- హెచ్‌సీఏ టోర్నీకి బీసీసీఐ అనుమతి లేదు
- టీసీఏ కార్యదర్శి గురువా రెడ్డి ఆరోపణ
- లీగ్ అంబాసిడర్ విజయ్, క్రికెటర్లు తిలక్, సిరాజ్‌కు లీగల్ నోటీసులు పంపినట్టు వెల్లడి
హైదరాబాద్, ఆట ప్రతినిధి: బీసీసీఐ నుంచి అనుమతి లేకుండానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) టీజీ20 లీగ్‌ను నిర్వహిస్తోందని, ఇదొక అక్రమ టోర్నమెంట్ అని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ప్రధాన కార్యదర్శి దారం గురువారెడ్డి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హెచ్‌సీఏ ఏజీఎం అమోదం లేకుండానే ఏర్పాటు చేసిన టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ నియామకం చెల్లదన్నారు. ఇలా అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో భాగం అవుతున్న ప్రతీ ఒక్కరూ చట్టపరమైన, క్రిమినల్ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
బోర్డు అనుమతి లేని లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సినీ నటుడు విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. మరో నటుడు వెంకటేశ్, హెచ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు, లీగ్‌లో భాగమైన భారత ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మకు కూడా టీసీఏ తరఫున లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపారు. ఈ లీగ్‌లో సీఎం కుటుంబం, ఓ మంత్రి కుమారుడు ఫ్రాంచైజీలను దక్కించుకొని ఆటను రాజకీయం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.

