హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సింగూరు ప్రాజెక్టు పూర్వవైభవం సంతరించుకోనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో.. దశాబ్దాల కల సాకారం కానున్నది.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో సింగూరు ప్రాజెక్టును అనుసంధానించేలా సీఎం కేసీఆర్ డిజైన్ రూపొందించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు 2.891 కిలోమీటర్ వద్ద 4 గేట్లతో ఏర్పాటుచేసిన రెండో స్లూయిస్ నుంచి సింగూరు ప్రాజెక్టుకు (18,19 ప్యాకేజీల ద్వారా) రోజుకు అర టీఎంసీ నీటిని పంపిస్తారు. దానికింద 1,32,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానున్నది. జలాశయం కుడివైపు బ్యాక్‌వాటర్ 12 టీఎంసీలను ఎత్తిపోసి జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగులోకి తెచ్చేలా సంగమేశ్వర పథకానికి రూపకల్పన చేసింది. ఎడమవైపు నుంచి 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసి నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు.
బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం ఇప్పటికే పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించింది. రూ.16 కోట్లతో సంగమేశ్వర, రూ.11 కోట్లతో బసవేశ్వర పథకాలకు సర్వే చేపట్టి ఇటీవలే డీపీఆర్‌లను సిద్ధం చేశారు. ఇందులోభాగంగా సింగూరు ప్రాజెక్టు నుంచి 165 మీటర్ల ఎత్తుకు సాగునీటి పంపింగ్ చేసేలా సంగమేశ్వరను రూపొందించారు. అదేవిధంగా ఈ రెండు ఎత్తిపోతల పథకాల్లో భాగంగా చెరువులు, కుంటలను అనుసంధానిస్తూ సుమారు 960 కిలోమీటర్ల మేర కాలువల తవ్వకం చేపట్టనున్నారు. ఈ పథకాలతో సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం కానున్నది.

