ్చిన రూ.5 కోట్ల విలువైన బంగారు పలకల రామచరిత మానస్‌ను అయోధ్య రామాలయం నుంచి బయటకు తరలించారని మాజీ ఐఏఎస్‌ అధికారి ఎస్‌ లక్ష్మీనారాయణన్‌ ఆరోపించారు. 2024 ఏప్రిల్‌లో తాము ఆలయ ట్రస్ట్‌కు ఈ కానుకను అందించామన్నారు. అయితే ఆ తర్వాత ఆలయ ప్రాంగణం నుంచి దాన్ని తరలించారని ఆయన తెలిపారు. ఆలయానికి ఇచ్చిన ప్రతి కానుకను మందిరంలోనే ప్రదర్శించలేమని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తనకు చెప్పారని ఆయన వెల్లడించారు. ఆలయానికి విరాళంగా ఇచ్చిన వెండి కడ్డీలు, ఇటుకలు పెద్ద సంఖ్యలో కనిపించడం లేదని కొన్ని రోజుల క్రితం విపక్షాలు, భారత బులియన్‌, నగల వర్తకుల సంఘం ఆరోపించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana