Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
RTC Lands | ఆర్టీసీ ఆస్తిపై సర్కార్‌ పెత్తనమేంది.. విలీనం కాకుండానే ఆర్టీసీ ఆస్తి.. ప్రభుత్వ ఆస్తి ఎలా అవుతుంది?

RTC Lands | ఆర్టీసీ ఆస్తిపై సర్కార్‌ పెత్తనమేంది.. విలీనం కాకుండానే ఆర్టీసీ ఆస్తి.. ప్రభుత్వ ఆస్తి ఎలా అవుతుంది?

RTC Lands | హైదరాబాద్‌, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల పేరిట.. తెలంగాణ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు ఆర్టీసీ ఆస్తులను కట్టబెట్టడంపై ఆర్టీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఏ చట్టం కింద ఆర్టీసీకి చెందిన భూములను ప్రభుత్వానికి ధారాదత్తం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఆర్టీసీ చట్టాల ప్రకారం.. ఒక్క క్యాబినెట్‌ నిర్ణయంతో భూములు లాక్కోవడం సరికాదని, ఆ నిర్ణయమే ఫైనల్‌ కాదని అంటున్నారు. ముషీరాబాద్‌ పరిధిలోని జమిస్తాన్‌పూర్‌లో ఉన్న ఆర్టీసీ ఓల్డ్‌ క్వార్టర్స్‌ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ కార్మకులు సైతం ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని, ఉన్నత న్యాయస్థానంలో కేసులు వేసేందుకు ఆర్టీసీ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు.

తెలంగాణ ఆర్టీసీ.. రోడ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ యాక్ట్‌-1950 కింద ఏర్పాటైన చట్టబద్ధ సంస్థ. ఈ చట్టంలోని సెక్షన్‌-4 ప్రకారం, కార్పొరేషన్‌కు ప్రత్యేకమైన చట్టపరమైన హోదా, ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం దానిని నియంత్రిస్తున్నా, దాని మూలధనంలో గణనీయమైన వాటా కలిగి ఉన్నా, ఆర్టీసీకి చెందిన ఆస్తులు ఆ కారణంతో ప్రభుత్వ ఆస్తులుగా మారవని చట్టంలో స్పష్టంగా ఉన్నదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ప్రత్యేకమైన చట్టపరమైన హోదా ఉన్నదని సుప్రీంకోర్టు కూడా గుర్తించిందని వివరిస్తున్నారు. ఆర్టీసీ యాక్ట్‌లోని సెక్షన్‌-19(2)(బీ) ప్రకారం, కార్పొరేషన్‌కు చర, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కలిగి ఉండటం, అలాగే తన వద్ద ఉన్న ఆస్తులను లీజుకు ఇవ్వడం, విక్రయించడం లేదా ఇతర విధానాల్లో బదలాయించడం వంటి అధికారాలు ఉన్నప్పటికీ, అవన్నీ చట్టంలోని నిబంధనలకు లోబడి ఉండాలని గుర్తుచేస్తున్నారు.

చట్టబద్ధ విధానాలకు అనుగుణంగా నిర్ణయాలేవి

సాధారణంగా ఆర్టీసీకి చెందిన భూమిని బదలాయించాలంటే, సంబంధిత చట్టం, వర్తించే నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలు సంస్థకు సంబంధించిన చట్టబద్ధ విధానాలకు అనుగుణంగా కార్పొరేషన్‌లోని సమర్థ అధికారం/బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. సెక్షన్‌-34 ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం టీజీఎస్‌ఆర్టీసీతో సంప్రదింపులు జరిపిన అనంతరం, కార్పొరేషన్‌కు సాధారణ మార్గదర్శకాలు జారీ చేసినా.. 'మైసూర్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ వర్సెస్‌ బాబాజన్‌ కండక్టర్‌’ కేసులో ప్రభుత్వానికి ఉన్న అధికారం సాధారణ ఆదేశాలు ఇవ్వడానికి మాత్రమేనని, ఒక నిర్దిష్ట కేసులో నిర్దిష్ట చర్య తీసుకోవాలని ఆదేశించడానికి కాదని సుప్రీంకోర్టు పేర్కొన్నదని వివరిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీకి చెందిన భూమిని గృహ నిర్మాణ శాఖకు బదలాయించాలని క్యాబినెట్‌ ప్రత్యేకంగా నిర్ణయిస్తే.. దానిని కేవలం సెక్షన్‌-34 కింద ఇచ్చిన ప్రభుత్వ ఆదేశంగా సమర్థించడం చట్టపరంగా సురక్షితం కాదని చెప్తున్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాకుండానే.. ఆర్టీసీ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ఎలా అవుతాయని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

క్యాబినెట్‌ నిర్ణయం వర్సెస్‌ చట్టబద్ధ అధికారం

క్యాబినెట్‌ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన విధానపరమైన నిర్ణయం. చట్టపరమైన పరిధిలో అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగానికి అది మార్గనిర్దేశం చేయగలదు. అయితే, క్యాబినెట్‌ ఆమోదం ఒకటే టీజీఎస్‌ఆర్టీసీ వంటి చట్టబద్ధ సంస్థకు ఉన్న ఆస్తి హకును రద్దు చేయడం లేదా ఆస్తి యాజమాన్యాన్ని ఆటోమాటిక్‌గా బదలాయించదని న్యాయ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఆర్టికల్‌-300(ఏ) ప్రకారం, చట్టబద్ధమైన అధికారం లేకుండా ఎవరినీ వారి ఆస్తినుంచి దూరం చేయకూడని అంటున్నారు.

2025లోకూడా సుప్రీంకోర్టు ఇదే సూత్రా న్ని పునరుద్ఘాటిస్తూ, చట్టబద్ధ అధికారం లేకుండా కేవలం ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా యజమాని ఆస్తిని స్వాధీనం చేసుకోలేరని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి ఆ భూమి తప్పనిసరిగా అవసరమైతే, చట్టబద్ధమైన భూసేకరణ/ఆస్తి బదలాయింపు విధానాన్ని అనుసరించాలని, అందులో వర్తించే పరిహారం, ప్రక్రియ, ఇతర చట్టపరమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌-300(ఏ) కీలకంగా ఉంటుందని వివరిస్తున్నారు.

ఆటోమేటిక్‌గా బదలాయించడం కష్టమే

ఆర్టీసీ యాక్టులోని సెక్షన్‌-22 ప్రకారం.. కార్పొరేషన్‌ తన రవాణా కార్యకలాపాలను నిర్వహించేటప్పుడు వ్యాపార సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలి. అందువల్ల, విలువైన భూమిని తగిన ప్రతిఫలం లేకుండా బదలాయించడం జరిగితే, ఆర్థిక వివేకం, సంస్థ ఆస్తుల పరిరక్షణ కోణంలో ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. అయితే, క్యాబినెట్‌ నిర్ణయం ఒకటే టీజీఎస్‌ఆర్టీసీ భూమిని గృహ నిర్మాణ శాఖకు ఆటోమేటిక్‌గా బదలాయించడానికి సరిపోదని అంటున్నారు.

ఒకవేళ స్వచ్ఛంద బదలాయింపు చేపట్టినా అందుకు వర్తించే చట్టపరమైన, సంస్థాగత విధానాలను పూర్తిగా పాటించాలని సూచిస్తున్నారు. ఆర్టీసీ భూసేకరణ/స్వాధీనం/వెస్టింగ్‌కు ఎలాంటి విధానాన్ని అనుసరించారో ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు. సంబంధిత ఆస్తి ఆర్టీసీకి చెందినది కాబట్టి.. ఆర్టీసీ యాక్ట్‌లోని సెక్షన్లు 4, 5, 19 కింద స్థిరాస్తి బదలాయింపు చట్టబద్ధంగా గుర్తించబడిన విధానం ద్వారానే జరుగాలని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇవన్నీ జరుగకుండా ఆర్టీసీ ఎలా భూమి ఇస్తుందని, దాని గురించి ప్రభుత్వం ఎలా ప్రకటన చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.

ఇంకా పూర్తికాని ఏపీ, తెలంగాణ ఆస్తుల విభజన

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం గతంలో ఉన్న ఏపీఎస్‌ఆర్టీసీ కూడా చట్టబద్ధ పునర్వ్యవస్థీకరణ పరిధిలోకి వచ్చిన సంస్థల్లో ఒకటి. ఈ చట్టంలోని సెక్షన్‌-68(2) ప్రకారం తొమ్మిదో షెడ్యూల్‌లో పేరొన్న కంపెనీలు/కార్పొరేషన్ల ఆస్తులు, హకులు, బాధ్యతలను సెక్షన్‌-53లో పేరొన్న విధానానికి అనుగుణంగా ఇరు రాష్ట్రాల మధ్య విభజించాలి. సెక్షన్‌-53 రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆస్తులు, బాధ్యతల విభజనకు చట్టబద్ధమైన విధానాన్ని నిర్దేశిస్తుంది. సంబంధిత సంస్థ అంతర్రాష్ట్ర సంస్థగా మారినప్పుడు, దాని కార్యకలాపాల యూనిట్లను అవి ఉన్న ప్రాంతం ఆధారంగా, ప్రధాన కార్యాలయాన్ని నిర్దేశిత జనాభా ప్రాతిపదికన విభజించాల్సి ఉంటుంది.

విభజన అనంతరం ఆస్తులు, బాధ్యతలను చట్టబద్ధ విధానం ప్రకారం బదలాయించడం లేదా సర్దుబాటు చేయాలి. అందువల్ల, ఒక నిర్దిష్ట ఆర్టీసీ భూమి భౌతికంగా తెలంగాణలో ఉన్నదన్న కారణంతో మాత్రమే ఆ భూమికి రాష్ట్ర ప్రభుత్వమే యజమాని అని నిర్ధారించలేమని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఆ నిర్దిష్ట ఆస్తికి సంబంధించిన యాజమాన్య హకు, వెస్టింగ్‌, చట్టబద్ధ ఆస్తి విభజన వంటి అంశాలను స్పష్టంగా నిర్ధారించాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. అదేవిధంగా, తొమ్మిదో షెడ్యూల్‌లోని సంస్థలకు సంబంధించి సెక్షన్‌-71, పాత రాష్ట్రానికి చెందిన వాటాలు, ప్రయోజనాల విభజన, అలాగే వారస రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా బోర్డును పునర్వ్యవస్థీకరించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసే అధికారం కల్పిస్తుందని చెప్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana