Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Stress | ఒత్తిడి తీవ్రంగా ఉన్నవారు ఈ సూచనలు పాటిస్తే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు..

Stress | ఒత్తిడి తీవ్రంగా ఉన్నవారు ఈ సూచనలు పాటిస్తే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు..

Stress | నేటి వేగవంతమైన జీవనశైలిలో వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతల మధ్య సమతుల్యత పాటించడం చాలామందికి సవాలుగా మారింది. ఈ ఒత్తిడి (స్ట్రెస్) రోజువారీ జీవితంపై మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది.

స్ట్రెస్‌ను నిర్లక్ష్యం చేస్తే రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం, డిప్రెషన్ వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఒత్తిడిని గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సైక్లింగ్ ఒక అద్భుతమైన ఎరోబిక్ వ్యాయామం. ఇది బరువు తగ్గడంలోనే కాకుండా ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల మెదడులో సెరొటోనిన్, డోపమైన్, ఫెనైల్‌ఎథైలమైన్ వంటి సంతోషాన్ని కలిగించే రసాయనాల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో మనసు ప్రశాంతంగా ఉండటంతోపాటు డిప్రెషన్ ప్రమాదం కూడా తగ్గుతుంది.

సైక్లింగ్‌..

మోకాళ్ల నొప్పి లేదా కీళ్ల సమస్యలు ఉన్నవారికి స్టాటిక్ సైక్లింగ్ మంచి ప్రత్యామ్నాయంగా నిపుణులు సూచిస్తున్నారు. ఇది కీళ్లపై ఎక్కువ ఒత్తిడి లేకుండా శారీరక వ్యాయామం చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మధుమేహంతో బాధపడేవారు సైక్లింగ్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా తగినంత నీరు తాగాలి. ఒక గంటకు పైగా సైక్లింగ్ చేసే వారు తేలికపాటి కార్బొహైడ్రేట్లు కలిగిన అల్పాహారాన్ని వెంట తీసుకెళ్లడం మంచిది. ముఖ్యంగా టైప్ 1 మధుమేహం ఉన్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. సైక్లింగ్ గుండె, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంతోపాటు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే తుంటి, మోకాళ్లపై తక్కువ ఒత్తిడి పడేలా కాళ్ల కండరాలను చురుకుగా ఉంచి శరీరానికి ఉల్లాసాన్ని అందిస్తుంది. దీనివల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో జీవనశైలి, ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తాయి. సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్యలను చాలావరకు నియంత్రించవచ్చు.

పప్పు ధాన్యాలు..

పప్పుధాన్యాల్లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది అలసటను తగ్గించి శరీరానికి శక్తిని అందించడంతోపాటు అప్పటికే ఉన్న ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. అరటిపండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది ఒత్తిడిని ఎదుర్కొనే పోషకంగా పనిచేయడంతోపాటు స్ట్రెస్ కారణంగా కణాల్లో ఏర్పడే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పెరుగులో ఉండే కాల్షియం ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులోని మంచి బ్యాక్టీరియా మానసిక ప్రశాంతతకు తోడ్పడి ఆందోళన, డిప్రెషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. భోజనంతోపాటు లేదా స్మూతీల రూపంలో పెరుగు తీసుకోవచ్చు. కొబ్బరిలో ఉండే మీడియం చైన్ ఫ్యాట్స్ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి ప్రతికూల ఆలోచనలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే కొబ్బరి వాసన కూడా మానసిక ప్రశాంతతను కలిగించి గుండె స్పందన వేగాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఉదయం అల్పాహారంగా ఓట్స్‌తోపాటు తాజా పండ్లు, కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు సహాయపడతాయి. ఓట్స్ సెరొటోనిన్ ఉత్పత్తిని పెంచడంలో తోడ్పడటంతో మానసిక స్థితి మెరుగుపడి మూడ్ స్వింగ్స్ తగ్గే అవకాశం ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana