Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెళ్లి మళ్లీ.. రావయ్యా.. గ్రేటర్‌లో గణనాథులకు ఘనమైన వీడ్కోలు

వెళ్లి మళ్లీ.. రావయ్యా.. గ్రేటర్‌లో గణనాథులకు ఘనమైన వీడ్కోలు

  • ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం 2 గంటల ఆలస్యం
  • పోలీసులతో ఉత్సవ సమితి ప్రతినిధుల వాగ్వాదం
  • నిమజ్జనోత్సవంలో 'ఆయా షేర్‌’ ట్రెండింగ్‌
  • నృత్యాలతో కన్నుల పండువగా సాగిన శోభాయాత్ర
  • నేడు నిమజ్జనాలు కొనసాగే అవకాశం

సిటీబ్యూరో, సెప్టెంబరు 25 (నమస్తే తెలంగాణ) దండాలయ్యా ఉండ్రాలయ్యా.. బొజ్జ గణపయ్య.. వెళ్లిరావయ్యా అంటూ గ్రేటర్‌ వాసులు శోభాయమానంగా సాగనంపారు. లంబోదరా నమోః నమోః అంటూ దూప దీప, నైవేద్యాలతో భక్తుల సేవలందుకున్న లంబోదరుడు శుక్రవారం నిమజ్జనంతో గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. కన్నుల పండువగా సాగిన ఈ శోభాయాత్ర నగర వీధుల్లో పగలు, రాత్రి సందడిగా సాగింది. లక్షలాది మంది భక్తుల భజనలు, నృత్యాలతో సాగిన యాత్రలు గణనాథుని ఘనమైన వీడ్కోలు పలికాయి.

హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్‌, బాలాపూర్‌ భారీ గణనాథులతో పాటు దాదాపు ఐదు వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. అయితే ఉస్మానియా, పురానాపూల్‌, అఫ్జల్‌గంజ్‌, చార్మినార్‌ వైపు శోభాయాత్ర నెమ్మదిగా సాగడంతో ఈ ప్రభావం శనివారం వరకు ఉండనుంది. ఈ సందర్భంగా రెండో రోజు హుస్సేన్‌సాగర్‌ నిమజ్జన సందడి కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాగా నిమజ్జన వ్యర్థాలను అధికారులు ఎప్పటికప్పుడు తరలిస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌ నుంచి కవాడిగూడ డంపింగ్‌ యార్డు, అక్కడి నుంచి జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 6వేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. రెండు రోజుల్లోగా క్లీన్‌ సాగర్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

ఎంజే మార్కెట్‌ వద్ద ఉద్రిక్తం

భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి, హిందూ సంఘాల నాయకులను ఎంజే మార్కెట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కారు పాస్‌ ఉన్న వాళ్లను లోపలికి అనుమతించాలని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి విన్నవించగా..ఆరగంట పాటు వాహనాన్ని పోలీసులు ఆపారు. ఈ సందర్భంగా హిందూ సంఘాలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. గణనాథుడి శోభాయాత్రలో ట్రెండింగ్‌ సాంగ్‌ 'ఆయా షేర్‌’ డీజే సౌండ్‌కు భక్తులు ఉత్సాహంతో ఊగిపోయారు. ఖైరతాబాద్‌ భారీ వినాయకుడి వద్ద ఎమ్మెల్యే దానం నాగేందర్‌, పోలీసులతో కలిసి మాస్‌ స్టెప్పులతో భక్తుల్లో మరింత జోష్‌ నింపారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని సైతం ఉత్సాహపరుస్తూ ఆయన చేసిన డ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకవైపు ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు ఈ విధమైన జోరుతో హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనోత్సవం ఉత్సాహభరితంగా సాగింది.

ఏరియల్‌ వ్యూ

హైదరాబాద్‌ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌, డీజీపీ సీవీ ఆనంద్‌, సీపీ సజ్జనార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ ప్రియాంక అలాలు బేగంపేట విమానాశ్రయం నుండి చాపర్‌లో నగరంలో జరుగుతున్న వినాయక నిమజ్జన ప్రక్రియను ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. గణేష్‌ నిమజ్జన ఉత్సవాన్ని ప్రజలు ఆహ్లాదకరంగా జరుపుకున్నారని, నిమజ్జనానికి ముందు రోజే నిర్వాహకులు సహకరించి నిమజ్జనం చేశారని హైదరాబాద్‌ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం మధ్యాహ్నం లోపే నిమజ్జనం అవుతాయని ఆశిస్తున్నామని, వర్కింగ్‌ డే రోజు ఇబ్బందులు పడకుండా ప్రజలందరూ సహకరించాలని మంత్రి కోరారు.

శోభాయాత్ర సాగిందిలా..

ఖైరతాబాద్‌, సెప్టెంబర్‌ 25 : 'మహా' నిమజ్జన ఘట్టం ముగిసింది. ఖైరతాబాద్‌లో 11 రోజులపాటు పూజలందుకున్న పంచముఖ సంకటహర మహాగణపతి శోభాయాత్ర శుక్రవారం ఉదయం 9.35గంటలకు శోభాయమానంగా ప్రారంభమైంది. ఉదయం 7గంటలకే ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర క్రేన్‌ మోరాయించడంతో రెండున్నర గంటల ఆలస్యమైంది.

ఉదయం 9.35 శోభాయాత్ర ప్రారంభం

10.20 సెన్షేషన్‌ థియేటర్‌
10.35 రాజ్‌దూత్‌ చౌరస్తా
10.45 హోమ్స్‌ సైన్స్‌ కళాశాల
11.30 తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ చౌరస్తా
12.14 లుంబినీ పార్కు
12.40 క్రేన్‌ నం.4 వద్దకు మహాగణపతి
1.15 తుది పూజలు, 1.39 కలష పూజ
2.01 క్రేన్‌తో పైకి లిఫ్ట్‌
2.43 గంటలకు సంపూర్ణ నిమజ్జనం

భక్తి ప్రవత్తులతో శోభాయాత్ర

ఉదయం నుంచే నగరంలోని అనేక మండపాల వద్ద పూజలు నిర్వహించి గణేష ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగిస్తూ హుస్సేన్‌సాగర్‌, సరూర్‌నగర్‌, సఫిల్‌గూడ, కూకట్‌పల్లి తదితర చెరువుల్లో నిమజ్జనం చేసేందుకు వేల సంఖ్యలో విగ్రహాలు బయలుదేరడంతో నగర వీధులన్నీ భక్తులతో పోటెత్తాయి. గణేష్‌ నిమజ్జనం సందర్భంగా కిలోమీటర్ల పొడవున నగరం ప్రధాన రహదారుల్లో ఉత్సవ విగ్రహాలు బారులు తీరాయి. హైదరాబాద్‌ నగరంలో దశాబ్దాల నుంచి అనుసరిస్తున్న సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది కూడా బాలాపూర్‌ గణపతికి గంటలకు గణేష్‌ ఉత్సవ సమితి ప్రత్యేక పూజలు జరిపి సామూహిక వినాయక నిమజ్జన యాత్రను ప్రారంభించారు. గ్రామ పుర వీధుల గుండా భక్తి భజన పాటలతో డప్పుల దరువులతో ఊరేగింపు కొనసాగింది.

గ్రామ ప్రధాన కూడలికి గణనాథుడు వచ్చిన తర్వాత 11 గంటలకు లడ్డూ వేలం పాటను ప్రారంభించారు. లడ్డూ వేలం కాగానే బాలాపూర్‌ గణనాథుని శోభాయాత్ర ఉదయం ప్రారంభమైంది. బాలాపూర్‌ నుంచి 19 కిలోమీటర్లు శోభాయాత్రగా చంద్రాయణ గుట్ట, ఫలక్‌నుమా, శాలిబండ, చార్మినార్‌, అఫ్జల్‌గంజ్‌, మోహింజాయి మార్కెట్‌, నాంపల్లి మీదుగా హుస్సేన్‌సాగర్‌కు తరలించారు. ఇక 69 అడుగుల పంచముఖ సంకటహార మహాగణపతి ఖైరతాబాద్‌ భారీ గణనాధుడు మధ్యాహ్నం 2.25గంటలకు నిమజ్జనమైంది. ముందు అనుకున్న సమయం కంటే 2 గంటలు ఆలస్యం కావడం గమనార్హం.

ఖైరతాబాద్‌ గణనాధుడికి సాగర్‌లో విజయవంతంగా నిమజ్జనం చేశారు. సుమారు 8 గంటలకు పైగా కొసాగిన శోభాయాత్ర ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నం. 4 వద్దకు మధ్యాహ్నం 1.45 గంటలకు చేరుకుంది. తుది పూజల అనంతరం మధ్యాహ్నం 2.25 గంటలకు మహాగణపతి నిమజ్జనం చేయడంతో 'మహా' ఘట్టం ముగిసింది. ఈ క్రమంలోనే వివిధ రూపాల వినాయకులను సందర్శిస్తూ జంట నగరాల ప్రజలు రోడ్లపై గంటల కొద్ది గణనాథుడి తిలకించారు. సాగర తీరంలో బారులు తీరడంతో ట్యాంక్‌బండ్‌ ఉత్సవ విగ్రహాలు, భక్తులతో పోటెత్తాయి. జై జై గణేశా అంటూ జయజయ ధ్వానాలు పలుకుతూ సాగిన యాత్రలో గణనాథునికి అభిషేకాలు, దూప దీప, నైవేద్యాలతో మహిళలు భక్తిపూర్వకంగా హుస్సేన్‌ సాగర్‌, సరూర్‌నగర్‌ చెరువు, కూకట్‌పల్లి చెరువు వద్ద ఘనమైన వీడ్కోలు పలికారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana