Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Six Guarantees | ఆరు గ్యారెంటీల అమల్లో ఘోరంగా విఫలం : హరీశ్‌రావు

Six Guarantees | ఆరు గ్యారెంటీల అమల్లో ఘోరంగా విఫలం : హరీశ్‌రావు

  • కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యం
  • వ్యవస్థలను కుప్పకూల్చిన రేవంత్‌రెడ్డి
  • బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ లీడర్‌ తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 (నమస్తే తెలంగాణ): వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్‌ సర్కార్‌ ఆరు గ్యారెంటీల అమల్లో ఘోరంగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ లీడర్‌ హరీశ్‌రావు విమర్శించారు. 'కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యిలా' కేసీఆర్‌ అప్పగించిన రాష్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. చేతగానితనంతో వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెయ్యిరోజుల కాంగ్రెస్‌ విఫల పాలనపై బీఆర్‌ఎస్‌ పార్టీ చార్జ్‌షీట్‌ను బుధవారం తెలంగాణభవన్‌లో విడుదల చేసింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో కలిసి హరీశ్‌రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ గద్దెనెక్కిన తర్వాత రాష్ట్రంలో విద్య, వైద్య, విద్యుత్తు, వ్యవసాయ రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, ప్రజల పక్షాన పోరాడేందుకే వారం రోజుల కార్యాచరణ ప్రకటించామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అరాచకాలు, వ్యవస్థల నిర్వీర్యం, ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో ప్రభుత్వ ఘోర వైఫల్యాలను ఎండగడుతూ చార్జ్‌షీట్‌ను ప్రజల ముందు ఉంచుతున్నామని ప్రకటించారు. పదేండ్లపాటు కేసీఆర్‌ ఎంతో కష్టపడి దేశానికే తలమానికంగా తీర్చిదిద్దిన తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్‌ సరార్‌ విధ్వంసం చేస్తున్నదని దుయ్యబట్టారు.

నాడు అన్నింటా అగ్రగామి.. నేడు అధోగతి
కేసీఆర్‌ పాలనలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్‌ పాలనలో అధోగతి పాలవుతున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల పేరిట బాండ్‌ పేపర్లు రాసిచ్చి, వంద రోజుల్లో అమలు చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్‌.. వెయ్యి రోజులు గడుస్తున్నా అమలు చేయడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. 'ప్రాణాలకు తెగించి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ కొత్త రాష్ట్రాన్ని తన అపార అనుభవంతో, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎంతో కష్టపడి అద్భుతంగా నిర్మించారు.

అనేక కార్యక్రమాలతో దేశం నేర్చుకొనేవిధంగా తొమ్మిదిన్నరేండ్లు అద్భుత పాలన అందించారు. ఏ రంగం చూసినా తెలంగాణను దేశానికే ఆదర్శంగా తయారుచేశారు. అత్యధిక వరి పండించిన రాష్ట్రంగా నిలిపార'ని వివరించారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ ఒకొకటిగా కుప్పకూలిపోతున్నాయని, విద్య, వైద్య, విద్యుత్తు, తాగునీరు, శాంతిభద్రతలు.. ఇలా ప్రతి వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఉంటే, రేవంత్‌రెడ్డి పాలనలో కరెంట్‌ కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దేశంలోనే అగ్రగామిగా నిలిచిన వైద్య రంగం నేడు ప్రభుత్వ దవాఖానల్లో కనీసం మందులు కూడా దొరుకని దీనస్థితికి దిగజారిందని వాపోయారు.

తిరోగమనం దిశగా రాష్ట్రం
పురోగమనం వైపు వేగంగా ప్రయాణం చేయాల్సిన తెలంగాణ రాష్ట్రం.. కాంగ్రెస్‌ ప్రభుత్వ చేతగానితనంతో తిరోగమనం వైపు పయనిస్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు. వ్యవస్థలను కాపాడాలని, ఆరు గ్యారెంటీలు అమలు కావాలని, ప్రజల కష్టాలు తొలగిపోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే బీఆర్‌ఎస్‌ పార్టీ ఏడు రోజుల నిరసన కార్యక్రమాలను ప్రకటించిందని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితాఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్‌, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ కేఆర్‌ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్‌ రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీలు మాలోత్‌ కవిత, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, దేవీప్రసాద్‌, వై సతీశ్‌రెడ్డి, కోలేటి దామోదర్‌, చిరుమల్ల రాకేశ్‌, పార్టీ రాష్ట్ర నేత తలసాని సాయికిరణ్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana