Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TN Assembly | తమిళనాడులో రాష్ట్ర గీతానికి పెద్దపీట.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

TN Assembly | తమిళనాడులో రాష్ట్ర గీతానికి పెద్దపీట.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

TN Assembly : తమిళనాడు శాసనసభ (Tamil Nadu Assembly) వేదికగా రాజకీయాలకు అతీతంగా భాషాభిమానం, సాంస్కృతిక ఆత్మగౌరవం ఏకతాటిపై నిలిచాయి. తమిళ భాష (Tamil Language) గుర్తింపును చాటిచెప్పే దిశగా తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) విజయ్ (Vijay) కీలక తీర్మానాన్ని అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో, విద్యాసంస్థల్లో రాష్ట్ర గీతం 'తమిళ్‌ తాయ్‌ వాళ్తు (Tamil Thaai Vazhthu)' మొదట ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ప్రముఖ తమిళ పండితుడు, ప్రొఫెసర్ పీ సుందరం పిళ్లై 1891లో 'మనోన్మణియం' అనే నాటకాన్ని రాశారు. ఆ నాటకం ప్రారంభంలో తమిళ భాషను, తమిళ నేలను 'తమిళ తాయి (తమిళ తల్లి)' గా కీర్తిస్తూ 'నీరారుమ్ కడలుడుత్త' పేరుతో పద్యాలను రాశారు. రానురాను ఇవి తమిళ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. వివిధ సాంస్కృతిక, విద్యా కార్యక్రమాల ప్రారంభంలో ఈ పద్యాలను పాడటం ఒక అనవాయితీగా మారింది.

ఈ గీతం ప్రాముఖ్యతను గుర్తించిన నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కరుణానిధి 1970 మార్చి 11న కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ ఈ గీతంతోనే ప్రారంభించాలని అందులో పేర్కొన్నారు. అదే ఏడాది నవంబర్ 23న దీనిపై జీవో విడుదలైంది. నాటి నుంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో దీన్ని పాడుతున్నప్పటికీ అధికారికంగా 2021లో రాష్ట్ర గీతంగా దీనికి హోదా తీసుకువచ్చారు.

2021 డిసెంబర్ 17న తమిళనాడు ప్రభుత్వం ఈ పాటను అధికారిక రాష్ట్ర గీతంగా ప్రకటించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ సభల్లో ఈ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని మార్గదర్శకాలు జారీచేసింది. ఈ ఏడాది మే నెలలో తమిళనాడులోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గీతం, జాతీయగేయం తర్వాత తమిళ్‌తాయ్‌ వాళ్తును పాడడంతో వివాదం మొదలైంది. అలా ఆలపించాలని గవర్నర్‌ సూచించడాన్ని పలువురు ప్రముఖులు తప్పుబట్టారు.

ఇది జరిగిన కొన్ని వారాలకు విజయ్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా తమిళ రాష్ట్ర గీతాన్ని మూడో స్థానంలో పాడారు. ఈ నిర్ణయం గవర్నర్ కార్యాలయం తీసుకుందని టీవీకే పార్టీ నాడు విమర్శించింది. ఈ క్రమంలోనే అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రగీతాన్ని మొదట పాడడం తప్పనిసరి చేయాలని కోరుతూ ఇటీవల 20 మంది ఎంపీలు గవర్నర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్‌ ప్రభుత్వం తీర్మానం తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ సీఎం విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. 'తమిళం అనేది కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు. అది మన జీవనవిధానం, మన భావోద్వేగం. తమిళ సాంస్కృతిక మూలాలతో ముడిపడి ఉన్న అనుబంధం' అని వ్యాఖ్యానించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana