Friday, 23 Apr, 2.40 am నమస్తే తెలంగాణ

తాజావార్తలు
ఉపాధి హామీ పనుల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలి

నిజామాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 22: ఉపాధి కూలీలు పని ప్రదేశంలో కొవిడ్‌ నిబంధనలు విధిగా పాటించేలా చూడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందిపైనే ఉందని డీఆర్డీవో బాదావత్‌ చందర్‌నాయక్‌ అన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందితో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ఉపాధి పనులు జరుగుతున్న తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ ఉపాధి పని కల్పించాలని ఆదేశించారు. రూరల్‌ మండలంలో 19 గ్రామాలు ఉండగా అందులో కేవలం తొమ్మిది గ్రామాల్లోనే ఉపాధి పనులు జరుగుతున్నాయని, మిగతా గ్రామాల్లో కూడా పనులు వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ఆదేశించారు. కూలీలు చేస్తున్న పనికి గిట్టుబాటు అయ్యేలా ప్రభుత్వం కూలి రేటు ప్రస్తుతం పెంచి ఇస్తున్నదని , ఈ నేపథ్యంలో ఆ విషయం కూలీలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి ఎక్కువ సంఖ్యలో పనిలోకి వచ్చేలా చూడాలన్నారు. మాస్కు ధరించిన కూలీలకే పని చేసేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో మల్లేశ్‌, ఎంపీవో మధురిమ, ఏపీవో పద్మ, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధి పనుల పరిశీలన ..
ఇందల్వాయి, ఏప్రిల్‌ 22: మండలంలోని కేకే తండా, వెంగల్‌పాడ్‌ తండా, తిర్మన్‌పల్లి గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులను డీఆర్డీవో చందర్‌నాయక్‌ గురువారం తనిఖీ చేశారు. చేపడుతున్న పనులు, వారి రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాల్లో ఉపాధి పనులు, కూలీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వం పెంచిన కూలిపై అవగాహన కల్పించాలన్నారు. కూలీలకు శానిటైజర్లు, మాస్కులను అందజేయాలన్నారు. గ్రామాల్లో మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీవో రాములు నాయక్‌, ఏపీవో మంజుల, టీఏలు రాము, మోతీరాం, ఈసీ అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top