Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
షాపూర్‌జీ పల్లోంజీకి సచివాలయ పనులు

షాపూర్‌జీ పల్లోంజీకి సచివాలయ పనులు

  • l అంచనా వ్యయం కంటే 4.02 శాతం ఎక్కువకు కోట్‌
  • l అంగీకారపత్రాన్ని అందించిన ఈఎన్సీ గణపతిరెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనులను ముంబైకి చెందిన షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ దక్కించుకున్నది. రోడ్లు, భవనాల శాఖ గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రూ.617 కోట్లతో నూతన సచివాలయ సముదాయాన్ని నిర్మించేందుకు గత నెల 10న ప్రభు త్వం జీవో47ను జారీచేసింది. రోడ్లు, భవనాల శాఖ ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో టెండర్లు పిలిచింది. గత నెల 30 నుంచి ఈ నెల 20 వరకు బిడ్ల స్వీకరణకు గడువుగా విధించింది. భవన సముదాయం నిర్మాణంపై సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ఈ నెల 7న ప్రీబిడ్‌ సమావేశాన్ని నిర్వహించింది.

హాజరైన కేసీపీ ప్రాజెక్ట్స్‌, జీఎంసీ ప్రాజెక్ట్స్‌, టాటా ప్రాజెక్ట్స్‌, ఎన్‌సీసీ లిమిటెడ్‌, షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధులు.. సచివాలయ నిర్మాణానికి టెండర్లలో ఏడాది సమయం ఇచ్చారని.. దానిని ఏడాదిన్నరకు పొడిగించాలని కోరారు. వారి విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు.

ఈ నెల 20న సాంకేతిక బిడ్లను తెరవగా.. ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీలు బిడ్లు దాఖలు చేసినట్టు వెల్లడైంది. సాంకేతికంగానూ రెండూ ప్రైస్‌బిడ్లకు అర్హత సాధించాయి. అనంతరం అధికారులు ఈ నెల 23న ప్రైస్‌బిడ్లను తెరిచారు.

కాంట్రాక్టు అంచనా విలువ రూ.494.86 కోట్లు ఉండ గా.. ఎల్‌అండ్‌టీ కంపెనీ 4.80 శాతం ఎక్కువకు కోట్‌ చేయగా.. షాపూర్‌జీ పల్లోంజీ 4.02 శాతం ఎక్కువకు కోట్‌ చేసింది. ఈ రెండింటిలో నుంచి షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీని ఎల్‌-1గా గుర్తించారు. బిడ్ల వివరాలన్నింటినీ రోడ్లు, భవనాల శాఖ అధికారులు కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌ (సీఓటీ)కి పంపగా.. అక్కడ సమగ్ర పరిశీలన తర్వాత ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి షాపూర్‌జీ పల్లోంజీ రీజనల్‌ హెడ్‌ లక్ష్మణ్‌ అగర్వాల్‌కు టెండర్‌ అంగీకార పత్రాన్ని అందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana