Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
RTA Transfers | 5 లక్షల నుంచి 50 లక్షలు.. ఆర్టీఏ బదిలీల్లో భారీగా బేరసారాలు

RTA Transfers | 5 లక్షల నుంచి 50 లక్షలు.. ఆర్టీఏ బదిలీల్లో భారీగా బేరసారాలు

RTA Transfers | హైదరాబాద్‌, మే 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ట్రాన్స్‌పోర్టు కార్యాలయ కేంద్రంగా జరుగుతున్న బదిలీల్లో.. అత్యంత రహస్యంగా ధన ప్రవాహం కొనసాగుతున్నదని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు ఫిక్స్‌ చేసుకొన్న అక్రమార్కులు అత్యంత తెలివిగా ఈ బదిలీల్లో వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. బదిలీలు పొందే పైస్థాయి అధికారులకు ఒక రేటు ఉంటే.. కిందిస్థాయి వారికి మరొక రేటు ఉన్నదని చెప్తున్నారు. ఆ రేట్ల వారీగానే.. వారు కోరుకున్న చోటుకు బదిలీ ఉత్తర్వులు అందుకున్న తర్వాతనే డబ్బులు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఒక్కో పోస్టుకు రూ.5 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.50 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్టు సమాచారం.

వీరికి ఒక ప్రజాప్రతినిధి అండతోపాటు రవాణాశాఖ కేంద్ర కార్యాలయంలో అత్యంత కీలకంగా ఉండే ఒక ఉన్నతాధికారి అండదండలు దండిగా ఉన్నాయని చెప్తున్నారు. రవాణాశాఖలో కీలక ఉద్యోగిగా, ఉద్యోగ సంఘ నాయకుడిగా పనిచేస్తున్న ఓ అధికారి.. ఇటీవల సదరు ప్రజాప్రతినిధికి మరింత దగ్గరగా ఉంటూ.. ఈ బదిలీ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకుంటున్నట్టు తెలిసింది. బదిలీలు ఆశించేవారికి రేటు ఫిక్స్‌ చేసి, ఎవ్వరికీ అనుమానం రాకుండా వారి నుంచే మూడు స్థానాలకు విల్లింగ్‌ అడుగుతున్నారట. వాటిల్లో కోరుకున్న స్థానానికి ఆర్డర్‌ ఇప్పించి.. ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నట్టు విశ్వసనీయంగా చెప్తున్నారు.

ఫైళ్లు క్లియర్‌ చేసే స్థాయికి ఓ కిందిస్థాయి అధికారి!

మహారాష్ట్ర బోర్డర్‌కు దగ్గరగా ఉన్న ఓ జిల్లాకు చెందిన అసిస్టెంట్‌ మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) ట్రాన్‌ఫర్స్‌ ఫైళ్లతోపాటు, ఇంక్రిమెంట్‌ ఫైళ్లను కూడా క్లియర్‌ చేస్తున్నట్టు తెలిసింది. సదరు ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఆ వ్యక్తి.. తన పైరవీతో ట్రాన్స్‌పోర్టు కేంద్ర కార్యాలయానికి వచ్చి ఇక్కడినుంచి విధులు చక్కదిద్దుతున్నట్టు బాధితులు చెప్తున్నారు. ఇతనికి ఆ ప్రజాప్రతినిధితోపాటు.. ఆర్టీఏ కార్యాలయంలో కీలకంగా ఉండే ఓ ఉన్నతాధికారి అండదండలు ఉండటంతో ప్రతి పనికీ కమీషన్‌ ఇస్తున్నట్టు చర్చించుకుంటున్నారు. ఇంక్రిమెంట్లు వ్యవహారాల్లోనూ తలదూర్చుతూ.. ఆ ఫైళ్లు క్లియెర్‌ చేసేందుకు ఈ ఏంఎవీఐ కనీసం రూ.70 వేల వరకూ వసూలు చేస్తున్నట్టు బాధితులు చెప్తున్నారు. ఇందులో సదరు అధికారికి కూడా వాటాలు పంచుతున్నట్టు సమాచారం. వీరితోపాటు ఆ ప్రజాప్రతినిధి అన్న కొడుకు కూడా రవాణాశాఖలోని అన్ని వ్యవహారాల్లోనూ వేలు పెడుతున్నట్టు చెప్తున్నారు.

సెక్రటేరియట్‌ నుంచి ఫోన్లలో..

బదిలీలైనా, రవాణాశాఖ కార్యాలయంలో ఏదైనా ముఖ్యమైన పనైనా సచివాలయం కేంద్రంగా ఓ వ్యక్తి ఫోన్ల ద్వారానే అంతా నడిపిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అటు ప్రజాప్రతినిధితో, ఇటు ఉన్నతాధికారులతో సత్సతంబంధాలు కొనసాగిస్తూ.. తనకు కావాల్సిన పనిని చేయిస్తున్నట్టు తెలిసింది. ఆర్టీఏ కార్యాలయంలో అవని పనిని కూడా.. తన ఫోన్‌కాల్‌తో చక్కదిద్దేంత స్థాయికి వచ్చాడని బాధితులు అంటున్నారు. ట్రాన్స్‌పోర్టు ఆఫీసులో కానిస్టేబుళ్ల దగ్గర్నుంచి జిల్లాల్లోని డీటీవోలు, మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్‌ మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు, సీనియర్‌/జూనియర్‌ అసిస్టెంట్లు, క్లర్కులు వరకూ ఎవరికి ఎలాంటి బదిలీ కావాలన్నా.. ఈ ముగ్గురి హవానే ప్రస్తుతం నడుస్తున్నదని రవాణాశాఖ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ముందుగానే బదిలీ రేటు మాట్లాడుకోవడం, ఆర్డర్‌ వచ్చిన తర్వాతే డబ్బులు తీసుకోవడం వీరి స్పెషాలిటీ అని పలువురు చెప్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana