- కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో చెరువులు నింపండి
- లేదంటే రైతులతో కలిసి ఉద్యమిస్తం
- బద్దిపల్లిలో సాగునీటి కాలువ పరిశీలన
కొత్తపల్లి, జూన్ 17 : వర్షాలు లేక రైతులు సాగునీటి కోసం తండ్లాడుతున్నారని, వారం రోజుల్లో వరదకాలువ నుంచి నీటిని విడుదల చేయాలని, చెరువులు నింపాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
ఆలోగా సాగునీరు విడుదల చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తానని, వరదకాలువ తూముల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు నాటు వేసిన నుంచి వడ్లు అమ్ముకొనే వరకూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందుకే బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాకకోసం రైతులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. రైతులు అధైర్యపడద్దని, మీ పక్షాన ఎలాంటి ఆందోళనలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు సాగునీరు అందేలా చూస్తామని చెప్పారు. బుధవారం సాయంత్రం కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామంలో సాగునీటి కాలువను ఆయన పరిశీలించారు. అనంతరం రైతువేదిక వద్ద రైతులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడారు. కొత్తపల్లి మండలంలోని ఏడు గ్రామాలతోపాటు కరీంనగర్ రూరల్ మండలంలోని గ్రామాలకు సాగునీరందక నార్లు పోసే పరిస్థితి లేదని వాపోయారు. రోహిణీ కార్తె ముగిసి పది రోజులైనా వాన లేక రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించలేదని, మరోవారం ఇలానే ఉంటే పంటలు వేసే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో వానలు లేకున్నా కాళేశ్వరం నీటిని మేడిగడ్డ నుంచి వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు తరలించామని, కొత్తపల్లి మండలంతోపాటు కరీంనగర్ రూరల్ మండలంలోని గ్రామాలకు సాగునీరు అందించామని గుర్తు చేశారు.
ప్రస్తుతం మేడిగడ్డ ద్వారా వరద కాలువకు నీరు రాకపోవడంతో రైతులు సాగునీటి కోసం తండ్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పిల్లర్లకు వెంటనే మరమ్మతులు చేయించి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలిచి మోటర్లకు కరెంట్ మీటర్లను పెట్టనివ్వలేదని గుర్తు చేశారు. ఇప్పుడు మోడీ విధానాలకు తలొగ్గిన సీఎం రేవంత్‌రెడ్డి మోటర్లకు మీటర్లు పెట్టే పథకానికి అంగీకరించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో భూమిశిస్తు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నదని, తెలంగాణాలో మళ్లీ పాతరోజులు తీసుకొస్తున్నదని ధ్వజమెత్తారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కరీంనగర్ నియోజకవర్గానికి ఒక్కపైసా తీసుకు రాలేదని మండిపడ్డారు. స్వయంగా కేంద్రమంత్రి వాహనం బావుపేట వద్ద దిగబడితే దానికి సైతం మరమ్మతులు చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాండ్ర శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేని మధు, వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, నాయకులు చల్ల హరిశంకర్, పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

