తాజావార్తలు
టిక్‌టాక్‌పై శాశ్వత నిషేధం: కేంద్రం సంకేతాలు

న్యూఢిల్లీ: టిక్‌టాక్‌తో సహా కొన్ని ఇతర చైనా యాప్‌లపై శాశ్వత నిషేధం విధించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సంకేతాలిచ్చింది. ఈ మేరకు ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసిందని సమాచారం. నిషేధాజ్ఞలపై మరోసారి సమీక్షించాలని యాప్‌లు కోరగా కుదరదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు ఇచ్చిందని కీలక వర్గాలు తెలిపాయి. ఈ విషయమై తమకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం వాస్తవమేనని టిక్‌టాక్ ధ్రువీకరించింది.
'కేంద్రం జారీ చేసిన నోటీసులను కూలంకుషంగా పరిశీలిస్తున్నాం. సరైన రీతిలో స్పందిస్తాం. గతేడాది జూన్ 29వ తేదీన కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసిన తొలి కంపెనీ టిక్‌టాక్. స్థానిక చట్టాలు, నిబంధనలు పాటించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ అభ్యంతరాలను పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం. మా వినియోగదారుల గోప్యత, సమాచార భద్రతకు మేం తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం' అని టిక్‌టాక్ అధికారి ప్రతినిధి తెలిపారు.
కేంద్రం గతేడాది జూన్‌లో 59, సెప్టెంబర్‌లో 118 చైనా యాప్‌లపై నిషేధం విధించింది. ఇందులో టిక్‌టాక్, హెలో, పబ్‌జీ సైతం ఉన్న సంగతి తెలిసిందే. భారతీయుల సమాచార భద్రత, గోప్యత, దేశ సౌర్వభౌమత్వానికి భంగం కలుగుతోందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.