Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sleeplessness | నిద్రలేమి సమస్య ఉన్నవారు పాటించాల్సిన చిట్కాలు ఇవే.. హాయిగా నిద్రించవచ్చు..

Sleeplessness | నిద్రలేమి సమస్య ఉన్నవారు పాటించాల్సిన చిట్కాలు ఇవే.. హాయిగా నిద్రించవచ్చు..

Sleeplessness | ఆరోగ్యంగా ఉండడానికి తగినంత నిద్ర ఎంతో అవసరం. అయితే వృత్తిపరమైన ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, శారీరక శ్రమ తక్కువగా ఉండే జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటి కారణాలతో చాలామందిలో నిద్ర విధానం దెబ్బతింటోంది.

సాధారణంగా రోజుకు 8 గంటల నిద్ర ఆరోగ్యానికి మంచిదిగా వైద్యులు చెబుతుంటారు. కానీ ప్రస్తుత జీవనశైలిలో ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోవడం చాలామందికి సాధ్యం కావడం లేదు. తగినంత నిద్ర లేకపోవడం లేదా నిద్ర సమయాల్లో తరచూ మార్పులు రావడం వల్ల స్వల్పకాలికంగానే కాకుండా దీర్ఘకాలంలోనూ ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. చిరాకు, ఏకాగ్రత తగ్గడం, మెదడు పనితీరుపై ప్రభావం, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో డిప్రెషన్‌కు కూడా దారితీస్తోంది. రాత్రి పడుకునే ముందు ఎక్కువగా తినడం లేదా పడుకునే సమయానికి చాలా దగ్గరగా భోజనం చేయడం వల్ల గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. దీంతో నిద్రపోవడం కష్టంగా మారుతుంది. అందువల్ల రాత్రివేళ పడుకునే ముందు అతిగా తినడం, మధ్యలో అనవసరంగా స్నాక్స్‌ తీసుకోవడం వంటివి తగ్గించుకోవాలి.

క్రమబద్దమైన అలవాటు ముఖ్యం..

ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం వంటి క్రమబద్ధమైన నిద్ర అలవాటును పాటించడం కూడా ముఖ్యమే. వారాంతాల్లో కూడా నిద్ర సమయాన్ని ఎక్కువగా మార్చకుండా చూసుకోవడం వల్ల శరీరంలోని జీవ గడియారం క్రమబద్ధంగా పనిచేయడానికి సహాయపడుతుంది. శరీరానికి ఒక సహజమైన జీవ గడియారం ఉంటుంది. అది సక్రమంగా పనిచేస్తే రాత్రి నిద్రపోవడం, నిద్రను కొనసాగించడం సులభమవుతుంది. శారీరక శ్రమ లేకుండా ఎక్కువసేపు కూర్చునే జీవనశైలి కూడా నిద్రపై ప్రభావం చూపిస్తుంది. ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేయడం వల్ల రాత్రివేళ మెరుగైన నిద్ర పొందేందుకు సహాయపడుతుంది. వ్యాయామం తీవ్రంగా ఉండాల్సిన అవసరం లేదు, తేలికపాటి శారీరక కార్యకలాపాలు కూడా నిద్రకు ఉపయోగపడతాయి. రాత్రివేళ మద్యం, సిగరెట్లు, కెఫీన్‌ వంటి వాటిని తీసుకోవడం నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. అలాగే పడుకునే సమయానికి దగ్గరగా ఎక్కువగా లేదా మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం కూడా నిద్రపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రి భోజనాన్ని తేలికగా, పడుకునే సమయానికి కొంత ముందుగానే ముగించడం మంచిది.

పాలలో ఇవి కలిపి తాగితే..

పడకపై నిద్రపోవడం తప్ప ఇతర పనులు చేయడం కూడా నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. పుస్తకం చదవడం, మొబైల్‌ స్క్రీన్‌ చూడటం లేదా ఇతర పనులు చేయడం వంటి అలవాట్లు పడకను నిద్ర కోసం ఉపయోగించే ప్రదేశంగా మెదడు గుర్తించకుండా చేస్తుంది. అందువల్ల ఇలాంటి పనులు చేయాల్సి వస్తే మరో గదిలో పూర్తి చేసి, నిద్రపోయే సమయంలో మాత్రమే పడకపైకి వెళ్లడం మంచిది. నిద్ర సమస్యలు లేదా స్వల్ప స్థాయి నిద్రలేమి ఉన్నవారు ఆయుర్వేదంలో సూచించే కొన్ని ఆహార పద్ధతులను కూడా ప్రయత్నించవచ్చు. పడుకునే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు జాజికాయ, కొద్దిగా యాలకులు, మెత్తగా చేసిన బాదం కలిపి తీసుకోవడం మేలు చేస్తుంది. అలాగే పాలు, నీరు, తాజా వెల్లుల్లి కలిపి మరిగించి తయారు చేసిన వెల్లుల్లి పాలను తీసుకోవచ్చు. ఒక కప్పు పాలకు పావు కప్పు నీరు, ఒక వెల్లుల్లి రెబ్బను కలిపి మరిగించి, ద్రవం ఒక కప్పు పరిమాణంలో మిగిలిన తర్వాత తీసుకోవాలి.

చెర్రీలు..

చెర్రీలను క్రమం తప్పకుండా తీసుకోవడం కూడా మంచి నిద్రకు సహాయపడుతుంది. అలాగే ఒక కప్పు తాజా టమాటా రసంలో రెండు టీస్పూన్ల చక్కెర, చిటికెడు జాజికాయ కలిపి సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో తీసుకుని, రాత్రి భోజనాన్ని ముందుగానే ముగించాలి. నిద్రను మెరుగుపరచుకోవడానికి బ్రాహ్మి, అశ్వగంధ, శంఖపుష్పి, జటమాంసి వంటి కొన్ని మూలికలను కూడా ఉపయోగించవచ్చు. అయితే నిద్ర సమస్యలు తరచూ కొనసాగుతున్నప్పుడు లేదా ఎక్కువకాలంగా నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు స్వయంగా మూలికలు లేదా ఇతర చికిత్సలు ప్రారంభించకుండా నిపుణులను సంప్రదించడం మంచిది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana