రియోడిజనీరో: రష్యా రిజిస్టర్ చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి కొవిడ్-19 టీకా స్పుత్నిక్ వీని పరీక్షించేందుకు, ఉత్పత్తి చేసేందుకు బ్రెజిల్ దేశంలోని పరానా రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది. టీకాను ఉత్పత్తి చేసే ముందు మొదట దాని భద్రత, ప్రభావాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర అధికారులు పేర్కొన్నారు. 'ఈ టీకా బ్రెజిల్‌లో ఉత్పత్తి చేయడానికి ముందు బ్రెజిలియన్ రెగ్యులేటరీ ఆమోదం పొందాలి. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లేదా మనుషులపై పెద్ద ఎత్తున పరీక్షించాల్సి ఉంటుంది.' అని తెలిపారు.
టీకా సురక్షితం అని తేలితే 2021 రెండో భాగంలో మాత్రమే ఉత్పత్తి ప్రారంభమవుతుందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వ పారానా టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ హెడ్ జార్జ్ కల్లాడో వెల్లడించారు.

