Thursday, 29 Jul, 7.27 am నమస్తే తెలంగాణ

హైదరాబాద్‌
వంతెన వచ్చింది యాతన తీర్చింది

బాలానగర్‌ చౌరస్తా పేరు చెబితే చాలు.. ఒకప్పుడు ప్రయాణికుల గుండెల్లో వాహనాలు పరుగెత్తేవి. 50 సెకన్ల పాటు సిగ్నల్‌ పడితే.. బోయిన్‌పల్లి నుంచి మూసాపేట్‌ వై జంక్షన్‌ వెళ్లే దారిలో కిలోమీటర్‌ వరకు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యేది. దీనికి తోడు వాహనాల కాలుష్యంతో ప్రయాణికులు 'దేవుడా.. ఇదేం నరక యాతన రా'..అని అనుకునే వారు. ఇక ఎండాకాలంలో నడినెత్తిన సుర్రుమనే సూర్యుడితో చౌరస్తా వద్ద చుక్కలు కనిపించేవి. కానీ ఇప్పుడు ఆ కష్టాలన్నీ ఒక వంతెనతో తొలగిపోయాయి. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద నిరీక్షణకు చెక్‌ పడింది.. వాహనాలు రయ్‌..రయ్‌ మంటూ..చౌరస్తాను దాటేస్తున్నాయి. ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చాక బాలానగర్‌ రహదారిలో ఎంత మార్పు వచ్చిందో అప్పటి.. ఇప్పటి చిత్రాల్లో స్పష్టంగా గమనించవచ్చు.

ఒకప్పుడు బాలానగర్‌ మీది నుంచి పోవాలంటే భయపడాల్సి వచ్చేది. 50 సెకన్ల సిగ్నల్‌ పడితే బోయిన్‌పల్లి నుంచి మూసాపేట్‌ వై జంక్షన్‌ వరకు సుమారు కిలోమీటర్‌ వరకు ట్రాఫిక్‌ జాం అయ్యేది. ఆ సమయంలో నర్సాపూర్‌ క్రాస్‌ రోడ్డు దాటాలంటే ఫిరోజ్‌గూడ వద్ద ఉండే వాహనదారుడికి కనీసం 30 నుంచి 40 నిమిషాల సమయం పట్టేది. అందులో ఆ రోడ్డు ఇరుకుగా ఉండటంతో వాహనదారుల పరిస్థితి దయనీయంగా ఉండేది. కనీసం 30 నుంచి 45 నిమిషాల ముందు బయలుదేరితే గాని అనుకున్న సమయానికి గమ్యస్థానం చేరకపోయేది. ప్రస్తుతం ఆ కష్టాలన్నీ తీరాయి. బోయిన్‌పల్లి నుంచి మూసాపేట్‌ వై జంక్షన్‌.. మూసాపేట వై జంక్షన్‌ నుంచి బోయిన్‌పల్లి వైపు వెళ్లే వాహనాలు సాఫీగా సాగిపోతున్నాయి. ఫతేనగర్‌, జీడిమెట్ల వైపు వెళ్లే వారి ఇబ్బందులు తొలిగిపోయాయి. సిగ్నళ్ల వద్ద నిమిషాల కొద్దీ నిలబడే దుస్థితి పోయింది. అంతేకాక వాయు, శబ్ధ కాలుష్యమూ తగ్గింది. ఒక్క వంతెన ఈ సమస్యలన్నింటినీ తీర్చిందంటే అతిశయోక్తి కాదు.

ఫ్లై ఓవర్‌ ప్రారంభంతో వాహనదారులకు రవాణా సౌకర్యం మెరుగైంది. రాకపోకలకు అవాంతరాలు తొలిగిపోయాయి. ఇప్పుడు ఎక్కడా ఆగకుండా ముందుకు వెళ్లవచ్చు. బ్రిడ్జిపై వాహనదారులు మితిమీరి వేగంతో ప్రయాణించవద్దు. బ్రిడ్జి కింద రాకపోకలకు ఇబ్బందులు లేకుండా యూటర్న్‌ ఏర్పాటు చేశాం. పరిస్థితులను అంచనా వేసి భవిష్యత్‌లో మెరుగైన చర్యలు తీసుకుంటాం. ఒకప్పుడు అత్యంత కాలుష్యంగా ఉండే ఈ జంక్షన్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. - బి. నరహరి, ట్రాఫిక్‌ ఇన్స్‌పెక్టర్‌, బాలానగర్‌

నాలుగు సంవత్సరాలుగా ఈ జంక్షన్‌లో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నా. డ్యూటీకి తెల్ల అంగితో వచ్చేవాడిని. కానీ అది గంటలో నల్లరంగులోకి మారేది. ఈ రోడ్డుపై భారీగా వాహనాల రాకపోకలు సాగేవి. ఒకవైపు సిగ్నల్‌ వేస్తే మూడు వైపులా కనీసం 500 నుంచి వెయ్యి వాహనాలు నిలిచిపోయేవి. ప్రస్తుతం బ్రిడ్జి రావడంతో ట్రాఫిక్‌ సమస్య తీరింది. వాహనాలు సాఫీగా సాగుతున్నాయి. -శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌, బాలానగర్‌

నర్సాపూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద నాలుగు వైపులా రద్దీ ఉండేది. ఇక్కడ బోయిన్‌పల్లి నుంచి మూసాపేట వై జంక్షన్‌, మూసాపేట నుంచి బోయిన్‌పల్లి మార్గం, జీడిమెట్ల నుంచి సనత్‌నగర్‌ రైల్వే స్టేషన్‌, సనత్‌నగర్‌ నుంచి జీడిమెట్ల మార్గం మొత్తం ఇలా నాలుగు వైపులా భారీగా వాహనాలు వెళ్లేవి. బోయిన్‌పల్లి నుంచి మూసాపేట వై జంక్షన్‌ మార్గంలో ట్రాఫిక్‌ అధికంగా ఉండేది. ఈ మార్గం మధ్యలో ఎడమ వైపు ఫతేనగర్‌ టర్న్‌ ఉండేది. అదేవిధంగా ఫతేనగర్‌ నుంచి నర్సాపూర్‌ క్రాస్‌ రోడ్డుకు వెళ్లే వాహనాలూ ఇదే మార్గంలో ప్రయాణం చేసేవి. దీంతో అక్కడ కూడా సిగ్నల్‌ ఉండేది. ఇలా నర్సాపూర్‌ క్రాస్‌ రోడ్డు దాటాలంటే రెండు సిగ్నల్స్‌ పడేవి. ఒకదశలో సిగ్నల్‌ ఎత్తేసి యూటర్న్‌ ప్రవేశపెట్టినా అంతంతమాత్రమే. నర్సాపూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద 30 నుంచి 50 సెకన్ల సిగ్నల్‌ పడినప్పుడు మూడు వైపులా కనీసం 15 నుంచి 40 నిమిషాల వరకు ఆగిపోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి పోయి నర్సాపూర్‌.. నో క్రాస్‌ రోడ్డుగా మారింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top