Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉద్యమం నుంచి..ఉజ్వలం వరకు..

ఉద్యమం నుంచి..ఉజ్వలం వరకు..

రు దశాబ్దాలపాటు అస్తిత్వం కోసం పెనుగులాడిన తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పాటయ్యాక బీఆర్‌ఎస్‌ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో అసాధారణమైన అభివృద్ధికి చిరునామాగా మారింది.

ఒక్కమాటలో చెప్పాలంటే 'ఉద్యమ తెలంగాణ..ఉజ్వల తెలంగాణ'గా రూపుదాల్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమం, పరిపాలనలో కొత్త రాష్ట్రం అసమానమైన అభివృద్ధి సాధించింది.

ఒకవైపు స్వరాష్ట్రంలో తమ తలరాతలు మారతాయని కొండంత ఆశతో ఉన్న ప్రజలు, మరోవైపు అగమ్యగోచరంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు. అయినా చెక్కుచెదరని విశ్వాసంతో 'సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం' అనే నినాదంతో ఆనాడు ముందడుగు వేశారు కేసీఆర్‌. ఒక్కో జఠిల సమస్యను పరిష్కరిస్తూ ఒక్కోరంగాన్ని అభివృద్ధి చేస్తూ స్వల్పకాలంలోనే తెలంగాణను అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా మలిచారు. తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి 2014లో రూ.4 లక్షల 51 వేల కోట్లు ఉండగా, 2024 నాటికి రూ.13 లక్షల 13 వేల కోట్లకు పెరిగింది. ఇది పరిశ్రమలు, వ్యవసాయం, ఐటీ రంగాల్లో బీఆర్‌ఎస్‌ హయాంలో సాధించిన ఎనలేని ప్రగతికి నిదర్శనం. 2014లో రూ.1,12,162 తలసరి ఆదాయం ఉంటే, కేసీఆర్‌ సమర్థవంతమైన పాలన ఫలితంగా 2024 నాటికి రూ.3 లక్షల 12,398 వరకు చేరుకున్నది. తద్వారా దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. తరతరాలుగా కరెంటు కోతలతో అల్లాడిన తెలంగాణ ప్రాంతంలో బీఆర్‌ఎస్‌ పాలనలో ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరాయ నాణ్యమైన కరెంటు సరఫరాను మొట్టమొదటిసారి పొందగలిగింది. వ్యవసాయానికి ఉచితంగా, ఇతర రంగాలకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయటంతో వ్యవసాయానికి మళ్లీ ఊతం వచ్చింది. పరిశ్రమలకు ప్రగతికాలం కానవచ్చింది. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని నల్లాల ద్వారా అందజేయటం బీఆర్‌ఎస్‌ సాధించిన ఘనచరిత్ర.

రైతు సంక్షేమంలో బీఆర్‌ఎస్‌ చూపినబాట యావద్దేశానికి ఆదర్శమై ప్రపంచదేశాల ప్రశంసలు పొందింది. ప్రతి రైతుకూ సంవత్సరానికి ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి సహాయం చెల్లించే రైతుబంధు ద్వారా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు జమచేసి ఎనలేని మేలు చేసింది. రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. తెలంగాణ రైతుల సాగునీటి కలలను నెరవేర్చే చారిత్రక బాధ్యతను నెరవేర్చటంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్షా 76 వేల కోట్ల ఖర్చుతో చేసిన కృషి నిరుపమానం. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిర్మించిన సాగునీటిరంగ అద్భుతం కాళేశ్వరం ప్రపంచస్థాయి ఎత్తిపోతల పథకం. ఈ ప్రాజెక్టు తెలంగాణకు వరదాయినిగా మారింది. అనతికాలంలో తెలంగాణ సుజల సుఫల సస్యశ్యామల రాష్ట్రంగా అవతరించింది. 2014లో కోటి 31 లక్షల ఎకరాల సాగుభూమి ఉండేది, కేసీఆర్‌ పాలనలో సాగు విస్తీర్ణం 2024 నాటికి రెట్టింపై 2 కోట్ల 68 లక్షల ఎకరాలకు పెరిగింది. 2014లో కేవలం 68 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి పంట మాత్రమే పండేది. బీఆర్‌ఎస్‌ ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటుతోపాటు సాగునీటిరంగంలో కేసీఆర్‌ కృషి ఫలితంగా, 3 కోట్ల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం పండించి దేశానికి అందించే ప్రధాన రాష్ట్రంగా తెలంగాణ మారింది.

పరిశ్రమలకు సుగమంగా సరళంగా అనుమతులిచ్చే టీఎస్‌-ఐపాస్‌ విప్లవాత్మక విధానం ద్వారా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించటంతోపాటు 20 లక్షలకు పైగా ఉద్యోగాలు లభించాయి. 2014లో రూ.57,000 కోట్ల ఐటీ ఎగుమతులు ఉండగా, 2024 నాటికి రూ.2 లక్షల 41 వేల కోట్లకు పెరిగాయి.

హైదరాబాద్‌ నగరం నలుమూలలా నాలుగు టిమ్స్‌ ఆసుపత్రుల నిర్మాణంతోపాటు, వరంగల్‌లో హెల్త్‌ సిటీ నిర్మాణాన్ని దాదాపు మూడొంతులు పూర్తిచేసి, వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. ఎస్టీల రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచటంతో పాటు దళితబంధు వంటి విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టింది బీఆర్‌ఎస్‌ సర్కార్‌. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించే దళితబంధు, బీసీబంధు వేలాది కుటుంబాలను ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే దిశగా నడిపించింది. చేతివృత్తులను పరిరక్షించటం కోసం చేపట్టిన కార్యక్రమాలతో నేత కార్మికులకు మెరుగైన జీవనోపాధి కల్పించింది. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? పాలనను నడపటం చేతగాక కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతులెత్తేస్తున్నది. నిరుద్యోగులకు నమ్మకద్రోహం జరుగుతున్నది. రైతుల రుణమాఫీలు కాగితాలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. వీటన్నింటి కంటే దారుణమైన కుట్ర మరొకటి సాగుతున్నది. తెలంగాణ వ్యతిరేక శక్తులు, ఆనాడు సమైక్య రాష్ట్రం కోసం పాకులాడిన శక్తులు ఇవాళ ఒక్కటయ్యాయి! ఢిల్లీ గులాంలు ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. అందుకే ఇవాళ మనం ప్రశ్నించకపోతే..మళ్లీ నాటి చీకటి రోజుల్లోకి వెళ్లటం ఖాయం! తెలంగాణ ప్రజలారా..తస్మాత్‌ జాగ్రత్త!
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యుడు)

-పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana