Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TTD | 'నమస్తే తెలంగాణ' కథనాలతో టీటీడీ తొందరపాటు చర్యలు.. హడావుడిగా కొలువుల భర్తీ!

TTD | 'నమస్తే తెలంగాణ' కథనాలతో టీటీడీ తొందరపాటు చర్యలు.. హడావుడిగా కొలువుల భర్తీ!

TTD | హైదరాబాద్‌ సిటీబ్యూరో, ఆగస్ట్‌ 29 (నమస్తే తెలంగాణ): టీటీడీ శ్రీవేంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థ(ఎస్‌వీఐహెచ్‌వీఎస్‌) ద్వారా చేపట్టిన వేదపారాయణ పథకం కింద 791 పోస్టుల నియామక ప్రక్రియలో ఆంధ్రప్రాంతానికి పెద్దపీట వేసి మిగతా రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం చేశారంటూ తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన వేదపండితులు చెప్తున్నారు.

దీంతో కొందరు అభ్యర్థులు వేదపారాయణదారుల నియామకాల్లో అవకతవకలపై హైకోర్టును ఆశ్రయించారు.

మరోవైపు 'నమస్తే తెలంగాణ'లో వరుస కథనాలు వస్తుండడంతో టీటీడీ దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా కోర్టు ఏదైనా స్టే లేదా ఆదేశాలు ఇవ్వకముందే నియామకప్రక్రియ ముగించేందుకు హడావుడి చేస్తున్నది. సెప్టెంబర్‌ 1 నుంచి 9 వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించి నియామకాలు చేపడుతామని ముందుగా షెడ్యూల్‌ ఇచ్చిన అధికారులు తాజాగా ఆ నిబంధనలను పక్కన పెట్టారు. వేదపారాయణదారు పోస్టులకు ఎంపికైనవారి ఫోన్లకు శుక్రవారం రాత్రి నుంచే మెసేజ్‌లు పంపి శని, ఆదివారాల్లో విధుల్లో చేరుతున్నట్టుగా జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వాలంటూ వాయిస్‌ రికార్డులు కూడా పెట్టారు.

ఒకవేళ ఎవరికైనా అందకపోతే అభ్యర్థులు మిగతావారికి కూడా చెప్పండంటూ టీటీడీ నుంచి నేరుగా ఒక మహిళా ఉద్యోగి ఫోన్‌ చేసిన కాల్‌ రికార్డు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నది.ఎటువంటి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, దేవాలయాల ఎన్‌వోసీలు అవసరం లేదంటూ వెంటనే తిరుపతికి వచ్చి జాయినింగ్‌ రిపోర్టు చేస్తే ఆర్డర్లు ఇస్తామంటూ పేర్కొంటున్నారు. శని, ఆదివారాలు సెలవు రోజులని కూడా చూడకుండా ఆఫీసు తెరిచి ఉంచి ఆదివారంలోపే అందరికీ ఆర్డర్లు ఇచ్చే ప్రక్రియను పూర్తిచేసే పనిలో ఉన్నట్టు సమాచారం. ప్రక్రియలో అవకతవకలు ఉండడం కారణంగానే తమపై వస్తున్న కథనాలు, కోర్టు ఉత్తర్వుల నుంచి తప్పించుకోవడానికే ఇలా చేస్తున్నారని తెలంగాణ వేదపండితులు ఆరోపిస్తున్నారు.

కొరవడిన పారదర్శకత.. చైర్మన్‌ జోక్యమే కారణం

టీటీడీ వేదపారాయణ స్కీమ్‌కు సంబంధించి గతంలో ఎప్పుడూ పారదర్శకత పాటిస్తూనే వస్తున్నారు. ఈ నియామకాల ప్రక్రియలో ఎప్పుడూ స్థానికత అంశం తెరపైకి రాలేదు. అర్హులైన వారికి అందునా 85 శాతంపైగా మార్కులు వచ్చినవారికి ఉద్యోగాలు కల్పిస్తూ ఆ నియామకాలకు సంబంధించిన వివరాలను టీటీడీ వెబ్‌సైట్‌లో పెట్టేవారు. కొత్త చైర్మన్‌ వచ్చిన తర్వాత తనవారికే ఉద్యోగాలు ఇప్పించుకోవడం మొదలుపెట్టినట్టు సమాచారం. వేదపారాయణదారుల పోస్టుల్లో కూడా ఆయనే స్వయంగా జోక్యం చేసుకుని ఆరుగురికి ఉద్యోగాలు ఇప్పించినట్టు తెలిసింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఒక ఎన్నికకు సంబంధించిన ఖర్చును కొంతమేరకు భరించేలా కొందరు టీటీడీ పరీక్షాధికారులు మధ్యవర్తిత్వం చేసి ఒప్పించడంతో వారికి అర్హతలు లేకున్నా, మార్కులు రాకున్నా ఉద్యోగాలు ఇచ్చినట్టు టీటీడీకి చెందిన ఒక అధికారి పేర్కొన్నారు. ఈ విషయంలో చైర్మన్‌తో పాటు ముఖ్య పరీక్షాధికారి, స్క్రీనింగ్‌ కమిటీలో ఉన్న ఒక సభ్యుడు కీలకపాత్ర పోషించినట్టుగా వేదపండితుల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. 2017లో వేదపారాయణ పథకానికి సంబంధించి టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోనే ఎంపికైన అభ్యర్థుల జాబితా పెట్టారు. ఇందులో అభ్యర్థి కాల్‌లెటర్‌ నంబర్‌, అప్లికేషన్‌ నంబర్‌తోపాటు వాళ్లు సాధించిన కచ్చితమైన మార్కులు స్పష్టంగా ప్రదర్శించి ఎంపిక చేశారు. ఈసారి మాత్రం ఎవరికి ఎటువంటి మార్కులు లేదా కటాఫ్‌ వివరాలు వెల్లడించకుండా తితిదే ఏకపక్షంగా, పారదర్శకత లేకుండా నియామకప్రక్రియ చేపట్టింది.

'నమస్తే' కథనాలపై చర్చ

తిరుమల తిరుపతి దేవస్థానం వేదపారాయణ పథకం నియామకాల అన్యాయంపై 'నమస్తే తెలంగాణ' వరుస కథనాలు రెండు తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తెలుగు పత్రికలో వేదపారాయణదారులకు జరిగిన అన్యాయంపై కథనం వచ్చిన విషయం తెలుసుకున్న మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ర్టాలకు చెందిన పలువురు పరీక్ష అభ్యర్థులు ఈ కథనాన్ని తమ భాషలోకి మార్చుకుని చూసి తెలంగాణకు చెందిన అభ్యర్థులతో మాట్లాడినట్టు తెలిసింది. వేదపారాయణదారు నియామకాల్లో జరిగిన అవకతవకలపై తెలంగాణవారితో పాటు తాము కూడా కలిసి వస్తామని, ఎప్పుడు చెప్తే అప్పుడు తిరుమలకు వచ్చి నిరసన వ్యక్తం చేయడానికి తాము సిద్ధమంటూ ఇతర రాష్ర్టాలకు చెందిన పలువురు వేదపండితులు తెలంగాణ పండితులకు మెసేజ్‌లు పెట్టారు. ఇప్పటికైనా తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల పండితులకు న్యాయం చేసి అర్హులైనవారికి అవకాశాలు కల్పించాలని, లేదంటే తమకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని పలురాష్ర్టాలకు చెందిన వేదపారాయణ స్కీమ్‌ పరీక్షల అభ్యర్థులు చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana