Dailyhunt
టీమిండియా టెయిలెండర్లపై వాషింగ్టన్‌ తండ్రి సీరియస్‌

టీమిండియా టెయిలెండర్లపై వాషింగ్టన్‌ తండ్రి సీరియస్‌

అహ్మదాబాద్‌: ఇండియన్ టీమ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ మధ్య జరిగిన రెండు టెస్ట్ సిరీస్‌లలో బ్యాట్‌తో ఎలా రాణించాడో మనం చూశాం. ఆస్ట్రేలియాలో 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచినా, ఇప్పుడు ఇంగ్లండ్‌పై 96 రన్స్ చేసినా అది అతని బ్యాటింగ్ ప్రతిభకు నిదర్శనమే. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ టెయిలెండర్లు అతనికి సహకారం అందించకపోవడంతో సెంచరీ చేసే అవకాశం మిస్ అయ్యాడు. దీనిపైనే ఇప్పుడు వాషింగ్టన్ తండ్రి ఎం. సుందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. టెయిలెండర్లు ఆ మాత్రం సేపు క్రీజులో నిలదొక్కకోలేరా? ఒకవేళ ఇండియా విజయానికి కేవలం 10 పరుగుల దూరంలో ఉన్నపుడు వాళ్లు ఇలా ఔటై ఉంటే అది ఎంత పెద్ద తప్పిదం అయి ఉండేది. కోట్ల మంది యువకులు వాళ్ల ఆటను చూస్తున్నారు.

వాళ్లు టెయిలెండర్ల నుంచి ఏమీ నేర్చుకోవద్దు అని సుందర్ అన్నారు.

టీమిండియా కేవలం 5 బంతుల వ్యవధిలో చివరి 3 వికెట్లు కోల్పోవడంతో వాషింగ్టన్ 96 పరుగులు చేసి సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోవాల్సి వచ్చింది. అక్షర్ రనౌటైన తర్వాత ఇషాంత్ ఎల్బీడబ్ల్యూగా, సిరాజ్ క్లీన్ బౌల్డ్ అవడం ద్వారా ఔటయ్యారు. ఇదేమీ టెక్నిక్‌కు సంబంధించిన అంశం కాదని, క్రీజులో నిలబడటానికి ధైర్యం చాలని ఈ సందర్భంగా సుందర్ అన్నారు. ఇంగ్లండ్ అప్పటికే అలసిపోయింది. స్టోక్స్ కేవలం 126 కి.మీ. వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. అదేమంత స్పీడు కానే కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. వాషింగ్టన్‌పై అందరూ బౌలర్ ముద్ర వేయడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని, అతనో బౌలింగ్ చేయగల బ్యాట్స్‌మన్‌గా ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana