Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
US vs Iran | ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు.. ఆత్మరక్షణ కోసమేనంటూ సమర్థన..!

US vs Iran | ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు.. ఆత్మరక్షణ కోసమేనంటూ సమర్థన..!

US vs Iran : ఇరాన్‌ (Iran) పై అగ్రరాజ్యం అమెరికా మరోసారి దాడులకు దిగింది. హర్మూజ్‌ జలసంధి (Strait of Hormuz) సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని యూఎస్‌ దళాలు (US forces) లక్ష్యంగా చేసుకున్నాయి.

జలసంధి సమీపంలో ఉన్న అమెరికా (USA) బలగాలకు, నౌకల రవాణాకు ముప్పు పొంచి ఉన్నందునే ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వ్యూహాత్మకంగా సున్నితమైన హర్మూజ్‌ జలసంధి ప్రాంతంలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగానే ఈ ఆపరేషన్‌ చేసినట్లు యూఎస్‌ అధికారి పేర్కొన్నారు.

హర్మూజ్‌లోని అమెరికా వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ నాలుగు డ్రోన్‌లను ప్రయోగించిందని యూఎస్‌ అధికారి చెప్పారు. ఆ డ్రోన్‌లను అమెరికా దళాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని, టెహ్రాన్‌ మరిన్ని దాడులకు పాల్పడకముందే తమ దళాలు దాని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొన్నారు. ఇవి ముందుచూపుతో పూర్తిగా ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యలని సమర్థించుకున్నారు. ఈ దాడి కారణంగా ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా లేదా అనే విషయం ఇంకా తెలియరాలేదని చెప్పారు.

అయితే హర్మూజ్ సమీపంలో యూఎస్‌ పదేపదే సైనిక చర్యలకు దిగడంపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఇరుదేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆ దేశం ఉల్లంఘించిందని ఆరోపించింది. ఇదిలావుంటే ఈ దాడులకు ముందు ఇరాన్‌లోని బందర్‌ అబ్బాస్‌ ఓడరేవు పట్టణ సమీపంలో పేలుళ్లు వినిపించాయి. మూడుసార్లు పేలుడు శబ్దాలు వినిపించడంతో ఇరాన్‌ వైమానిక దళాలు అప్రమత్తమయ్యాయి. అయితే ఈ పేలుళ్లు ఎలా జరిగాయనే దానిపై స్పష్టత లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana