Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సరస్వతీ నిలయంలో ప్రైవేట్‌ మ్యూజియమా?

సరస్వతీ నిలయంలో ప్రైవేట్‌ మ్యూజియమా?

  • తెలుగు వర్సిటీలో ఆద్యకళ మ్యూజియం
  • నాంపల్లి క్యాంపస్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం
  • సూత్రప్రాయంగా అంగీకరించిన సర్కార్‌
  • ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత
  • 9వ రోజుకు చేరిన రిలే దీక్షలు
  • నిరసనలతో హోరెత్తుతున్న వర్సిటీ
  • మద్దతునిస్తున్న భాషా, సాహిత్యకారులు

హైదరాబాద్‌, జూలై 10 (నమస్తే తెలంగాణ): తెలుగు విశ్వవిద్యాలయం (నాంపల్లి) ప్రాంగణంలో ఆద్యకళా మ్యూజియం ఏర్పాటు అంశం రచ్చకెక్కుతున్నది. ప్రైవేట్‌ మ్యూజియానికి యూనివర్సిటీని కేటాయించడం వివాదాస్పదమవుతున్నది. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, కళాకారులు, మేధావులు, పలు సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. వర్సిటీని రక్షించుకొనేందుకు 'తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి'గా ఏర్పడి నిరవధిక రిలే దీక్షలకు దిగారు. ఈ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు 9వ రోజుకు చేరుకున్నాయి. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, చరిత్రను పరిరక్షించడం, అభివృద్ధి చేయడం, వ్యాప్తిచేయడం లక్ష్యంగా ఎన్టీఆర్‌ హయాంలో తెలుగు వర్సిటీ ఏర్పాటైంది. ప్రస్తుతం రెండెకరాల్లో వర్సిటీ క్యాంపస్‌ నాంపల్లిలో నడుస్తున్నది. వర్సిటీ విస్తరణలో భాగంగా బాచుపల్లిలో మరో క్యాంపస్‌ను నడుపుతున్నారు. ఆద్యకళా మ్యూజియం ఏర్పాటుకు నాంపల్లి క్యాంపస్‌ కేటాయించాలని కోరుతూ సర్కార్‌కు వినతులందాయి. దీనికి సర్కార్‌ సుముఖంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదే విషయంపై ప్రభుత్వం ఇప్పటికే వర్సిటీ నుంచి నివేదిక కోరింది. దీనిపై విద్యార్థులు, అధ్యాపకులు భగ్గుమంటున్నారు. ఈ ప్రతిపాదనలను సర్కార్‌ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాము చదువుకోవడానికే చోటు లేదంటే మ్యూజియం పెడుతారా? అని ప్రశ్నిస్తున్నారు.

నాంపల్లి ప్రాంగణంలో కోర్సులు
నాంపల్లి క్యాంపస్‌లో విద్యార్థుల్లేరు.. క్లాసులు జరుగడం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వర్సిటీ మొత్తం బాచుపల్లికి పోయిందని, నాంపల్లి క్యాంపస్‌ ఖాళీగా ఉన్నదన్న అభిప్రాయంతో సర్కార్‌ ఉన్నదని.. ఇది పూర్తిగా అవాస్తవమని చెప్తున్నారు. బాచుపల్లిలో వర్సిటీ కొనసాగుతున్నా.. నాంపల్లి క్యాంపస్‌లో కొన్ని రకాల రెగ్యులర్‌ కోర్సులతోపాటు, పలు సాయంకాల కోర్సులను నడుపుతున్నారు. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ ఇన్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ ఇన్‌ ఇంటీరియల్‌ డిజైన్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ డిజైన్‌, సర్టిఫికెట్‌ ఇన్‌ యానిమేషన్‌ అండ్‌ వీఎఫ్‌ఎక్స్‌, సర్టిఫికెట్‌ ఇన్‌ ఫొటోగ్రఫీ అండ్‌ వీడియో ఎడిటింగ్‌ వంటి రెగ్యులర్‌ కోర్సులు, డిప్లొమా ఇన్‌ లలిత సంగీతం, డిప్లొమా ఇన్‌ ఫిల్మ్‌ డైరెక్షన్‌, డిప్లొమా ఇన్‌ పద్యనాటకం, డిప్లొమా ఇన్‌ మిమిక్రీ, డిప్లొమా ఇన్‌ ఇంద్రజాలం, ఎంఏ జ్యోతిషం, పీజీ డిప్లొమా ఇన్‌ యోగా వంటి కోర్సులను ఇక్కడ నడుపుతున్నారు. ఆడిటోరియం, మ్యూజియం ఉన్నది. స్నాతకోత్సవం, సభలు, సమావేశాలను నాంపల్లి క్యాంపస్‌లోనే నిర్వహిస్తున్నారు.

వినూత్న రీతిలో నిరసన
వర్సిటీ భవనాలను కాపాడుకొనేందుకు విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు రోజుకో తీరులో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నృత్యాలు, కళారూపాలతో ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం డప్పు వాయిద్యాలతో నిరసన తెలిపారు. బాచుపల్లి క్యాంపస్‌లోని బోధన, బోధనేతర సిబ్బంది, వరంగల్‌ పీఠం ప్రొఫెసర్లు, విద్యార్థులు దీక్షలకు సంఘీభావం ప్రకటించారు.

వర్సిటీని కాపాడండి
నాంపల్లిలో తెలుగు యూనివర్సిటీ భవనం ఖాళీగా ఉన్నదని ఎలా భావిస్తారు? ప్రైవేట్‌ వ్యక్తులకు ఎలా అప్పగిస్తారు? ఇది గర్హనీయం. నాంపల్లి క్యాంపస్‌లో పలు కోర్సులు నడుస్తున్నాయి. కళలు, కోర్సులను కాపాడాల్సింది పోయి.. ప్రైవేట్‌ వ్యక్తులకు కేటాయించడం అత్యంత దారుణం. ఎన్టీఆర్‌ ఆలోచనలతో ఏర్పాటైన వర్సిటీని నిర్వీర్యం చేస్తారా? ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. తెలుగు వర్సిటీని కాపాడాలి.
-ప్రొఫెసర్‌ వనజా ఉదయ్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana