Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరుణుడిపైనే ఆశలు

వరుణుడిపైనే ఆశలు

  • జూన్‌ నెల ముగిసినా అంతంతగానే వర్షాలు
  • అడుగంటుతున్న భూగర్భ జలాలు
  • ఆందోళనలో అన్నదాతలు
  • వరుణుడిపై భారం వేసి ప్రారంభించిన సాగు పనులు

భీమ్‌గల్‌, జూలై 5: వానాకాలం ప్రారంభమై నెలరోజులు గడిచినా భారీ వర్షం కరువైంది.

యాసంగి ముగిసి వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. అడపాదడపా ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం, చిన్నపాటి తుంపర్లు వచ్చి పోవ డం మినహా ఇప్పటివరకూ ఒక్క భారీ వర్షం కురవలేదు. దీంతో వానకాలం ఆరంభంలోనే రైతన్నల్లో గుబులు మొదలైంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సాధారణం కన్నా తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతన్నకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. వాస్తవానికి జూన్‌ చివరి వా రంలో సగటు వర్షపాతం కూడా నమోదుకాలేదు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాం తాల్లో రైతులు పంటల సాగుకు సిద్ధమయ్యారు. భీమ్‌గల్‌ వ్యవసాయ డివిజన్‌లో 99 శాతం మంది రైతులు వరిని సాగుచేస్తుండగా, ఇప్పటికే పనులుప్రారంభించారు.

ఏపుగా పెరగని జీలుగ

యాసంగి సీజన్‌ ముగియగానే తమ వ్యవసాయ భూముల్లో జీలుగ విత్తనాలు వేయడం సాంప్రదాయకంగా వస్తోంది. వాస్తవానికి వరి కోతలు ముగియగానే రైతులు తమ నేలలను దుక్కి దున్ని అందులో జీలుగ విత్తనాలు చల్లుతారు. ఈ జీలుగ విత్తనాలు రెండు మూడు వర్షాలు ఏకధాటిగా కురియగానే నిలువెత్తు ఏపుగా పెరుగుతాయి. వీటిని రైతన్న ట్రాక్టర్‌తో పొలంలోనే పచ్చిరొట్టగా దమ్ము చేస్తాడు. దీంతో తన భూమికి బలం చేకూరుతుంది. ఇది పొలానికి సహజ సిద్ధమైన ఎరువులా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు వర్షాల జాడ లేకపోవడంతో జీలుగ విత్తనాలు చల్లి వర్షం కోసం ఎదురు చూసిన రైతన్నకు నిరాశే మిగిలింది. వానలు లేక జీలుగ పంట ఏపుగా పెరగలేదు. కాలం తరుముతుండడంతో రైతులు చేసేదేమీ లేక అంతంత మాత్రంగా పెరిగిన జీలుగ పంటనే దుక్కిలో దమ్ము చేసి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.

వర్షాల కోసం ఎదురుచూపులు!

వర్షాలు సమృద్ధిగా కురవకపోతాయన్న ఆశతో రైతులు సాగు పనులు ప్రారంభించారు. వరి నారు పోయడం దాదాపుగా పూర్తికాగా, అది ఏపుగా కూడా పెరగడంతో నాట్లు వేసే పనులు ప్రారంభించారు. ఇక్కడి ప్రాంత రైతులు మొత్తం బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. జోరుగా వర్షాలు కురిసి వాగులు జలకళ సంతరించుకొని, భూగర్భ జలాలు పెరిగితేనే బోరు బావుల ద్వారా పంటలకు నీరు అందించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే యాసంగిలో రైతులు తమ పంటలను గట్టెక్కించడానికి బోరుబావులను వినియోగించుకోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. ఇప్పుడు వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరిగితేనే పంటలు గట్టెక్కనున్నాయి. ఎల్‌నినో తమను ఏం చేస్తుందోనని ఆందోళన మధ్య సాగు పనులు ప్రారంభించారు.

'యాప్‌’తో కష్టాలు..అరకొరగా ఎరువులు..

రైతులు వరి పంటలో ఎకరాకు మూడు బస్తాల యూరియా వేస్తారు. కానీ ప్రభుత్వం ఈసారి దానికి కోత విధించింది. ప్రతి రైతుకు కచ్చితంగా ఒక ఎకరాకు రెండు బస్తాల యూరియా మాత్రమే పంపిణీ చేస్తున్నది. అది కూడా రెండు విడుతలుగా అందజేస్తున్నది. దీంతో రైతు మొదటి విడుతలో ఎకరాకు ఒక బస్తా యూరియాతోనే సరిపెట్టుకోవాల్సి వస్తున్నది. అది కూడా యాప్‌ ద్వారా సరఫరా చేయడంతో రైతులు నెల రోజుల పాటు ప్రతిరోజూ యూరియా కోసం తిప్పలు పడాల్సి వచ్చింది. రైతులు ఎంత మొ త్తుకున్నా ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించడంతో చేసేదేమీలేక ఊసురుమంటూ బస్తా యూరియాతోనే పనులు ప్రారంభించారు.

తిరగడానికే సరిపోతుంది

మొన్నటి వరకు రైతులు పండించిన తమ పంటలను అమ్ముకోవడానికే తిరగాల్సివచ్చింది. నెలల తరబడి ధాన్యం కల్లాల్లోనే ఉండిపోయింది. చివరికి నష్టాలకు అమ్ముకున్నరు. మళ్లీ ఇప్పుడు యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఎకరానికి రెండు బస్తాల యూరియా ఏ మూలకూ సరిపోదు. పైగా అది ఎప్పుడు, ఎక్కడ వస్తుందో తెలియని పరిస్థితి. రైతు జీవితం మొత్తం ఉరుకుల పరుగులమైపోయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతులకు అన్నీ కష్టాలే.

-కొమ్ము నరేశ్‌, రైతు, గోన్‌గొప్పుల్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana