Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శతక గర్జన

శతక గర్జన

  • గిల్‌, ఇషాన్‌ సెంచరీలు
  • రెండో వన్డేలో భారత్‌ ఘన విజయం

లక్నో: రాబోయే ప్రపంచ కప్‌నకు పదునైన జట్టును తయారు చేసుకునే పనిలో ఉన్న భారత్‌.. అఫ్గానిస్థాన్‌పై పరుగుల పంజా విసిరింది.

వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ (110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154) తొలి శతకానికి తోడు ఇషాన్‌ కిషన్‌ (79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 125) మెరుపు సెంచరీతో చెలరేగాడు. దాంతో రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి 400 పైచిలుకు స్కోరు చేసిన భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ ను 2-0తో సొంతం చేసుకుంది.

బుధవారం పూర్తి ఏకపక్షంగా సాగిన రెండో మ్యాచ్‌లో 170 పరుగుల తేడాతో అఫ్గాన్‌ను చిత్తు చేసింది. తీవ్రమైన ఉక్కపోత, కండరాల నొప్పులు వేధించినా భారీ సెంచరీతో గిల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. వన్డేల్లో శతకం కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్న కిషన్‌ ఎట్టకేలకు ఆ నిరీక్షణకు తెరదించాడు. వీళ్ల జోరుతో తొలుత భారత్‌ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత్‌ ఈ మ్యాచ్‌లోనూ ప్రయోగాలు కొనసాగించింది. రోహిత్‌ శర్మ (48) మెరిసినా.. అతనికి తోడుగా ఓపెనర్‌గా వచ్చిన యశస్వి జైస్వాల్‌ (4) నిరాశపరిచాడు.

అయితే, గిల్‌, ఇషాన్‌ మూడో వికెట్‌కు 141 బంతుల్లోనే 224 రన్స్‌ జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. కానీ, అఫ్గాన్‌ స్పిన్నర్లు ఖరోటే (4/76), రషీద్‌ ఖాన్‌ (3 వికెట్లు) ధాటికి భారత్‌ చివరి 10 ఓవర్లలో 41 పరుగుల వ్యవధిలోనే ఆఖరి 7 వికెట్లు కోల్పోయింది. కేఎల్‌ రాహుల్‌ (0) డకౌట్‌ కాగా, శ్రేయస్‌ అయ్యర్‌ ( 26) ఫర్వాలేదనిపించాడు. అనంతరం అఫ్గాన్‌ 44.3 ఓవర్లలో 232 రన్స్‌కే కుప్పకూలింది. రహ్మత్‌ షా (71), సెదిఖుల్లా (42), గుర్బాజ్‌ (41) మాత్రమే పోరాడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, గుర్నూర్‌ బ్రార్‌ చెరో మూడు, అరంగేట్రం పేసర్‌ ప్రిన్స్‌ యాదవ్‌ రెండు వికెట్లు పడగొట్టారు. గిల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య చివరి మూడో వన్డే శనివారం చెన్నైలో జరుగుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana