తాజావార్తలు
ట్రాక్టర్ ర్యాలీ: 550 ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్!

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే నాడు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో హింస నేపథ్యంలో 550కి పైగా ఖాతాలను సస్పెండ్ చేసినట్లు ట్విట్టర్ బుధవారం ప్రకటించింది. మంగళవారం దేశ రాజధానిలోని రెడ్‌ఫోర్ట్, ఐటీవో తదితర ప్రాంతాల్లో వందల మంది రైతులు.. పోలీసులతో ఘర్షణకు దిగారు. నిర్దేశించిన రూట్లలో కాకుండా ఇతర రూట్లలో ఢిల్లీలోకి అడుగుపెట్టిన నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేసి టియర్‌గ్యాస్ ప్రయోగించిన సంగతి తెలిసిందే.
వందల మంది నిరసనకారులు స్టిక్‌లతో పోలీసులతో తలపడ్డారు. పోలీసులు పార్కింగ్ చేసిన బస్సులపైకి ట్రాక్టర్లను తీసుకెళ్లారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఇప్పటివరకు25 మందికి పైగా రైతు నాయకులపై పోలీసులు 22 ఎఫ్ఐఆర్‌లు నమోదుచేశారు. రైతు నాయకులు యోగేంద్ర యాదవ్, రాకేశ్ తికాయిత్, దర్శన్‌పాల్, రాజిందర్ సింగ్, జోగిందర్ సింగ్ ఉగ్రహాన్, బల్బీర్‌సింగ్ రాజేవాల్, బూటా సింగ్‌లపై కేసులు నమోదయ్యాయి. అయితే, సంఘ విద్రోహ శక్తులు తమ ర్యాలీలో పాల్గొన్నాయని రైతు సంఘాల నేతలు ఇప్పటికే ప్రకటించాయి.