- లాక్‌డౌన్ అనంతరం పంపిణీ వేగవంతం
- జిల్లాకు ప్రతినెలా ఐదు వేల పాసుపుస్తకాలు రాక
- పోస్టాఫీసు ద్వారా అందజేత
- పార్ట్-బీ భూముల సమస్యలపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి
- ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్న అధికారులు
- హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
వికారాబాద్ జిల్లా రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండడంతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను అధికారులు జారీ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,72,901 మంది రైతులుండగా ఇప్పటివరకు 2,61,233 మందికి కొత్త పాసుపుస్తకాలను అందించారు.
వికారాబాద్, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌తో స్తంభించిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం వేగవంతమైంది. పదిహేను రోజులుగా పెండింగ్‌లో ఉన్న డిజిటల్ సంతకాలతోపాటు తక్కు వ విస్తీర్ణమున్న భూములను ఎక్కువ విస్తీర్ణమున్నట్లుగా పట్టాలివ్వడం, ఆధార్ సీడింగ్, కోర్టు కేసులో ఉన్న భూముల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. అయితే ప్రధానంగా తక్కువ విస్తీర్ణం ఉన్న భూములకు ఎక్కువున్నట్లుగా ఆన్‌లైన్‌లో పొందుపర్చడంతోపాటు పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేయడమే ప్రస్తుతం రెవెన్యూ సిబ్బందికి తలనొప్పిగా మారింది. అయితే ఎక్కువ విస్తీర్ణమున్నట్లు పట్టాలు జారీ అయిన సర్వే నెంబర్‌లో ఎవరెవరి పేరిట ఉంది, ఎంతెంత భూమి ఉంది తదితర పూర్తి వివరాలను సేకరించి సమస్యలను పరిష్కరించేందు కు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే చాలా వరకు ఆయా మండలాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు ఆన్‌లైన్‌లో పొందుపర్చే సమయంలో చేసిన తప్పులతోనే తక్కువ విస్తీర్ణంగల భూమి ఎక్కువ విస్తీర్ణం ఉన్నట్లు పట్టాలిచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా కొందరు వీఆర్వోలు అవినీతికి పాల్పడి బోగస్ పాసు పుస్తకాలను సృష్టించి కూడా బోగస్ లబ్ధిదారులను చేర్చి ఉండొచ్చనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా తక్కువ భూమిని ఎక్కువగా చూపించడంలో ఎక్కడ తప్పు జరిగిందనేది గుర్తించి తప్పులను సవరించడంతోపాటు సంబంధిత పట్టాదారు పాసుపుస్తకాలను రద్దు చేసి సంబంధిత రైతులకు తిరిగి ఇవ్వనున్నారు. అయితే పట్టాలు జారీ చేసిన భూ ముల్లో అసైన్డ్ భూములతోపాటు పట్టా భూములు కూడా ఉన్నా యి. జిల్లాలోని పూడూర్ మండలంలోనే అధిక మొత్తంలో ఇలాంటి రెవెన్యూ సమస్యలున్నట్లు జిల్లా రెవెన్యూ యంత్రాం గం గుర్తించింది. పూడూర్ మండలంతోపాటు మర్పల్లి, దోమ, బషీరాబాద్, కోట్‌పల్లి మండలాల్లో అధికంగా ఉన్నట్లు రెవెన్యూ అధికారుల పరిశీలనలో తేలింది. అయితే రెవెన్యూ యంత్రాంగం గుర్తించిన వాటిలో...పూడూరు మండలం ఎన్కెపల్లి గ్రామ పంచాయతీలోని సర్వే నెంబర్ 99లో వాస్తవానికి 8 ఎకరాల భూమి ఉంది. అయితే ఈ సర్వే నెంబర్‌లో 170 ఎకరాలున్నట్లు రెవెన్యూ యంత్రాంగం పట్టాలు జారీ చేశారు. అదేవిధంగా అదే గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 100లో 2.23 ఎకరాల భూమి ఉండగా 14 ఎకరాల భూమి ఉన్నట్లు పట్టాలు జారీ చేశారు, అయితే సుమారు 12 ఎకరాల భూమిని ఎక్కువగా చూపిస్తూ పట్టాలిచ్చారు.
2,61,233 ఖాతాదారులకు పాసుపుస్తకాలు జారీ...
జిల్లావ్యాప్తంగా భూ రికార్డుల ప్రక్షాళన 95 శాతంమేర పూర్తయ్యింది. జిల్లాలో ఇప్పటివరకు 2,61,233 ఖాతాదారులకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. మరో 9,435 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందాల్సి ఉంది. మరోవైపు పార్ట్-బి(వివాదాస్పద) భూముల సమస్యలకు సం బంధించి ఎక్కువగా కోర్టు కేసులతోపాటు అసైన్డ్, దేవాదాయ తదితర భూ సమస్యలుండగా, పార్ట్-బి భూముల సమస్యలకు సంబంధించి కూడా ఒక్కొక్కటిగా జిల్లా రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తూ వస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో మొత్తం 2,72,901 రైతు ఖాతాలు ఉండగా ఇప్పటివరకు 2,61,233 ఖాతాలకు పట్టాదారు పాసుపుస్తకాలను జిల్లా రెవెన్యూ యంత్రాంగం పంపిణీ చేసింది.
దౌల్తాబాద్ మండలంలో 16,940 ఖాతాదారులకు, కొడంగల్‌లో 16361, వికారాబాద్‌లో 9466, పరిగిలో 17381, బొంరాసుపేట్‌లో 16789, పూడూర్‌లో 16985, మర్పల్లిలో 16921, మోమిన్‌పేట్‌లో 14315, యాలాల్‌లో 13418, తాండూర్‌లో 15007, పెద్దేముల్‌లో 13358, బషీరాబాద్‌లో 13150, నవాబుపేట్‌లో 15262, కోట్‌పల్లిలో 8010, దోమలో 14181, ధారూర్‌లో 13369, బంట్వారంలో 6212, కుల్కచర్ల మండలంలో 14,188 మంది ఖాతాదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అయ్యాయి.
పెండింగ్‌లో 9435 పాసు పుస్తకాలు...
జిల్లాలో 2,72,901 ఖాతాలుండగా 9435 ఖాతాదారులకు సంబంధించి ఇప్పటివరకు పట్టాదారు పాసు పుస్తకాల జారీ పెండింగ్‌లో ఉంది. అయితే ప్రధానంగా ఆధార్ కార్డు వివరాలను అందజేయని రైతులకు సంబంధించిన పాసు పుస్తకాలే పెండింగ్‌లో ఉన్నట్లు జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలుమార్లు ఆధార్ అనుసంధానానికి రైతులకు రెవె న్యూ సిబ్బంది ద్వారా సమాచారం అందించినప్పటికీ సంబంధిత రైతులు గ్రామాల నుంచి వలసలు వెళ్లడంతో ఆధార్ కార్డుల వివరాలను అందజేయడంలేదని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అంతేకాకుండా వీఆర్వోల నిర్లక్ష్యంతోనే చాలా వర కు పట్టాదారు పాసు పుస్తకాల జారీ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.
క్షేత్రస్థాయిలో వీఆర్వోలు డబ్బులు ఆశించే చాలా మంది రైతుల ఖాతా నెంబర్లు తప్పులు రాయడం, సర్వే నెంబర్లను తప్పుగా నమోదు చేయడం, భూ విస్తీర్ణాన్ని తప్పుగా రాయడంతోనే రైతులు పాసు పుస్తకాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. వీఆర్వోలు చేసిన తప్పిదాలతోనే ప్రస్తుతం రైతులు పాసు పుస్తకాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే సంబంధిత సమస్యలపై జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారమవుతున్నాయి. అయితే జిల్లావ్యాప్తంగా 9435 పట్టాదారు పాసు పుస్తకాలు పెండింగ్‌లో ఉం డగా,...అత్యధికంగా నవాబుపేట్ మండలంలో 1383 ఖాతా లు, పరిగి మండలంలో 1291 ఖాతాలు, పూడూర్ మండలంలో 747 ఖాతాదారులకు పాసు పుస్తకాలు జారీ చేయాల్సి ఉంది. అదేవిధంగా త్వరలో జిల్లాలోని వివాదస్పద(పార్ట్-బి) భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి పాసు పుస్తకాలను జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే పార్ట్-బి భూముల్లోని అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ తదితర భూ సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే గ్రామ సభలు కూడా నిర్వహించారు.

