తాజావార్తలు
సీజనల్ వ్యాధులపై వార్

- ఆరోగ్య హైదరాబాద్ లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ వార్షిక కార్యాచరణ
- దోమల నివారణపై ప్రత్యేక నజర్
- గతేడాది తరహాలోనే డెంగీ, మలేరియా వంటి వ్యాధుల కట్టడికి చర్యలు
నగర ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముందుకు వెళ్తున్నది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నది. డెంగీ, మలేరియా, చికున్ గున్యా తదితర వ్యాధులు ప్రజల దరి చేరకుండా చర్యలు తీసుకుంటున్నది. అధికారుల చర్యలతోపాటు ప్రజల భాగస్వామ్యమూ అవసరమేనంటూ అవగాహన కల్పిస్తున్నది. గతేడాది రూపొందించిన ప్రణాళికలు సత్ఫలితాలివ్వటంతో అదే స్ఫూర్తితో దూకుడు పెంచింది. ఈయేడూ సీజనల్ వ్యాధుల కట్టడికి రంగం సిద్ధం చేసింది
ఆరోగ్య హైదరాబాద్ లక్ష్యంగా సీజనల్ వ్యాధులపై జీహెచ్‌ఎంసీ యుద్ధం ప్రకటించింది. డెంగీ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధుల నియంత్రణకు యంత్రాంగం వార్షిక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తున్నది. నెలవారీగా చేపట్టే పనులకు తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకొని అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలను వేగిరం చేశారు. గతేడాది తరహాలోనే ఈ వార్షిక సంవత్సరంలో 'ఆపరేషన్ దోమ' పేరిట ప్రతి వారం యాంటీ లార్వా కార్యక్రమం చేపట్టనున్నారు. ఇంటింటికీ ఫాగింగ్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పేరిట పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టడంతోపాటు పాఠశాలలు, దవాఖానాలు, కాలేజీలు, ఇంటి పరిసరాల శుభ్రతపై విస్తృత అవగాహన కల్పించనున్నారు. 2020లో మలేరియా 3, డెంగీ 346 కేసుల వరకే పరిమితం చేసి గణనీయంగా తగ్గించామని, ఈసారి కూడా దోమల నియంత్రణకు అన్ని విభాగాల సమన్వయంతో పకడ్బందీ చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ చీఫ్ రాంబాబు తెలిపారు.
డివిజన్ల వారీగా ప్రణాళికలు
జీహెచ్‌ఎంసీ పరిధిలోని 9013 కిలోమీటర్ల మేరలో వార్డుల వారీగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు లేకుండా చూడడం, రోడ్ల పక్కన పడేసిన సీఅండ్‌డీ వ్యర్థాలను తీసేయడం, నీరు నిలిచే ప్రాంతాలపై దృష్టి సారించడం, నాలాల్లో పూడికతీత పనులను ముమ్మరం చేయడం, చెత్త, చెదారం లేకుండా చేయడం లాంటివి ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఈ మేరకు పారిశుధ్య కార్మికులు, సిబ్బందితోపాటు రవాణా విభాగంలో పనిచేసే వారికీ ఆయా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేలా ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు.
వీటిపైనే ప్రత్యేక నజర్
- ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన చెత్త ఏరివేత.
- నీరు నిలిచే ప్రాంతాల్లో పేరుకుపోయిన ఇసుక, ఇతర వ్యర్థాల తొలగింపు. నాలాల్లో పూడికతీత పనులు.
- భవన నిర్మాణ వ్యర్థాలను తరలించడం.
- రహదారుల వెంట ఉన్న పొదలు, పిచ్చి మొక్కలు(ఆకులు) ఏరివేత.
ప్రజల సహకారంతోనే సాధ్యం..
వివిధ అంటు, సీజనల్ వ్యాధులకు కారణమయ్యే దోమల నివారణకు నగరవాసులు బాధ్యతాయుతంగా కృషి చేస్తేనే నివారణ సాధ్యమని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. గతేడాది తరహాలోనే ఇండ్లలో ఉన్న ఈ నీటి నిల్వలను ప్రతి ఒక్కరూ కనీసం రెండు రోజులకు ఒకసారి తొలగింపు పనులు స్వచ్ఛందంగా చేపట్టేలా నగరవాసులకు అవగాహన కల్పించేందుకు నిర్ణయించారు. దీంతోపాటు మూసీలో పారే మురుగునీటిలో, మురుగు కాలువల్లో ఉత్పత్తయ్యే క్యూలెక్స్ దోమల నిర్మూలనకు పెద్ద ఎత్తున యాంటీ లార్వా మందును ఎంటమాలజీ విభాగం సిబ్బంది స్ప్రే చేయనున్నారు.
వార్షిక కార్యాచరణలో పటిష్టమైన చర్యలు
వార్షిక కార్యాచరణలో భాగంగా అంటువ్యాధులను అరికట్టేందుకు నిరంతర సమీక్షలతోపాటు వాటిని ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచేందుకు ప్రతి నెలా సమావేశాలు నిర్వహిస్తారు. అంటువ్యాధులకు కారణమయ్యే దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్స్ చేసేందుకు క్షేత్రస్థాయిలో అవసరమైన పరికరాలను సమకూర్చుకుంటారు. ఏ జోన్‌లో ఎంత స్టాక్ అవసరమో ముందే అంచనా వేసి ఆ నెలకు సంబంధించి సామగ్రిని సిద్ధం చేసుకుంటారు. ఎడెస్ లార్వా సర్వే చేయడం, స్ప్రే చేయవంటివి చేస్తారు. రోజు, వారాల వారీగా జ్వరం వచ్చిన తీరుపై నివేదిస్తారు. నీటి నిల్వలను గుర్తించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. మే మాసం మలేరియా, డెంగీ నిరోధక నెల కావడంతో సీఈ, ఎస్‌ఈ, ఏఈలతో వ్యక్తిగత సమీక్షలు చేపడతారు. మే 16ను వరల్డ్ డెంగీ డేగా పరిగణిస్తారు. వేసవిలో వడదెబ్బ వంటి అంశాలపై పనిచేస్తారు. విరేచనాలు, టైఫాయిడ్ వంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు చర్యలు చేపడతారు. అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన , చైతన్యాన్ని కలిగించేందుకు ఆడియో, వీడియో విజువల్స్‌తో నగరంలో ప్రచారం చేయడం. ప్రధాన ప్రాంతాల్లో హోర్డింగ్స్ ఏర్పాటు. పాఠశాలల్లో అవగాహన, నీటి నిల్వలపై ప్రజలకు సమాచారం తెలియజేసే కార్యక్రమాలను నిర్వహిస్తారు.