Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Suryapet News | వేపచెట్టు వివాదం.. రెండు నిండు ప్రాణాలు బలి.. ఎస్ఐకి గాయాలు!

Suryapet News | వేపచెట్టు వివాదం.. రెండు నిండు ప్రాణాలు బలి.. ఎస్ఐకి గాయాలు!

Suryapet News | సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డతండాలో ఒక వేపచెట్టు గొడవ రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఇంటి సరిహద్దులో ఉన్న వేపచెట్టు విషయమై రెండు కుటుంబాల మధ్య సుమారు పాతికేళ్లుగా రగులుతున్న వివాదం చివరకు ప్రాణాంతక ఘర్షణకు దారితీసింది.

అసలు ఏం జరిగిందంటే..

ఎర్రగడ్డతండాకు చెందిన మంద వెంకటేశ్వర్లు యాదవ్, భూక్యా సైదా కుటుంబాల మధ్య చాలా కాలంగా సరిహద్దు వివాదం కొనసాగుతోంది. అయితే ఈ క్రమంలోనే శనివారం ఉదయం వెంకటేశ్వర్లు కొందరిని కూలీలని పిలిపించి ఆ వేపచెట్టును నరికించే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాన్ని గమనించిన భూక్యా సైదా కుమారుడు రాము వెంటనే అక్కడికి చేరుకుని చెట్టును ఎందుకు కొట్టిస్తున్నారంటూ గొడవకి దిగాడు. ఈ మాటా మాటా పెరిగి ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది.

ఈ ఘర్షణ సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన భూక్యా రాము గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో మంద వెంకటేశ్వర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఈ హత్య కేసును పూర్తిగా పక్కదారి పట్టించేందుకు, తనపై కుటుంబంపై నెపం పడకుండా ఉండేందుకు రాము సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డాడు. తన తండ్రి భూక్యా సైదాను అడ్డుకోవడానికి వచ్చినప్పటికీ, రాము తన స్వంత తండ్రిపై కూడా గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. వేపచెట్టు గొడవలో ప్రత్యర్థి వర్గమే తన తండ్రిని చంపిందనే రీతిలో చిత్రీకరించేందుకే రాము ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. అయితే ఈ ఈ జంట హత్యల సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆగ్రహంతో నిందితుడు భూక్యా రాము ఇంటిపైకి దూకి రాళ్లతో దాడి చేశారు. తండాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న మేళ్లచెరువు సబ్-ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు తీవ్రంగా యత్నించారు. ఈ ఘర్షణను నివారించే క్రమంలో ఎస్ఐ నవీన్ కుమార్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను మెరుగైన చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తండాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పికెటింగ్ నిర్వహించారు. ఈ దారుణానికి పాల్పడి, ఇద్దరిని గొడ్డలితో నరికి చంపిన నిందితుడు భూక్యా రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు వేగవంతం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana