Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Suriya 49 | సూర్య 49లో నాగార్జున.. మరోసారి పవర్‌ఫుల్ విలన్‌గా కింగ్?

Suriya 49 | సూర్య 49లో నాగార్జున.. మరోసారి పవర్‌ఫుల్ విలన్‌గా కింగ్?

Suriya 49 | తమిళ స్టార్ హీరో సూర్య, యంగ్ డైరెక్టర్ హెచ్. వినోద్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

'సూర్య 49' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునను కీలకమైన ప్రతినాయకుడి పాత్ర కోసం మేకర్స్ సంప్రదిస్తున్నట్లు సమాచారం. హెచ్. వినోద్ ఈ సినిమాలో విలన్ పాత్రను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణ విలన్‌లా కాకుండా హీరో సూర్యకు సమానమైన బలం, గంభీరత, ప్రాధాన్యత ఉండేలా ఈ పాత్రను తీర్చిదిద్దుతున్నట్లు టాక్. కథలోని ఆ పాత్రకు ఉన్న డెప్త్, నెగిటివ్ షేడ్స్ నాగార్జునకు నచ్చడంతో ఆయనతో ప్రాథమికంగా చర్చలు కూడా జరిగినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ కాంబినేషన్ అధికారికంగా ఖరారైతే మాత్రం సూర్య, నాగార్జునల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్‌గా మారే అవకాశం ఉంది. గతంలో 'కూలీ'లో పవర్‌ఫుల్ నెగిటివ్ షేడ్ ఉన్న సైమన్ పాత్రలో మెప్పించిన నాగార్జున మరోసారి విలన్‌గా కనిపిస్తే ఆయన అభిమానులకు కూడా ఇది సరికొత్త ట్రీట్ అవుతుంది. ఇక 'సూర్య 49'లో కథానాయికగా బాలీవుడ్ నటి వామికా గబ్బిని తీసుకునేందుకు మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇటీవల 'డీసీ' సినిమాతో సక్సెస్ అందుకున్న వామికా గబ్బి ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే సినిమాకు మరింత పాన్-ఇండియా అప్పీల్ వచ్చే అవకాశం ఉంది. అయితే హీరోయిన్ ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సూర్య సొంత నిర్మాణ సంస్థ 'ఝగరం స్టూడియోస్' ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హై-టెక్నికల్ స్టాండర్డ్స్‌తో భారీ యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ట్రీట్‌తో సినిమాను రూపొందించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం సూర్య వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత 2027 ప్రారంభంలో 'సూర్య 49'ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు హెచ్. వినోద్ కూడా తన తదుపరి ప్రాజెక్ట్‌పై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. సూర్య, నాగార్జున కాంబినేషన్ అధికారికంగా లాక్ అయితే మాత్రం ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రెండు తరాలకు చెందిన స్టార్ హీరోలు ఒకే సినిమాలో ఢీకొనే అవకాశం ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై తెలుగు, తమిళ సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. అయితే నాగార్జున పాత్రకు సంబంధించిన వార్తలపై అధికారిక క్లారిటీ రావాలంటే మేకర్స్ ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana