Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TFTDDA War | రఘు మాస్టర్ కమిటీ చెల్లదన్న సుమలత.. చిరంజీవినే మా దిక్కు!

TFTDDA War | రఘు మాస్టర్ కమిటీ చెల్లదన్న సుమలత.. చిరంజీవినే మా దిక్కు!

TFTDDA | తెలుగు ఫిల్మ్‌ అండ్‌ టీవీ డ్యాన్సర్స్‌ అండ్‌ డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ (TFTDDA)లో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి.

సంఘంలో నెలకొన్న వివాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ ప్రస్తుత అధ్యక్షురాలు సుమలత ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రఘు మాస్టర్ ఆధ్వర్యంలో కొందరు వ్యక్తులు కొత్త కార్యవర్గాన్ని ప్రకటించడం పూర్తిగా చట్టవిరుద్ధమని ఆమె తేల్చిచెప్పారు. ఎలాంటి లీగల్ నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని, యూనియన్‌ను విడదీయాలని చూస్తే లాగి కొడతామని హెచ్చరించారు.

గత కొంతకాలంగా అసోసియేషన్‌లో రూ. 36 లక్షల అవినీతి అక్రమాలు జరిగాయని, దీనికి సంబంధించిన తుది నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని సుమలత తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని నిలదీసి, ప్రశ్నించిన పాపానికే తమపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. యూనియన్‌లో ఓటు హక్కు లేకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని, తమకు ఫెడరేషన్ మరియు ఫిల్మ్ ఛాంబర్ పూర్తి మద్దతు ఉండాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై మెగాస్టార్ చిరంజీవి, సురేష్ బాబు, దిల్ రాజు తదితర సినీ పెద్దలు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. డ్యాన్సర్స్ అంటేనే తమకు ముందుగా చిరంజీవి గారే గుర్తుకొస్తారని, ఆయన చొరవతోనే తమ సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు. హద్దు మీరి యూనియన్ ఐక్యతను దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మరోసారి గట్టిగా హెచ్చరించారు.

ఈ ప్రెస్‌మీట్‌లో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి. బాలకృష్ణ మాట్లాడుతూ తాము చాలా కాలంగా సంయమనం పాటిస్తున్నామని, ఇకపై మౌనంగా ఉండేది లేదని స్పష్టం చేశారు. ఫెడరేషన్ పెద్దల నుంచి వస్తున్న నిబంధనల పేరుతో తమను వేధిస్తున్నారని వాపోయారు. తాము సంఘ విద్రోహ శక్తులు కాదని, రాజకీయాలు పక్కన పెట్టి అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలని కోరారు. తమకు ఆరాధ్య దైవాలైన చిరంజీవి, రామ్‌చరణ్‌లు గతంలో అందించిన ఆర్థిక సహాయాన్ని ఈ సందర్భంగా కన్నీటి పర్యంతం అవుతూ గుర్తుచేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారే తమకు దేవుడని, ఆయనే స్వయంగా జోక్యం చేసుకుని ఈ వివాదానికి ముగింపు పలకాలని వేడుకున్నారు.

ఇదే సమావేశంలో పాల్గొన్న అడ్వకేట్ బాల మాట్లాడుతూ న్యాయపరమైన అంశాలను కూలంకషంగా వివరించారు. అసోసియేషన్‌లో జనరల్ బాడీ తీసుకున్న నిర్ణయమే అత్యంత కీలకమని, బైలా ప్రకారం ఎవరికి వారు స్వయంగా కొత్త కార్యవర్గాలను ప్రకటించుకోవడం చెల్లదని స్పష్టం చేశారు. చట్టపరంగా సుమలత నేతృత్వంలోని కమిటీయే అధికారికంగా కొనసాగుతుందని ఆయన తేల్చిచెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana