Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వడదెబ్బతో తొమ్మిది మంది మృతి

వడదెబ్బతో తొమ్మిది మంది మృతి

జూలూరుపాడు/ గుండాల/ పినపాక/ ఇల్లెందు/ మామిళ్లగూడెం/ బోనకల్లు, మే 22 : వడదెబ్బతో వేర్వేరు ప్రాంతాల్లో తొమ్మిది మృతిచెందిన ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది.

జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన మంద గోపయ్య(75) రెండు రోజులు తీవ్రమైన ఎండలతో వడదెబ్బకు గురయ్యాడు. వాంతులు, విరోచనలు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. అలాగే గుండాల మండలం లింగగూడెం గ్రామానికి చెందిన మాజీ పాత్రికేయుడు జనగామ రాంబాబు(45) వ్యవసాయ పనులు లేని సమయంలో ఖమ్మంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

గురువారం ఆటో నడిపిన రాంబాబు రాత్రి వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ ఆరోగ్యం విషమించడంతో ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. పినపాక మండలం బోటిగూడెం గ్రామానికి చెందిన సోలం మల్లమ్మ(50) రోజువారీగా తునికాకు సేకరణకు వెళ్లింది. ఎండ తీవ్రతతో శుక్రవారం వడదెబ్బకు గురై ఆమె మృతిచెందింది. ఇల్లెందు మండలం బాలాజీనగర్‌కు చెందిన టైలర్‌ ముక్తవరపు వెంకటేశ్వర్లు(46) గురువారం ఎండలోనే ఊరికి వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో వడదెబ్బ తగలడంతో శుక్రవారం ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షల కోసం వెళ్లాడు. అతడిని పరీక్షించిన వైద్యులు తోడుగా ఒకరిని తీసుకురావాలని పంపించారు. వెంటనే బయటకు వచ్చిన వెంకటేశ్వర్లు ఆసుపత్రి పక్కనే ఉన్న హోటల్‌ వద్దకు వెళ్లే క్రమంలో కిందపడిపోయాడు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు.

ఖమ్మం వన్‌ టౌన్‌, త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చేకూరి నాగయ్య(55), మరో యాచకుడు(60), పరికముక్కల కాలనీకి చెందిన యార్లగడ్డ గోవర్దన్‌రావు(70), ముస్తఫానగర్‌ ప్రాంతానికి చెందిన ఎలక్ట్రీషియన్‌ ఎస్‌కే సలీం(42) వడదెబ్బతో మృతిచెందినట్లు పోలీసులు, మృతుల బంధువులు తెలిపారు. బోనకల్లు మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన పాపినేని వరలక్ష్మి(82) ఎండ తీవ్రతతో మూడు రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురైంది. వాంతులు, విరోచనాలు కావడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం చేయించినా ఆరోగ్యం కుదుట పడలేదు. ఆరోగ్యం క్షీణించి గురువారం రాత్రి ఆమె మృతిచెందింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana