Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్వరలో జియో ఐపీవో!

త్వరలో జియో ఐపీవో!

  • నేడో, రేపో డ్రాఫ్ట్‌ పేపర్ల దాఖలు?
  • రూ.38వేల కోట్ల నిధుల సమీకరణకు అవకాశం

న్యూఢిల్లీ, జూన్‌ 17: భారతీయ స్టాక్‌ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూకు రంగం సిద్ధమవుతున్నది.

ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న దేశీయ టెలికాం రంగ దిగ్గజం రిలయన్స్‌ జియో ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) అతి త్వరలోనే రాబోతున్నట్టు సమాచారం. ఏకంగా రూ.38,000 కోట్ల (4 బిలియన్‌ డాలర్లు) నిధుల సమీకరణతో ఈ మెగా ఐపీవో రాబోతుండగా.. నేడో, రేపో దీనికి సంబంధించిన డ్రాఫ్ట్‌ పేపర్లను క్యాపిటల్‌ మార్కెట్స్‌ రెగ్యులేటర్‌ సెబీ వద్ద రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ కంపెనీ వర్గాలు దాఖలు చేస్తాయని తెలుస్తున్నది.

కాగా, జియో మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) వాటాదారుల 49వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) శుక్రవారం జరుగనున్నది. దీనికి ముందే జియో షేర్ల పబ్లిక్‌ ఇష్యూకు సంబంధించిన ప్రక్రియను సెబీ దగ్గరకు అధికారికంగా తీసుకెళ్లాలని ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ భావిస్తున్నట్టు చెప్తున్నారు. అందుకు అనుగుణంగా అడుగులు పడితే ఈ మెగా ఐపీవో ఇక ఎంతో దూరంలో లేదని చెప్పవచ్చు. ఇప్పటికైతే భారతీయ స్టాక్‌ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద ఐపీవోగా హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా 3.3 బిలియన్‌ డాలర్ల పబ్లిక్‌ ఇష్యూనే ఉన్నది. జియో రాకతో ఈ రికార్డు చెరిగిపోనున్నది. కాగా, జియో సంస్థ విలువ 130-180 బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని అంచనా.

మదుపర్లలో ఆసక్తి

రిలయన్స్‌ జియో షేర్లను సొంతం చేసుకొనేందుకు అటు విదేశీ, ఇటు దేశీయ మదుపర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలో మూడో, దేశంలో అతిపెద్ద మొబైల్‌ నెట్‌వర్క్‌ సంస్థగా ఉన్న జియోలో పెట్టుబడులు లాభిస్తాయన్న భావన అంతటా వ్యక్తమవుతున్నది మరి. దేశ జనాభాకు తగ్గట్టుగా టెలికాం వ్యాపారం కూడా విస్తరిస్తుండటం.. జియోకు కలిసొచ్చే అంశమని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే జియో ఐపీవోకు భారీ ఆదరణ రావచ్చన్న అంచనాలూ గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. ఇక అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం సంకేతాలతో మార్కెట్లు కూడా తిరిగి లాభాల బాట పట్టాయి. ఈ ట్రెండ్‌ ఇలాగే ఉంటే జియోతోపాటు మరికొన్ని సంస్థలు కూడా ఐపీవోలతో సందడి చేయవచ్చన్న విశ్లేషణలున్నాయి.

రిలయన్స్‌కు సవాళ్లు

ఈ ఏడాది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు స్టాక్‌ మార్కెట్లలో సవాళ్లు ఎదురవుతున్నాయి. గల్ఫ్‌ ఉద్రిక్తతల నడుమ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా కంపెనీ షేర్ల విలువ 15.39 శాతం పడిపోయింది మరి. అయితే పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడే దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో షేర్లు మళ్లీ లాభాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో జియో రాక.. రిలయన్స్‌కు అదనపు జోష్‌ను ఇవ్వగలదన్న అంచనాలూ ఉన్నాయి.

కాగా, 2020లో 13 అంతర్జాతీయ సంస్థాగత మదుపర్ల నుంచి రూ.1.5 లక్షల కోట్ల నిధులను జియో సమీకరించింది. ఇందులో గూగుల్‌, మెటా, సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌, విస్టా ఈక్విటీ, కేకేఆర్‌, సిల్వర్‌ లేక్‌, జనరల్‌ అట్లాంటిక్‌, అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ, టీపీజీ, ఎల్‌ క్యాటర్టన్‌, ఇంటెల్‌ క్యాపిటల్‌, క్వాల్‌కామ్‌ వెంచర్స్‌ వంటివి ఉన్నాయి. దేశీయ భారీ సంస్థాగత నిధుల సమీకరణల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. అంతేగాక రుణ రహిత సంస్థగా జియో ప్లాట్‌ఫామ్‌ను నిలబెట్టింది. 4జీ, 5జీ మొబైల్‌ సర్వీసులతోపాటు బ్రాడ్‌బాండ్‌, ఇతరత్రా డిజిటల్‌ సేవలను జియో అందిస్తున్న సంగతి విదితమే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana