Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Supreme Court | సెప్టెంబర్ 5న సీజేపీ నిరసన ర్యాలీ.. నిషేధం విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరణ

Supreme Court | సెప్టెంబర్ 5న సీజేపీ నిరసన ర్యాలీ.. నిషేధం విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరణ

Supreme Court : సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ చేపట్టనున్న నిరసన ర్యాలీపై నిషేధం విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇదే సందర్భంలో ర్యాలీని శాంతియుతంగా నిర్వహించాలని సీజేపీకి సూచించింది.

గత నెలలో సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తలెత్తిన ఘర్షణల్లో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే, నిరసన విరమింపజేసే సందర్భంలో సీజేపీకి ప్రభుత్వం కీలక హామీ ఇచ్చింది.

ఘర్షణల సందర్భంగా విద్యార్థులు, యువతపై నమోదైన కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఆ కేసులు ఎత్తివేయడంలో కేంద్రంతోపాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇంకా కొందరిపై కేసులు పెట్టి వేధిస్తున్నాయి. అలాగే, నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం ఇస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఇంతవరకు ఎవరికీ, ఎలాంటి పరిహారం అందజేయలేదు. దీంతో ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వ తీరుకు నిరసనగా సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరగనుంది.

ఈ ర్యాలీలో నీట్ పేపర్ లీకేజీ సమయంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలు కూడా పాల్గొనబోతున్నాయి. అయితే, ఈ ర్యాలీని నిషేధించాలని కోరుతూ రిటైర్డ్ ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ రాజేంద్ర సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ర్యాలీ వల్ల శాంతి భద్రతల సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది, సున్నితమైన ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించబోతున్నారని కోర్టుకు వివరించారు. పైగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు ఉన్నందున శాంతి భద్రతల్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన ఆధ్వర్యంలోని బెంచ్ విచారించింది. నిరసన ర్యాలీని ఆపేసేలా తాము ఆదేశాలివ్వలేమని పేర్కొంది. ఈ విషయంలో శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత సీజేపీ నిర్వాహకులపై ఉందని కోర్టు సూచించింది. చట్టబద్ధ సంస్థలు ఈ అంశాన్ని పరిశీలిస్తాయని పేర్కొంది. అలాగే, నీట్ ఆందోళనల సందర్భంగా చెలరేగిన హింసపై విచారణ జరుపుతున్న ఉన్నతస్థాయి కమిటీ ముందుకు ఈ అంశాన్ని తీసుకెళ్లాలని సూచించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana