Thursday, 29 Jul, 12.27 pm నమస్తే తెలంగాణ

అంతర్జాతీయం
'టెక్‌' యుద్ధాలను అడ్డుకునేందుకు అమెరికా సరికొత్త ప్లాన్‌..

  • 'ఫోర్స్‌ ఫీల్డ్‌’ ప్రాజెక్ట్‌కు అగ్రరాజ్యం శ్రీకారం
  • 5 సూత్రాలతో పనిచేయనున్న రక్షణ వ్యవస్థ
  • 6 అంచెల్లో శత్రు క్షిపణులు తునాతునకలు
  • ఇజ్రాయెల్‌ ఐరన్‌డోమ్‌ కంటే ఎంతో శక్తిమంతం
  • ప్రోటోటైప్‌ సిద్ధం.. 2060లో వినియోగంలోకి!

'స్టార్‌వార్స్‌’ సిరీస్‌ చూశారా? శత్రువుల రాకెట్‌ దాడుల నుంచి ఆయుధాలను, యుద్ధ విమానాలను రక్షించుకునేందుకు హీరో బృందం లేజర్‌ లైట్లను కవచంలా వాడుతుంది. భవిష్యత్‌లో జరిగే 'టెక్‌’ యుద్ధాలను అడ్డుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా కూడా ఒక అడుగు ముందుకేసింది. సైనికుడికి కవచం, రాజ్యానికి కోట ఎలాగో.. దేశమంతటికీ ఒక రక్షణ కవచం అవసరమని భావించింది. అందులో భాగంగానే పుట్టింది 'ఫోర్స్‌ ఫీల్డ్‌’ ప్రాజెక్ట్‌. 'డైరెక్టెడ్‌ ఎనర్జీ ఫ్యూచర్స్‌ 2060' పేరిట అమెరికాలోని ఎయిర్‌ఫోర్స్‌ రీసెర్చ్‌ ల్యాబోరేటరీ (ఏఎఫ్‌ఆర్‌ఎల్‌) ఇటీవల ఓ నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.

అమెరికాలోని 50 రాష్ర్టాల పరిధిలోని అన్ని నగరాలు, అటవీప్రాంతాలు, జలాశయాలను రక్షించేలా డిజైన్‌ చేసిన అత్యాధునిక రక్షణ కవచం 'ఫోర్స్‌ ఫీల్డ్‌’.. ఇజ్రాయెల్‌ ఐరన్‌డోమ్‌తో పోలిస్తే వందల రెట్ల శక్తిసామర్థ్యం 300-400 కిలోమీటర్ల పరిధిలోని క్షిపణులను ధ్వంసం చేసే 'ఎస్‌-400' రక్షణ డోమ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్న భారత్‌

పరిధి ఎంతంటే?
అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌, క్యాపిటల్‌ హౌస్‌, అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటాగాన్‌తో పాటు అమెరికాలో 50 రాష్ర్టాల పరిధిలోని అన్ని నగరాలు, అటవీప్రాంతాలు, జలాశయాలు ఇలా సమస్త ప్రాంతాలను రక్షించేలా ఈ అదృశ్య కవచాన్ని డిజైన్‌ చేస్తున్నారు.

ఏమిటీ ప్రాజెక్ట్‌?
శత్రు దేశాలు ప్రయోగించే లఘు శ్రేణి రాకెట్లు, శతఘ్నులు, మోర్టార్లు, విమానాలు, హెలికాప్టర్లతోపాటు భారీ అణ్వాయుధ క్షిపణులను సైతం సెకండ్లలో గాలిలోనే తునాతునకలు చేసేందుకు ఉద్దేశించిందే డైరెక్టెడ్‌ ఎనర్జీ ఆధారిత 'ఫోర్స్‌ ఫీల్డ్‌’ ప్రాజెక్ట్‌. వచ్చే 40 ఏండ్లలో పురోగతి సాధించే అన్ని రకాల సాంకేతికతలను వినియోగిస్తూ ఓ భారీ అదృశ్య కవచాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్‌ వినియోగిస్తున్న ఐరన్‌ డోమ్‌తో పోలిస్తే.. 'ఫోర్స్‌ ఫీల్డ్‌’ పరిధి, శక్తి ఎన్నో వందల రెట్లు ఎక్కువని విశ్లేషకుల అంచనా.'ఫోర్స్‌ ఫీల్డ్‌’ ప్రొటోటైప్‌ సిద్దమైంది. 2060లో సేవలు అందుబాటులోకి వస్తాయి.

ఎలా పనిచేస్తుంది?
శత్రువుల దాడులను ఎదుర్కొనేందుకు 'ఫోర్స్‌ ఫీల్డ్‌’ ఐదు సూత్రాలను పాటిస్తుంది. శత్రు రాకెట్‌/క్షిపణి శక్తిని తగ్గించడం, అడ్డుకోవడం, పాక్షికంగా ధ్వంసం చేయడం, పూర్తిగా నాశనం చేయడం, దారిమళ్లించేలా చేయడం. విద్యుదయస్కాంత వికిరణం, హైపవర్డ్‌ మైక్రోవేవ్‌, రేడియో ఫ్రీక్వెన్సీ డివైజెస్‌, పార్టికల్‌ వేవ్స్‌, శాటిలైట్‌ సహిత లేజర్‌ కాంతి తదితర సాంకేతికతలతో కూడిన యుద్ధ యంత్రాలను సాయంగా వినియోగిస్తారు. వందల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఆరు అంచెల్లో (శత్రు క్షిపణుల సామర్థ్యాన్ని బట్టి) గాల్లోనే పేల్చేసేలా ఈ వ్యవస్థ ఉంటుంది. క్షిపణుల దిశను గుర్తించేందుకు అత్యాధునిక రాడార్‌ను వినియోగిస్తారు

మన దగ్గర రక్షణ డోమ్‌ ఉందా?
శత్రు క్షిపణులను, రాకెట్లను ధ్వంసం చేయడానికి ఇప్పటికే భారత్‌లో విభిన్నమైన రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. అయినప్పటికీ, 500 కోట్ల డాలర్లను వెచ్చించి రష్యా నుంచి అత్యాధునిక 'ఎస్‌-400' ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను కొనుగోలు చేయడానికి భారత్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 300-400 కిలోమీటర్ల దూరంలోని క్షిపణులను ధ్వంసం చేసే సామర్థ్యం 'ఎస్‌-400' సొంతం.

ఆసక్తికర అంశాలు

  • గాజాలోని హమాస్‌ ఉగ్రవాదులు చేసిన రాకెట్‌ దాడులను ఎదుర్కొనేందుకు గత మేలో ఇజ్రాయెల్‌ 'ఐరన్‌డోవ్‌ు' ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టవ్‌ును వినియోగించింది. 300 రాకెట్లను ఈ డోమ్‌ ధ్వంసం చేసింది.
  • శతఘ్నులు, రాకెట్లను నిర్వీర్యం చేసేలా.. ఇజ్రాయెల్‌ ఐరన్‌డోమ్‌ను పోలిన డోమ్‌ను నిర్మించనున్నట్టు దక్షిణ కొరియా ఇటీవల ప్రకటించింది. ఉత్తర కొరియా దాడుల నుంచి రక్షణ కోసమే దీన్ని నిర్మించనున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
  • రొమేనియా, ఈయూలోని పలు దేశాలు కూడా ఐరన్‌ డోమ్‌ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నాయి.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top