Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Stock Markets | వరుస నష్టాలకు బ్రేక్‌.. ఇవాళ్టి ట్రేడింగ్‌లో లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్‌లు..!

Stock Markets | వరుస నష్టాలకు బ్రేక్‌.. ఇవాళ్టి ట్రేడింగ్‌లో లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్‌లు..!

Stock Markets : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ల (Stock Markets) లో మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇవాళ్టి ట్రేడింగ్‌లో సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో మదుపర్ల (Investers) లో కొనుగోళ్లపై ఆసక్తి కనిపించింది. ఉదయం 11 గంటల సమయానికి నిఫ్టీ (Nifty) 100కి పైగా పాయింట్లు లాభపడి 24 వేల మార్కును దాటి 24,020 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ (Sensex) 300కు పైగా పాయింట్లు పుంజుకుని 76,870 వద్ద కొనసాగుతోంది.

గత సెషన్‌లో అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం కూడా దేశీయ మార్కెట్లకు సానుకూలంగా మారింది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.46 శాతం, నాస్‌డాక్‌ సూచీ 0.45 శాతం చొప్పున లాభపడ్డాయి. అమెరికా ప్రైవేట్‌ రంగ ఉద్యోగాల గణాంకాలు బలహీనంగా ఉండటంతో వడ్డీ రేట్ల పెంపుపై అంచనాల్లో మార్పులు చోటుచేసుకున్నాయని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఇంకా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి.

బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 95.2 డాలర్ల వద్ద ఉంది. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో చమురు సరఫరాలపై ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ, గురువారం ఉదయం ధరల్లో స్వల్ప స్థిరత్వం కనిపించింది. మరోవైపు అమెరికా డాలర్‌ సూచీ 99.48 వద్ద కొనసాగుతోంది. యూఎస్‌ 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్‌ 4.7 శాతానికి చేరడం కూడా ప్రపంచ మార్కెట్లకు కీలక అంశంగా మారింది. బాండ్‌ ఈల్డ్‌లు, డాలర్‌ కదలికలు, చమురు ధరలు, అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు వంటి అంశాలను దేశీయ మదుపరులు నిశితంగా గమనిస్తున్నారు.

బుధవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిసిన నేపథ్యంలో గురువారం ఉదయం కొనుగోళ్లు పుంజుకోవడం మార్కెట్లకు కొంత ఊరటనిచ్చింది. బుధవారం నిఫ్టీ 141.35 పాయింట్లు నష్టపోయి 23,914.45 వద్ద ముగిసింది. తాజా సెషన్‌లో ఆ స్థాయి నుంచి సూచీ తిరిగి 24,000 మార్కును అధిగమించడం గమనార్హం. అమెరికా మార్కెట్లలో సానుకూల ముగింపు, ఆసియా మార్కెట్లలో మెరుగైన పరిస్థితులు, మదుపరుల కొనుగోళ్ల కారణంగా దేశీయ సూచీల్లో ఉదయం లాభాలు కనిపిస్తున్నాయి. అయితే చమురు ధరలు, ప్రపంచ బాండ్‌ ఈల్డ్‌లు, పశ్చిమాసియా పరిణామాలు మార్కెట్‌ తదుపరి కదలికలకు కీలకంగా మారే అవకాశం ఉన్నది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana