న్యూఢిల్లీ: అమెరికాలో అమెజాన్ ఉద్యోగి ఆగ్రహం కారణంగా ఆ సంస్థకు దాదాపు రూ.45 లక్షల రూపాయల (60 వేల డాలర్లు) నష్టం వాటిల్లింది. ఆగ్రహానికి లోనైన స్టీవెన్ కోహెన్ అనే ఉద్యోగి కారుతో అమెజాన్ కేంద్రంలోకి దూసుకెళ్లాడు. దీంతో భవనం ముందువైపు ఉన్న తలుపులు ధ్వంసమయ్యాయి. అక్కడితో ఆగని సదరు ఉద్యోగి కారును భనవం వెనుక వైపునకు తీసుకెళ్లి అక్కడ ఇదే తరహాలో అరాచకం సృష్టించాడు.
దీంతో సంస్థకు కనీసం 60 వేల అమెరికన్ డాలర్ల నష్టం జరిగి ఉంటుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు. కొలరాడో రాష్ట్రంలోని థార్న్‌టర్న్ మున్సిపాలిటీలోని అమెజాన్ కేంద్రంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే ఘటనకు ముందు అతడు పైఅధికారులతోగానీ, తోటి ఉద్యోగులతోగానీ ఎలాంటి వాగ్వాదానికి దిగలేదని తెలిసింది.

